Gadipalli kavita
-
మీరు రాజీనామా చేస్తే నేనూ సిద్ధమే..
ఖమ్మం జెడ్పీ సెంటర్ : టీడీపీలో కొనసాగుతున్న ఆ నలుగురు నేతలు ప్రతీరోజూ పార్టీ మారనని దూషణలకు దిగుతున్నారని, వాళ్లను, ఆ పార్టీని ఎన్నడూ విమర్శించలేదని, కుట్రలతో విమర్శలు చేస్తున్న నాయకులకు ధైర్యముంటే రాజీనామా చేయాలని, అందుకు తానుకూడా సిద్ధమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత సవాల్ విసిరారు. శుక్రవారం ఆమె క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను టీడీపీ కోసం అహర్నిషలు పని చేశానని, ఉద్యోగాన్ని సైతం వదులుకుని అంకితభావంతో కార్యకర్తగా ఉన్నానని అన్నారు. ప్రజల ఆదరణతో చైర్‌పర్సన్‌ను అయ్యానని వివరించారు. జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీల అందరి నిర్ణయంతో, ప్రజలందరి మద్దతుతోనే తుమ్మల నాయకత్వంలో జిల్లాను అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్లోకి వెళ్లామని వివరించారు. విమర్శలు చేస్తున్న నాయకులను ఎన్నికల్లో గెలిపించేందుకు,అన్ని వర్గాల ప్రజలు, నేతలు, కార్యకర్తల కృషి, ఓట్లతో గెలిచారని, మమ్మల్ని రాజీనామ చేయమనే ముందు వారు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు తానుకూడా రాజీనామాకు సిద్ధమేనన్నారు. విమర్శలను ఇకనైనా మానుకోవాలని లేకుంటే బహిరంగ చర్చకు రావాలన్నారు. అసలు రాజీనామా ఎందుకు చేయాలనేది ముందు చెప్పాలన్నారు. చర్చకు వస్తానంటే అది ప్రెస్ క్లబ్,సంచాయతీరాజ్ కమిషనర్ వద్ద, అసెంబ్లీలోనా ఎక్కడైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కన్నతల్లిలాంటి పార్టీని ముంచాలనే లక్ష్యంతో ప్రతీసారి నాయకులకు వెన్నుపోటు పొడిచారని, అదే తరహాలో తనకు సైతం 2000 సంవత్సరంలో కొత్తగూడెం చైర్మన్‌గా పనిచేసిన సమయంలో, ఇటివల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం అదే ధోరణితో వ్యవహరించారని అన్నారు. 2010లో సైతం పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలిగా ఎంపిక చేస్తే అప్పుడు చంద్రబాబుతో ఒత్తిడి తెప్పి అడ్డుకున్నారని అన్నారు. అలాగే చైర్ పర్సన్ ఎన్నిక రోజు కూడా అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు. అయినా ఎన్నాడు ఎవరిని వ్యక్తి గతంగా దూషించలేదని, సహనం ఓర్పుతో ఉన్నా ఇంకా ఇలాంటి విమర్శలకు దిగడం సరికాదని అన్నారు. కేసిఆర్ కాళ్ళు మొక్కి అత్మగౌరవాన్ని తాకట్టు పెట్టానని విమర్శలు చేస్తున్నారని, పెద్దలను గౌరవించడం మన సంస్కృతి సంప్రదాయమని, చైర్ పర్సన్‌గా ఎన్నికైన రోజు కూడా టీడీపీలోని సీనియర్ నాయకులు పంచాక్షరయ్య కాళ్లకు మొక్కానని, అంత మాత్రాన అది కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టినట్లేనా అని ప్రశ్నించారు. ఆరోజు మాట్లాడని నాయకులు ఈ రోజు విమర్శల చేయడం సహేతుకం కాదన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాయకత్వంతో జిల్లాను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు ప్రభంజనంలా వెళ్లామని గుర్తు చేశారు. -
సమష్టిగా పనిచేద్దాం.. సమగ్రాభివృద్ధి సాధిద్దాం
జడ్పీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో చైర్పర్సన్ గడిపల్లి కవిత ఖమ్మం జెడ్పీసెంటర్: ఉద్యోగులు, ప్రజాప్రతినిధులనే తేడా లేకుండా అందరం సమష్టిగా పనిచేద్దామని, జిల్లా సమగ్రాభివృద్ధి సాధిద్దామని జిల్లాపరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. జిల్లాపరిషత్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం నగర శివారులోని చెరుకూరి వారి మామిడి తోటలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకమైనదని అన్నారు. జిల్లాపరిషత్ సీఈవో జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అప్పగించిన ప్రతి పనిని బాధ్యతాయుతంగా పూర్తి చేస్తున్నందునే జడ్పీకి మంచి పేరు వచ్చిందన్నారు. ఉద్యోగులు, అధికారుల మధ్య చక్కటి సమన్వయూనికి ఈ ఆత్మీయ సమ్మేళనం దోహదపడుతుందన్నారు. డిప్యూటీ సీఈవో కర్నాటి రాజేశ్వరి మాట్లాడుతూ.. సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో పీఆర్ వ్యవస్థ ముందుంటోందని అన్నారు. జిల్లాపరిషత్ ఏఓ వింజం అప్పారావు మాట్లాడుతూ.. జిల్లాపరిషత్ కుటుం బమంతా ఇలా గడపడం ఆనందంగా ఉందన్నారు. పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నడింపల్లి వెంకటపతిరాజు మాట్లాడుతూ.. జడ్పీ ఉద్యోగులమంతా సమన్వయంతో పనిచేశామని, పలు కార్యక్రమాల అమలులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేశామని అన్నారు. దీనిని మున్ముందు కూడా కొనసాగిస్తామన్నారు. ఉద్యోగుల మధ్య స్నేహ సంబంధాల పెంపునకు ఈ సమ్మేళనం దోహదపడుతుందన్నారు. వచ్చేసారి జిల్లావ్యాప్తంగా పంచాయతీరాజ్ ఉద్యోగులందరితో సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. ఈ సమ్మేళనంలో భాగంగా జరిగిన పలు క్రీడాపోటీలలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాకారుల పాటలు ఆకట్టుకున్నాయి. -
ఏదో అనుకుంటే..
డాక్టర్ కావాలనుకున్నా..టీచర్నయ్యా.. * అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా.. * నాటి ఓటమే గెలుపునకు నాంది * ప్రజల ఆశీస్సులతోనే చైర్పర్సన్ అయ్యా * జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయం * ‘సాక్షి’తో జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత ఖమ్మం జెడ్పీసెంటర్ : ‘‘తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందంటారు..’ నా విషయంలో అదే జరిగింది. నేను మొదట్లో డాక్టర్ కావాలనుకున్నా. కానీ టీచర్నయ్యా. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా. నా రాజకీయ జీవితంలో అనేక ఒడిదొడుకులు ఎదురయ్యాయి. వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నా. ఈ పదవి నా జీవితానికి తొలిమెట్టు. కష్టపడితే ఫలితం వ స్తుంది..ఓటమి విజయానికి నాంది ఇలాంటి విషయాలెన్నో నా విషయంలో నిజమయ్యా యి’ అని జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత అన్నా రు. జిల్లా అభివృద్ధే ధ్యేయమంటున్న ఆమెతో ‘సాక్షి’ పర్సనల్ టచ్... టీచర్ నుంచి పొలిటీషన్ దాకా.. నాడు చదువుల్లో ఆదర్శ విద్యార్థినిగా నాకు గుర్తింపు ఉంది. అప్పట్లో డాక్టర్ కావాలనే కోరి క ఉండేది. కానీ పరిస్థితుల దృష్ట్యా 1998 డీఎస్సీలో అన్నపురెడ్డిపల్లి మండలం మర్రిగూడెం పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో చేరాను. 1994-96లో కొత్తగూడెం ఉమన్స్ కళాశాలలో పార్ట్‌టైం లెక్చరర్‌గా పనిచేశా. 1995లో కొత్తగూడెంకు చెందిన క్రిష్టప్రసాద్తో వివాహం జరిగింది. 2000లో టీచర్ పోస్టుకు రాజీనామా చేసి ఎన్నికల బరి లో నిలిచా. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయా. అయినా ప్రజల మధ్యనే గడిపాను. నా రాజకీ య గురువు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయన ప్రోద్బలంతోనే రాజకీయాలోకి వచ్చాను. ఆయన చేసిన అభివృద్ధి జిల్లాలో చెరగని ముద్ర. ఆయన శిష్యురాలిగా నేనూ ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలని ఉంది. తుమ్మల సహకారంతో అభివృద్ధి చేస్తా. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి.. రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తాను. ప్రజాప్రతినిధుల సహకారంతో పలు అభివృద్ధి పనులు చేపడుతాం. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాను. సీఎం కేసీఆర్ సహాకారంతో బయ్యా రం స్టీల్ ఫ్యాక్టరీ, మణుగూరు పవర్‌ప్లాంట్, మెడికల్ కాలేజీలు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషిచేస్తాను. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. ఓటమే విజయానికి బాటలైంది.. కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా 2000 సంవత్సరంలో పోటీచేసి ఓడిపోయాను. ఆ ఓటమే నా గెలుపునకు నాంది అయింది అనుకుంటా. 14 ఏళ్ల పాటు ప్రజలతో మమేకమై పనిచేశాను. ప్రజలకు సేవచేయాలనే తపన నాలో ధృడంగా ఉంది. చైర్పర్సన్ అయ్యాక ఆ భాద్యత మరింతగా పెరిగింది. జిల్లా అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతా. రాజకీయాల్లోకి వస్తానని ఎనాడూ అనుకోలేదు. టీచర్‌గా పనిచేసిన విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడమే కర్తవ్యంగా భావించా. ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి వెంట ఉంటే రాజకీయంగా ఏదైనా సాధించవచ్చుననే విషయం నేను చైర్‌పర్సన్‌గా ఎన్నికవడం ద్వారా తెలుసుకున్నా. మహిళా సంక్షేమానికి కృషి... సమాజంలో మహిళలు అనేక సవాళ్ళను..సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు మహిళలు చైతన్యం కావడంతో పాటు చదువు ఎంతో ముఖ్యం. చదువు ఉంటే మహిళలు అన్ని రంగాలలో రాణించగలుగుతారు. మహిళలకు మన కాళ్ళపై మనం నిలబడాలంటే ఆత్మ విశ్వాసం ముఖ్యం. కష్టాల్లో ఉన్న మహిళలను చూస్తే ఏదో ఆవేదన కలుగుతుంది. వారిని ఆదుకోవాలని అనిపిస్తుంది. అనేక రంగాలలో మహిళలు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. మహిళా సమస్యలపై పూనం మాలకొండయ్య, సౌమ్యమిశ్రాలను కలిశాను. గుడుంబా స్థావరాలను అరికట్టడంతో పాటు స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తాను. మహిళా సంక్షేమానికి ఎన్టీఆర్ పెద్ద పీట వేశారు. జనతా వస్త్రాలు, మహిళలపేరుతో ఇళ్ళపట్టాలు, రూ.2 కిలో బియ్యం, మధ్యపాన నిషేధం అమలు చేశారు. సమస్యలపై అవగాహన.. మధ్యతరగతి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. మామ గారు గడిపల్లి లక్ష్మయ్య కార్మిక నేత. అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయన వద్దకు ప్రతి రోజు అనేక మంది వచ్చి సమస్యలు చెబుతుండేవారు. చదవుకోవడం వల్ల సమాజంలో ప్రజా సమస్యలపై నాకు కూడా కొంతమేర అవగాహన ఉంది. నేను రాజకీయాల్లోకి వచ్చిన తరువాత మా కుటుంబ సభ్యులందరూ ప్రోత్సహించేవారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వ అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందించేందుకు కృషి చేస్తా. డాక్టర్‌గా సేవలందించాలనుకున్నా... మాది సామాన్య మధ్యతరగతి కుటుంబం. కొత్త్తగూడెం ఏజెన్సీ ప్రాంతం కావడంతో అప్పట్లో అంతగా అభివృద్ధి చెందలేదు. ప్రజలు నిత్యం రోగాల బారిన పడే వారు. ఆ కష్టాలను చూసి చలించిపోయా. ప్రజలు ఖరిదైన వైద్యం చేయించుకోలేక మంచాలపైనే మృత్యవాతకు గురైన సంఘటనలు అనేకం చూశాను. డాక్టర్నై ...ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన కలిగింది. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఉపాధ్యాయురాలిగా పని చేయాల్సి వచ్చింది. సమాజ సేవలో పాల్గొని చేతనైన సాయం చేశా. ఇంట్లో కూడా పూజల పేరుతో కాలయాపన, డబ్బు వృథా చేయకుండా ప్రజలకు సేవ చేయాలనే వారు. ఇప్పడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో నాకా అవకాశం కలిగింది. చేపలకూర బాగా చేస్తా.... నేనూ వంట చేయడంలో దిట్టనే... అన్నిటి కన్నా చేపలకూర బాగా చేస్తాను. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో అందరూ చికెన్, మటన్ బాగా చేస్తానని చెబుతారు. నాకు ఫ్రాన్స్, బెండకాయ ఫ్రై అంటే ఎంతో ఇష్టం. నేను ఉపాధ్యాయురాలిగా, రాజకీయాల్లో ఉన్న సమయంలోనూ కుటుంబ సభ్యులకు ఎంతో ఇష్టమైన వంటలు వండిపెట్టేదాణ్ని. కానీ చైర్పర్సన్ అయ్యాక గత నాలుగు నెలల కాలం నుండి ఇంట్లో టీ కూడా పెట్టుకొనే తీరికలేదు. -
జడ్పీ స్థాయీ సంఘాల ఎన్నిక పూర్తి
ఖమ్మం జడ్పీసెంటర్: జిల్లా పరిషత్‌లోని ఐదు స్థాయీ సంఘాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత అధ్యక్షతన మంగళవారం ఏర్పాటైన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. గత సమావేశంలో ఆర్థిక, పనుల కమిటీలను పూర్తి స్ధాయిలో ఎన్నుకోగా మిగతా ఐదు కమిటీల్లో కొందరు సభ్యులు సంతకాలు చేయకపోవడంతో మళ్లీ సమావేశం నిర్వహించారు. ఈ మిగిలిన పోయిన ఐదు కమిటీల సభ్యులను ఎన్నుకున్నారు. వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, మహిళా సంక్షేమ కమిటీల్లో చైర్పర్సన్ కోఆప్షన్ మెంబర్‌గా ఉంటారు. అశ్వాపురం జడ్పీటీసీ తోకల లత సమావేశానికి హాజరుకాకపోవడంతో ఇద్దరు జడ్పీటీసీ సభ్యులు ఆమె పేరును ప్రతిపాదించి, బలపరచడంతో ఆమె మహిళా సంక్షేమ కమిటీకి ఎన్నికయ్యారు. దీనితో జడ్పీ స్థాయీ సంఘాల ఎన్నిక పూర్తయింది. 1. ప్రణాళిక, ఆర్థిక కమిటీ అధ్యక్షురాలిగా చైర్పర్సన్ గడిపల్లి కవిత, సభ్యులుగా తల్లాడ, దమ్మపేట, కల్లూరు, కామేపల్లి, మణుగూరు, చండ్రుగొండ జడ్పీటీసీలు మూకర ప్రసాద్, దొడ్డాకుల సరోజిని, జె.లీలవతి, మేకల మల్లిబాబుయాదవ్, పాల్వంచ దుర్గ, కృష్ణారెడ్డితో పాటు మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు. 2. గ్రామీణాభివృద్ధి కమిటీ అధ్యక్షురాలిగా చైర్పర్సన్ కవిత, సభ్యులుగా జడ్పీటీసీలు ఎ. సత్యనారాయణమూర్తి (దుమ్ముగూడెం), అంకత మల్లికార్జున్ (అశ్వారావుపేట), చండ్ర అరుణ (ఇల్లెందు), జాడి జానమ్మ (పినపాక), గౌని ఐలయ్య (బయ్యారం), ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, అశ్వారావుపేట, ఖమ్మం ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పువ్వాడ అజయ్‌కుమార్ ఎన్నికయ్యారు. 3. వ్యవసాయ కమిటీ ఈ కమిటీ అధ్యక్షులుగా వైస్ చైర్మన్ బరపటి వాసు, సభ్యులుగా జడ్పీటీసీలు సోమిడి ధనలక్ష్మి (వాజేడు), వి.రామచంద్రనాయక్ (కూసుమంచి), గుగులోత్ బాషా (వేంసూరు), గోగ్గిల లక్ష్మి (గుండాల), జియావుద్దీన్ (కోఆప్షన్ సభ్యులు), ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికయ్యారు. 4. విద్య, వైద్య సేవల కమిటీ అధ్యక్షులుగా చైర్పర్సన్ కవిత, సభ్యులుగా లక్కినేని సురేందర్ (టేకులపల్లి), గిడ్లం పరంజ్యోతిరావు ( కొత్తగూడెం), కూరపాటి తిరీషా (చింతకాని), అంకశాల శ్రీనివాస్ (ఎర్రుపాలెం), మౌలాన (కోఆప్షన్ సభ్యులు), కొత్తగూడెం, మధిర ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావ్, మల్లు భట్టివిక్రమార్క ఎన్నికయ్యారు. 5. మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలిగా జడ్పీటీసీ తోటమళ్ల హరిత (చర్ల), సభ్యులుగా అనిత (నేలకొండపల్లి), మూడు ప్రియాంక (మధిర), తోకల లత (అశ్వాపురం), విజయ (తిరుమలాయపాలెం), పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్య ఎన్నికయ్యారు. 6. సాంఘిక సంక్షేమ కమిటీ అధ్యక్షురాలిగా సత్తుపల్లి జడ్పీటీసీ హసావత్ లక్ష్మి, సభ్యులుగా శ్యామల (ఏన్కూరు), తేజావత్ సోమ్మా (కొణిజర్ల), వాంకుడోతు రజిత (పెనుబల్లి), బి. అంజి (ముల్కలపల్లి), ఏఎస్ వెంకటేశ్వర్లు (జూలూరుపాడు), నాగేశ్వరరావు (ముదిగొండ) వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు బాణోత్ మదన్‌లాల్, సండ్ర వెంకటవీరయ్య ఎన్నికయ్యారు. 7. పనుల స్థాయీ కమిటీ అధ్యక్షురాలిగా చైర్పర్సన్ కవిత, సభ్యులుగా జడ్పీటీసీలు ఉన్నం వీరేందర్ (కారేపల్లి), ధరావత్ భారతి (ఖమ్మం రూరల్), వీరూనాయక్ (రఘునాథపాలెం), బాణోత్ కొండ (బోనకల్లు), బొర్రా ఉమాదేవి (వైరా), ఎద్దు మాధవి (గార్ల), ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎన్నికయ్యారు. -
ఉద్యమంలా ‘స్వచ్ఛ భారత్’
ఖమ్మం జెడ్పీసెంటర్ : దేశ పరిశుభ్రతకు ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడతామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో సోమవారం చేపట్టిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో స్వచ్ఛ భారత్ పేరు తో ప్రధాని బృహత్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. పరిశుభ్రమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పల్లెలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలన్నారు. జిల్లా వ్యాపంగా స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టేలా ప్రత్యేక కార్యచరణ చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీరాజ్, మండల పరిషత్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. చీపురుపట్టి... చైర్పర్సన్ కవిత చీపురు పట్టారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణాన్ని శుభ్రం చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా పరిషత్, పంచాయతీరాజ్ ఉద్యోగులు పాల్గొని ఉత్సాహంగా పరసరాలను శుభ్రం చేశారు. తొలుత జాతిపిత మహ్మతాగాంధీ విగ్రహనికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పరిసరాల పరిశుభ్రతపై ఉద్యోగులతో ప్రతిజ్ఙ చేయించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కర్నాటి రాజేశ్వరి, డీఈలు నవీన్, సుధాకర్‌రెడ్డి, మహేష్, పీఆర్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నడింపల్లి వెంకటపతిరాజు, నాయకులు రవీంద్రప్రసాద్, శ్రీనివాస్, సక్రియ, శంకర్, వాణిశ్రీ, వంశీ, దినేష్, మధు, రామకృష్ణరెడ్డి, చింపలరాజు, సుబ్రమణ్యం, నర్సింహరావు, కాశయ్య, చక్రపాణి పాల్గొన్నారు. -
తుమ్మల వెంటే మేమూ...
కొత్తగూడెం రూరల్ : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏ పార్టీలోకి వెళ్లినా అందులోనే తామూ చేరుతామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత తేల్చిచెప్పారు. కొత్తగూడెంలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో సోమవా రం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడా రు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తుమ్మలకు అ నుచరులు ఉన్నారని ఆయన ఏ పార్టీలో చేరితే అందులోనే వెళ్లేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తుమ్మల తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన అహర్నిషలు పాటుపడుతున్నారన్నా రు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు బిక్కసాని నాగేశ్వరరావు, కృష్ణమోహన్, మాజీ సర్పంచ్ భద్రు, బాణోతు సకు రామ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ బోయినపల్లి సుధాకర్, బొజ్జ్జానాయక్ తదితరులు పాల్గొన్నారు.