ఏదో అనుకుంటే..
డాక్టర్ కావాలనుకున్నా..టీచర్‌నయ్యా..
* అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా..
* నాటి ఓటమే గెలుపునకు నాంది
* ప్రజల ఆశీస్సులతోనే చైర్‌పర్సన్ అయ్యా
* జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయం
* ‘సాక్షి’తో జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత
ఖమ్మం జెడ్పీసెంటర్ : ‘‘తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందంటారు..’ నా విషయంలో అదే జరిగింది. నేను మొదట్లో డాక్టర్ కావాలనుకున్నా. కానీ టీచర్‌నయ్యా. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా. నా రాజకీయ జీవితంలో అనేక ఒడిదొడుకులు ఎదురయ్యాయి. వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నా. ఈ పదవి నా జీవితానికి తొలిమెట్టు. కష్టపడితే ఫలితం వ స్తుంది..ఓటమి విజయానికి నాంది ఇలాంటి విషయాలెన్నో నా విషయంలో నిజమయ్యా యి’ అని జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అన్నా రు. జిల్లా అభివృద్ధే ధ్యేయమంటున్న ఆమెతో ‘సాక్షి’ పర్సనల్ టచ్...
టీచర్ నుంచి పొలిటీషన్ దాకా..
నాడు చదువుల్లో ఆదర్శ విద్యార్థినిగా నాకు గుర్తింపు ఉంది. అప్పట్లో డాక్టర్ కావాలనే కోరి క ఉండేది. కానీ పరిస్థితుల దృష్ట్యా 1998 డీఎస్సీలో అన్నపురెడ్డిపల్లి మండలం మర్రిగూడెం పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో చేరాను. 1994-96లో కొత్తగూడెం ఉమన్స్ కళాశాలలో పార్ట్‌టైం లెక్చరర్‌గా పనిచేశా. 1995లో కొత్తగూడెంకు చెందిన క్రిష్టప్రసాద్‌తో వివాహం జరిగింది. 2000లో టీచర్ పోస్టుకు రాజీనామా చేసి ఎన్నికల బరి లో నిలిచా. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయా. అయినా ప్రజల మధ్యనే గడిపాను. నా రాజకీ య గురువు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయన ప్రోద్బలంతోనే రాజకీయాలోకి వచ్చాను. ఆయన చేసిన అభివృద్ధి జిల్లాలో చెరగని ముద్ర. ఆయన శిష్యురాలిగా నేనూ ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలని ఉంది. తుమ్మల సహకారంతో అభివృద్ధి చేస్తా.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి..
రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తాను. ప్రజాప్రతినిధుల సహకారంతో పలు అభివృద్ధి పనులు చేపడుతాం. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాను. సీఎం కేసీఆర్ సహాకారంతో బయ్యా రం స్టీల్ ఫ్యాక్టరీ, మణుగూరు పవర్‌ప్లాంట్, మెడికల్ కాలేజీలు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషిచేస్తాను. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషి చేస్తాం.
ఓటమే విజయానికి బాటలైంది..
కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా 2000 సంవత్సరంలో పోటీచేసి ఓడిపోయాను. ఆ ఓటమే నా గెలుపునకు నాంది అయింది అనుకుంటా. 14 ఏళ్ల పాటు ప్రజలతో మమేకమై పనిచేశాను. ప్రజలకు సేవచేయాలనే తపన నాలో ధృడంగా ఉంది. చైర్‌పర్సన్ అయ్యాక ఆ భాద్యత మరింతగా పెరిగింది. జిల్లా అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతా. రాజకీయాల్లోకి వస్తానని ఎనాడూ అనుకోలేదు. టీచర్‌గా పనిచేసిన విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడమే కర్తవ్యంగా భావించా. ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి వెంట ఉంటే రాజకీయంగా ఏదైనా సాధించవచ్చుననే విషయం నేను చైర్‌పర్సన్‌గా ఎన్నికవడం ద్వారా తెలుసుకున్నా.
మహిళా సంక్షేమానికి కృషి...
సమాజంలో మహిళలు అనేక సవాళ్ళను..సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు మహిళలు చైతన్యం కావడంతో పాటు చదువు ఎంతో ముఖ్యం. చదువు ఉంటే మహిళలు అన్ని రంగాలలో రాణించగలుగుతారు. మహిళలకు మన కాళ్ళపై మనం నిలబడాలంటే ఆత్మ విశ్వాసం ముఖ్యం. కష్టాల్లో ఉన్న మహిళలను చూస్తే ఏదో ఆవేదన కలుగుతుంది. వారిని ఆదుకోవాలని అనిపిస్తుంది. అనేక రంగాలలో మహిళలు ముఖ్య భూమిక పోషిస్తున్నారు.
మహిళా సమస్యలపై పూనం మాలకొండయ్య, సౌమ్యమిశ్రాలను కలిశాను. గుడుంబా స్థావరాలను అరికట్టడంతో పాటు స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తాను. మహిళా సంక్షేమానికి ఎన్టీఆర్ పెద్ద పీట వేశారు. జనతా వస్త్రాలు, మహిళలపేరుతో ఇళ్ళపట్టాలు, రూ.2 కిలో బియ్యం, మధ్యపాన నిషేధం అమలు చేశారు.
సమస్యలపై అవగాహన..
మధ్యతరగతి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. మామ గారు గడిపల్లి లక్ష్మయ్య కార్మిక నేత. అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయన వద్దకు ప్రతి రోజు అనేక మంది వచ్చి సమస్యలు చెబుతుండేవారు. చదవుకోవడం వల్ల సమాజంలో ప్రజా సమస్యలపై నాకు కూడా కొంతమేర అవగాహన ఉంది. నేను రాజకీయాల్లోకి వచ్చిన తరువాత మా కుటుంబ సభ్యులందరూ ప్రోత్సహించేవారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వ అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందించేందుకు కృషి చేస్తా.
డాక్టర్‌గా సేవలందించాలనుకున్నా...
మాది సామాన్య మధ్యతరగతి కుటుంబం. కొత్త్తగూడెం ఏజెన్సీ ప్రాంతం కావడంతో అప్పట్లో అంతగా అభివృద్ధి చెందలేదు. ప్రజలు నిత్యం రోగాల బారిన పడే వారు. ఆ కష్టాలను చూసి చలించిపోయా. ప్రజలు ఖరిదైన వైద్యం చేయించుకోలేక మంచాలపైనే మృత్యవాతకు గురైన సంఘటనలు అనేకం చూశాను. డాక్టర్‌నై ...ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన కలిగింది. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఉపాధ్యాయురాలిగా పని చేయాల్సి వచ్చింది. సమాజ సేవలో పాల్గొని చేతనైన సాయం చేశా. ఇంట్లో కూడా పూజల పేరుతో కాలయాపన, డబ్బు వృథా చేయకుండా ప్రజలకు సేవ చేయాలనే వారు. ఇప్పడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో నాకా అవకాశం కలిగింది.
చేపలకూర బాగా చేస్తా....
నేనూ వంట చేయడంలో దిట్టనే... అన్నిటి కన్నా చేపలకూర బాగా చేస్తాను. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో అందరూ చికెన్, మటన్ బాగా చేస్తానని చెబుతారు. నాకు ఫ్రాన్స్, బెండకాయ ఫ్రై అంటే ఎంతో ఇష్టం. నేను ఉపాధ్యాయురాలిగా, రాజకీయాల్లో ఉన్న సమయంలోనూ కుటుంబ సభ్యులకు ఎంతో ఇష్టమైన వంటలు వండిపెట్టేదాణ్ని. కానీ చైర్‌పర్సన్ అయ్యాక గత నాలుగు నెలల కాలం నుండి ఇంట్లో టీ కూడా పెట్టుకొనే తీరికలేదు.