సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ వంటి పంచాయతీరాజ్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. ఎన్నికలు జరపకపోవడంతో ప్రజాప్రతినిధులు లేకపోగా.. మరోవైపు అధికారులను ప్రభుత్వం నియమించలేదు. ఫలితంగా పంచాయతీరాజ్ పాలన పడకేసింది. ప్రధాన పోస్టులతోపాటు క్షేత్రస్థాయిలోని పోస్టులన్నింటినీ ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. దీంతో పర్యవేక్షణ కొరవడి.. పథకాలు సజావుగా సాగని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఆయా పనులు నత్తనడకన సాగుతున్నాయి.
దీనికితోడు సక్రమంగా నిధుల వ్యయం జరగడం లేదు. ఫలితంగా కేంద్రం తన వాటాగా ఇవ్వాల్సిన నిధుల్లో కోతపెడుతోంది. జిల్లాల్లో జిల్లా పరిషత్‌లు కీలకభూమిక పోషిస్తాయని తెలిసినా ప్రభుత్వం వాటిలోని పలు పోస్టులను భర్తీ చేయట్లేదు. 22 జిల్లా పరిషత్‌లకుగాను రెండు జిల్లాల్లోనే సీఈవో పోస్టులను భర్తీ చేసి మిగిలినవి వదిలేశారు. డిప్యూటీ సీఈవో పోస్టులదీ అదే గతి. మొత్తం పోస్టులన్నీ ఖాళీ. అకౌంట్స్ అధికారి(ఏవో) పోస్టుల పరిస్థితీ ఇంతే. ఈ పోస్టులన్నీ ఖాళీగా ఉంటే.. మరోవైపు జిల్లాపరిషత్‌ల్లో ఒక్కోచోట అదనంగా మూడు డిప్యూటీ సీఈవో పోస్టులను భర్తీ చేయాలన్న ప్రతిపాదనలుండడం గమనార్హం.
అంతటా ఖాళీలు: పలు సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అధికారులే అమలు చేయాల్సి ఉంటుంది. అయితే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు చక్కపెట్టాల్సిన మండల అభివృద్ధి అధికారుల(ఎంపీడీవో) పోస్టులు వంద వరకు ఖాళీగా ఉన్నాయి. మండలానికి, పంచాయతీలకు మధ్యవర్తిగా ఉంటూ పంచాయతీల పనితీరును పర్యవేక్షించాల్సిన ఈవోపీఆర్‌డీ పోస్టులు వందలసంఖ్యలో ఖాళీగా ఉంటే.. గ్రామాల్లో పనులు పర్యవేక్షించాల్సిన పంచాయతీ కార్యదర్శుల పోస్టులు వేల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి.
మరోవైపు ఉద్యోగుల సీనియారిటీ నిర్ణయాన్ని గందరగోళంగా మార్చడంతో పదోన్నతులు రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇన్‌చార్జిలతోనే పాలన నెట్టేయాలని సర్కారు భావిస్తోంది. పం చాయతీరాజ్ శాఖలో ఏం జరుగుతున్నదన్న విషయంపై సీఎం కిరణ్‌కానీ, ఆ శాఖ మంత్రి జానారెడ్డికానీ సంయుక్తంగా ఒక్క సమావేశమూ నిర్వహించకపోవడం గమనార్హం. పథకాలు గ్రామస్థాయిలో అమలవ్వాలంటే.. ఈ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. కానీ ఈ బాధ్యతను ప్రభుత్వం గుర్తించడం లేదన్న భావన వ్యక్తమవుతోంది. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రాముఖ్యత తెలిసి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. కాగా పలు పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇతర శాఖల అధికారులు డిప్యుటేషన్ పేరుతో తిష్టవేయడానికి ప్రయత్నిస్తుండగా.. వారికి మంత్రులు సహకారమందించడం కొసమెరుపు.
ప్రజాప్రతినిధుల్లేరు.. అధికారులూ లేరు
Published Mon, Nov 11 2013 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM
Advertisement
Advertisement