సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. సర్పంచుల పదవీకాలం ముగియగానే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం.. సుప్రీంకోర్టు ఆదేశాలు, రిజర్వేషన్ల అమలు, బీసీ గణన వంటి అంశాల్లో ఏకపక్షంగా వ్యవహరించి ఎన్నికల వాయిదాకు కారణం అవుతోందని పేర్కొన్నారు.
బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సర్పంచ్ వ్యవస్థను రద్దు చేసి పంచాయతీలను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని అనుకుంటోందని విమర్శించారు. రేషన్ కార్డులు, పెన్షన్‌లు, స్వయం ఉపాధి, పట్టాదారు పాసు పుస్తకాలు గ్రామసభల ద్వారానే ఇవ్వాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
టీఆర్‌ఎస్ కండువా కప్పుకోకుంటే అంతే..
టీఆర్‌ఎస్ కండువా కప్పుకోకుంటే ట్రాక్టర్లు, సబ్సిడీ వస్తువులు రాకుండా చేస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. మన ఊరు– మన ప్రణాళిక అని చెప్పారు కానీ మన ఊరు అక్కడే ఉంది కానీ ప్రణాళికలు ఎక్కడికో పోయాయని ఎద్దేవా చేశారు. కేంద్రం పంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా జాప్యం చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌కు మంత్రుల మీద, సచివాలయం మీద నమ్మకం లేదని వ్యాఖ్యానించారు.
మంత్రివర్గాన్ని సీఎం నిర్వీర్యం చేశారని, మంత్రులకు తెలియకుండానే ప్రగతిభవన్‌లో సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. దీంతో మంత్రులు చూపుడు గుర్రాలుగా మారారని విమర్శించారు. ధర్నా చౌక్ ఎత్తివేసి తెలంగాణలో పోలీసు రాజ్యం నడిపిస్తున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ కమిటీలు, ప్రతిపక్షాల మీద కూడా ఈ ప్రభుత్వానికి నమ్మకం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment