సిబ్బంది లేక.. పథకాలు పడక
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టపరుస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటనలు చేస్తున్నా.. ఆ శాఖలో వివిధ స్థాయిల్లో ఉద్యోగుల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులన్నీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలోనే జరగాల్సి ఉంది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు దీని పరిధిలోనే పనిచేస్తాయి. అయితే.. గత కొన్నేళ్లుగా పంచాయతీరాజ్ విభాగాన్ని సిబ్బంది కొరత వెంటాడుతోంది. దీంతో ప్రభుత్వ పథకాల అమలు, పర్యవేక్షణ పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ముఖ్యంగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి, పల్లెప్రగతి, ఈ-పంచాయతి వంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. క్షేత్రస్థాయిలో తగిన సంఖ్యలో సిబ్బంది లేకుండా పథకాలు రూపకల్పన చేస్తే ఫలితం ఉండదని గ్రామ పంచాయతీ సర్పంచులు పేర్కొంటున్నారు. ఒక్కో గ్రామానికి ఒక్కో పంచాయతీ కార్యదర్శి ఉండాల్సి ఉండగా... ఐదు నుంచే ఏడు గ్రామాల బాధ్యతలు ఒక్కరికే అప్పగిస్తున్నారని, ఇలా అయితే పథకాల అమలు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పరిషత్ సీఈవో పోస్టుల వరకు పంచాయతీరాజ్ శాఖలో వివిధ స్థాయిల్లో 2,917 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తాజాగా తేల్చారు. ఈ శాఖలో అన్ని పోస్టుల కలిపి మొత్తం 7,253 పోస్టులుండగా, ప్రస్తుతం 4,336 మంది సిబ్బందే ఉన్నారు.
ఆ ఆపరేటర్లకు ఏప్రిల్ నుంచి జీతాలు ఇవ్వొద్దు
పంచాయతీరాజ్‌లో కాంట్రాక్ట్ ఏజెన్సీ కింద పనిచేస్తున్న 1,313 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లకు త్వరలోనే మంగళం పాడాలని పంచాయతీరాజ్ విభాగం నిర్ణయించింది. గ్రామ పంచాయతీల్లో వివరాల నమోదు కోసం గతేడాది ఓ ప్రైవేటు కాంట్రాక్ట్ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వం వీరిని నియమించుకుంది.
ఈ ఏడాది మార్చి ఆఖరుకు సదరు ప్రైవేటు ఏజెన్సీ కాంట్రాక్ట్ కాలపరిమితి ముగియనున్నందున ఏప్రిల్ 1 తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వేతనాలు చెల్లించవద్దని ఉన్నతాధికారుల నుంచి పంచాయతీలకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘పల్లె సమగ్ర సేవా కేంద్రాల’ కోసం విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రైన్యూర్‌లను నియమిస్తున్నందున, డేటా ఎంట్రీ ఆపరేటర్ల అవసరం ఇకపై ఉండబోదని ఆ విభాగం అధికారి ఒకరు తెలిపారు.