
చదువుకుని డిగ్రీలు తెచ్చుకోవడం ఒక ఎత్తైతే.. ఉద్యోగం సంపాదించడం మరో ఎత్తు అయిపోయింది. ఈ పోటీ ప్రపంచంలో నచ్చిన ఉద్యోగాలు దొరక్క కొందరు సతమవుతుంటే.. అసలు ఉద్యోగాలే లభించనివారు చాలామందే ఉన్నారు. మూడేళ్లు ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఓ వ్యక్తి.. సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట్లో దుమారం రేపుతోంది.
బెంగళూరుకు చెందిన 'ప్రశాంత్ హరిదాస్' అనే వ్యక్తి.. మూడు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విసుగెత్తిపోయి.. తనకు తానే లింక్డ్ఇన్‌లో 'రెస్ట్ ఇన్ పీస్' అని ఒక పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. మేమున్నాం అంటూ రిప్లై ఇస్తున్నారు.
పరిశ్రమ నాయకులారా, నన్ను దెయ్యంలా చూసి రిజెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు. నేను ఎంత మంచి వాడిని అయినా.. ఎన్ని రెకమెండేషన్స్ పెట్టినా.. ఈ పోస్ట్ పెట్టిన తరువాత నాకు జాబ్ ఇవ్వరని తెలుసు. నేను ఆత్మహత్య చేసుకోను. ఎందుకంటే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రుచి చూడాల్సిన వంటకాలు, సందర్శించాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అయితే సుమారు మూడు సంవత్సరాలు నిరుద్యోగిగా.. ఒంటరిగా ఉండటం చాలా కష్టం అని ప్రశాంత్ పోస్ట్ చేసాడు.

ఈ పోస్టుపై పలువురు స్పందించారు. నేను మీ మాటలు విన్నాను, మీ ప్రయాణం ఎంత కఠినంగా ఉందో ఊహించగలను. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఒంటరిగానే ఉంటాయి. కానీ మీ ప్రయత్నాలు వృధా కాదు. పట్టు వదలకుండా శ్రమించండి, అని ఒకరు కామెంట్ చేశారు.
ఇదీ చదవండి: ఆమె ఇచ్చిన సలహా.. గూగుల్ సీఈఓను చేసింది: ఎవరీ అంజలి?
మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను, మీ పట్ల సానుభూతి ఉంది. కరోనా మహమ్మారి మనందరినీ ఒంటరిని చేసింది. ప్రస్తుతం జాబ్ మార్కెట్ మునుపటిలా లేదు. తల పైకెత్తి చూడండి. నా నెట్‌వర్క్.. అనుభవం మీకు సహాయం చేయగలితే సంతోషిస్తాను అని ఇంకొకరు అన్నారు. ఇలా ఎవరికీ తోచిన రీతిలో.. వారు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.