ప్రభావం చూపని ‘ప్రియాసాఫ్ట్’ | Without the effect of 'priya soft' | Sakshi
Sakshi News home page

ప్రభావం చూపని ‘ప్రియాసాఫ్ట్’

Published Wed, May 28 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

Without the effect of 'priya soft'

 జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : పంచాయతీరాజ్ వ్యవస్థలోని సంస్థలకు వచ్చిన నిధులు, వ్యయం తదితర వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టేందుకు అమలు చేస్తున్న ప్రియా సాఫ్ట్‌వేర్ మండల పరిషత్, గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా అభివృద్ధి కలగానే మిగులుతోంది. దీంతో ఇచ్చిన ప్రతీ పైసాకు లెక్క తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్(ప్రియా సాఫ్ట్) స్టిస్టంను అమలులోకి తెచ్చింది.  
 
 అన్ని వివరాలూ ఆన్‌లైన్‌లోనే..
జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి వచ్చే పర్ క్యాపిటా, సీవరేజీ, స్టాంపు డ్యూటీ, టీఏడీఏ, బీఆర్‌జీఎఫ్, ఆర్థిక సంఘం నిధులు, ఏసీడీపీ, ఎస్‌ఎఫ్‌సీ, పైకా నిధుల వివరాలను ఈ సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తారు. ఆ నిధులతో చేపట్టిన పనుల వివరాలు, చెల్లింపులు, వ్యయం, వినియోగం తదితర అంశాలను ఎప్పటికప్పుడు అన్‌లైన్ చేయాల్సి ఉంటుంది. నిధులు ఎవరికి చెల్లించారో వారి పేరు, చెల్లించిన మొత్తానికి ఎంబీల రికార్డులు, బ్యాంకులకు జారీ చేసిన చెక్కుల వివరాలు కూడా తప్పకుండా జతచేయాల్సిందే. ఈ ఆన్‌లైన్ అకౌంటింగ్ విధానం 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది.
 
 అడ్రస్‌లేని ఎంబీలు
జిల్లాలోని పలు మండలాలతో పాటు మెజార్టీ గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనుల చెల్లింపులకు సంబంధించిన ఎంబీ రికార్డులు లేవన్న విషయం జిల్లా పరిషత్ అధికారుల పరిశీలనలో తేలింది. కొన్ని మండలాల్లో నిధులు డ్రా చేసుకున్నా క్యాష్‌బుక్కుల్లో ఎలాంటి వివరాలు లేకపోవడం వల్ల అన్‌లైన్ చేయలేక పోతున్నట్లు టైపిస్టులు ఇచ్చిన ఫిర్యాదులతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

దీనికితోడు అప్పుడు పనిచేసిన ఉద్యోగుల్లో కొందరు బదిలీ కావడం వల్ల వివరాలు దొరకడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఫిర్యాదులు అందిన మండలాలను గుర్తించిన జెడ్పీ సీఈఓ ఆంజనేయులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు తిన్న డబ్బులకు లెక్కలు చూపేందుకు ఆయా మండలాల్లోని ఉద్యోగులు నానా కష్టాలు పడతున్నారు. జిల్లాలోని 1006 గ్రామ పంచాయతీలకు గాను 812 పంచాయతీల్లో చెల్లింపుల వివరాలు అన్‌లైన్ చేయలేదు. ఈనెల 30వ తేదీలోగా 2013-14 ఆర్థిక సంవత్సరం వివరాలను అన్‌లైన్ చేయాలని సీఈఓ డెడ్‌లైన్ పెట్టడంతో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
 
 నామమాత్రంగా ఆడిట్
 ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే ఆడిట్ విభాగం ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆడిట్ చేయాలని కేంద్ర  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అమలుకావడం లేదు. ఈ సాఫ్ట్‌వేర్‌పై వినియోగంపై ఆడిట్ విభాగం వారికి శిక్షణ కూడా ఇచ్చారు. అయినా పాత పద్ధతిలోనే క్యాష్‌బుక్కుల్లో ఆడిట్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. తూతూమంత్రంగా ఆడిట్ నిర్వహించి మమ అనిపించేందుకు ఆడిట్ అధికారులు ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెతున్నాయి. అభివృద్ధి పనుల నిధులు స్వాహా కాకుండా ఆగాలంటే ప్రతీరోజూ పర్యవేక్షణ చేయడం ఒక్కటే మార్గమని జెడ్పీ అధికారులు అంటున్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement