వీరమ్మాల్ బామ్మతో ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియ సాహు
‘సేవకు వయసుతో పని ఏమిటి?’ అంటోంది 89 సంవత్సరాల వీరమ్మాళ్. ఈ బామ్మ తమిళనాడులోని అరిట్టపట్టి గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్. రకరకాల కార్యక్రమాలతో ఎప్పుడూ
బిజీగా ఉండే వీరమ్మాళ్ తన ఆరోగ్య రహస్యం ‘నిరంతర కష్టం’ అంటోంది...
మామూలుగానైతే బామ్మల మాటల్లో ‘మా రోజుల్లో’ అనేది ఎక్కువగా వినబడుతుంది. అది ఆ వయసుకు సహజమే కావచ్చుగానీ 89 సంవత్సరాల వీరమ్మాళ్ ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. నలుగురితో కలిసి నడుస్తుంది. వారి కష్టసుఖాల్లో భాగం అవుతుంది. వీరమ్మాళ్ విలేజ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మధురైలోని అరిట్టపట్టి గ్రామాన్ని తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర తొలి బయో డైవర్శిటీ సైట్‌గా ఎంపిక చేసింది.
అరిట్టపట్టిలో పుట్టి పెరిగి అక్కడే వివాహం అయిన వీరమ్మాళ్‌కు ఆ గ్రామమే ప్రపంచం. అలా అని ‘ఊరి సరిహద్దులు దాటి బయటకు రాదు’ అనే ముద్ర ఆమెపై లేదు. ఎందుకంటే గ్రామ సంక్షేమం, అభివృద్ధి కోసం ఉన్నతాధికారులతో మాట్లాడడానికి పట్టణాలకు వెళుతూనే ఉంటుంది. ‘ఫలానా ఊళ్లో మంచిపనులు జరుగుతున్నాయి’ లాంటి మాటలు చెవిన పడినప్పుడు పనిగట్టుకొని ఆ ఊళ్లకు వెళ్లి అక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేస్తుంటుంది. తన గ్రామంలో అలాంటి కార్యక్రమాలు అమలయ్యేలా కృషి చేస్తుంటుంది.
‘స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం’ అనే మాట గట్టిగా వినిపించని రోజుల్లోనే స్వయం–సహాయక బృందాలను ఏర్పాటు చేసి గ్రామంలోని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేది. రైతులకు వ్యవసాయ రుణాలు అందేలా ఆఫీసుల చుట్టూ తిరిగేది. మహిళలు గడప దాటి వీధుల్లోకి వస్తే... ‘ఇదేం చోద్యమమ్మా’ అని గుసగుసలాడుకునే కాలం అది.
వీరమ్మాళ్ మాత్రం గ్రామంలోని రకరకాల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఊళ్లు తిరిగేది. ఎవరు ఎలా మాట్లాడుకున్నా పట్టించుకునేది కాదు. ఆమె దృష్టి మొత్తం సమస్యల పరిష్కారంపైనే ఉండేది. విలేజ్ ప్రెసిడెంట్‌గా వాటర్ ట్యాంకులు, వాగులు దాటడానికి వంతెనలు నిర్మించింది. జల్ జీవన్ మిషన్ కింద ఎన్నో ఇండ్లకు తాగునీరు అందేలా చేసింది. వీధిలైట్ల నుంచి వీధుల పరిశుభ్రత వరకు అన్నీ దగ్గరి నుంచి చూసుకుంటుంది. అలా అని ఊళ్లో అందరూ వీరమ్మాళ్‌కు సహకరిస్తున్నారని కాదు.
ఎవరో ఒకరు ఏదో రకంగా ఆమె దారికి అడ్డుపడుతుంటారు. వారి నిరసన వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది. అలాంటి వారికి వీరమ్మాళ్ తరపున గ్రామస్థులే సమాధానం చెబుతుంటారు. గ్రామంలో వృథాగా పడి ఉన్న భూములను వినియోగంలోకి తీసుకువచ్చే విషయంపై దృష్టి పెట్టింది వీరమ్మాళ్. ‘పనికిరాని భూమి అంటూ ఏదీ ఉండదు. మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా, వృథాగా వదిలేస్తున్నామా అనే దానిపైనే ఆ భూమి విలువ ఆధారపడి ఉంటుంది’ అంటుంది వీరమ్మాళ్.
‘వీరమ్మాళ్ అంకితభావం గురించి ఆ తరం వాళ్లే కాదు ఈ తరం వాళ్లు కూడా గొప్పగా చెబుతుంటారు. గ్రామ అభివృధ్ధికి సంబంధించి ఎంతోమందికి ఆమె స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నాడు అరిట్టపట్టి విలేజ్ ఫారెస్ట్ కమిటీ హెడ్ ఆర్’ ఉదయన్. రోజూ ఉదయం అయిదు గంటలకు నిద్ర లేచే వీరమ్మాళ్ వంటపని నుంచి ఇంటి పనుల వరకు అన్నీ తానే స్వయంగా చేసుకుంటుంది. పొలం పనులకు కూడా వెళుతుంటుంది.
‘బామ్మా... ఈ వయసులో ఇంత ఓపిక ఎక్కడిది?’ అని అడిగితే– ‘నా గ్రామం బాగు కోసం నా వంతుగా కష్టపడతాను... అని అనుకుంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అదే శక్తిగా మారి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుడు నన్ను ఈ భూమి మీది నుంచి తీసుకుపోయే లోపు గ్రామ అభివృద్ధి కోసం నేను కన్న కలలు సాకారం కావాలని కోరుకుంటున్నాను’ అంటుంది వీరమ్మాళ్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుప్రియ సాహు అరిట్టపట్టి గ్రామానికి వచ్చి బామ్మను కలుసుకుంది. ‘వీరమ్మాళ్ బామ్మతో మాట్లాడడం, ఆమె నోటి నుంచి గ్రామ అభివృద్ధి ప్రణాళికల గురించి వినడం అద్భుతమైన అనుభవం’ అంటుంది సుప్రియ.
Comments
Please login to add a commentAdd a comment