village president
-
విలేజ్ పంచాయతీ ప్రెసిడెంట్: వీరమ్మాళ్ @ 89
‘సేవకు వయసుతో పని ఏమిటి?’ అంటోంది 89 సంవత్సరాల వీరమ్మాళ్. ఈ బామ్మ తమిళనాడులోని అరిట్టపట్టి గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్. రకరకాల కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే వీరమ్మాళ్ తన ఆరోగ్య రహస్యం ‘నిరంతర కష్టం’ అంటోంది... మామూలుగానైతే బామ్మల మాటల్లో ‘మా రోజుల్లో’ అనేది ఎక్కువగా వినబడుతుంది. అది ఆ వయసుకు సహజమే కావచ్చుగానీ 89 సంవత్సరాల వీరమ్మాళ్ ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. నలుగురితో కలిసి నడుస్తుంది. వారి కష్టసుఖాల్లో భాగం అవుతుంది. వీరమ్మాళ్ విలేజ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మధురైలోని అరిట్టపట్టి గ్రామాన్ని తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర తొలి బయో డైవర్శిటీ సైట్‌గా ఎంపిక చేసింది. అరిట్టపట్టిలో పుట్టి పెరిగి అక్కడే వివాహం అయిన వీరమ్మాళ్‌కు ఆ గ్రామమే ప్రపంచం. అలా అని ‘ఊరి సరిహద్దులు దాటి బయటకు రాదు’ అనే ముద్ర ఆమెపై లేదు. ఎందుకంటే గ్రామ సంక్షేమం, అభివృద్ధి కోసం ఉన్నతాధికారులతో మాట్లాడడానికి పట్టణాలకు వెళుతూనే ఉంటుంది. ‘ఫలానా ఊళ్లో మంచిపనులు జరుగుతున్నాయి’ లాంటి మాటలు చెవిన పడినప్పుడు పనిగట్టుకొని ఆ ఊళ్లకు వెళ్లి అక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేస్తుంటుంది. తన గ్రామంలో అలాంటి కార్యక్రమాలు అమలయ్యేలా కృషి చేస్తుంటుంది. ‘స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం’ అనే మాట గట్టిగా వినిపించని రోజుల్లోనే స్వయం–సహాయక బృందాలను ఏర్పాటు చేసి గ్రామంలోని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేది. రైతులకు వ్యవసాయ రుణాలు అందేలా ఆఫీసుల చుట్టూ తిరిగేది. మహిళలు గడప దాటి వీధుల్లోకి వస్తే... ‘ఇదేం చోద్యమమ్మా’ అని గుసగుసలాడుకునే కాలం అది. వీరమ్మాళ్ మాత్రం గ్రామంలోని రకరకాల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఊళ్లు తిరిగేది. ఎవరు ఎలా మాట్లాడుకున్నా పట్టించుకునేది కాదు. ఆమె దృష్టి మొత్తం సమస్యల పరిష్కారంపైనే ఉండేది. విలేజ్ ప్రెసిడెంట్‌గా వాటర్ ట్యాంకులు, వాగులు దాటడానికి వంతెనలు నిర్మించింది. జల్ జీవన్ మిషన్ కింద ఎన్నో ఇండ్లకు తాగునీరు అందేలా చేసింది. వీధిలైట్ల నుంచి వీధుల పరిశుభ్రత వరకు అన్నీ దగ్గరి నుంచి చూసుకుంటుంది. అలా అని ఊళ్లో అందరూ వీరమ్మాళ్‌కు సహకరిస్తున్నారని కాదు. ఎవరో ఒకరు ఏదో రకంగా ఆమె దారికి అడ్డుపడుతుంటారు. వారి నిరసన వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది. అలాంటి వారికి వీరమ్మాళ్ తరపున గ్రామస్థులే సమాధానం చెబుతుంటారు. గ్రామంలో వృథాగా పడి ఉన్న భూములను వినియోగంలోకి తీసుకువచ్చే విషయంపై దృష్టి పెట్టింది వీరమ్మాళ్. ‘పనికిరాని భూమి అంటూ ఏదీ ఉండదు. మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా, వృథాగా వదిలేస్తున్నామా అనే దానిపైనే ఆ భూమి విలువ ఆధారపడి ఉంటుంది’ అంటుంది వీరమ్మాళ్. ‘వీరమ్మాళ్ అంకితభావం గురించి ఆ తరం వాళ్లే కాదు ఈ తరం వాళ్లు కూడా గొప్పగా చెబుతుంటారు. గ్రామ అభివృధ్ధికి సంబంధించి ఎంతోమందికి ఆమె స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నాడు అరిట్టపట్టి విలేజ్ ఫారెస్ట్ కమిటీ హెడ్ ఆర్’ ఉదయన్. రోజూ ఉదయం అయిదు గంటలకు నిద్ర లేచే వీరమ్మాళ్ వంటపని నుంచి ఇంటి పనుల వరకు అన్నీ తానే స్వయంగా చేసుకుంటుంది. పొలం పనులకు కూడా వెళుతుంటుంది. ‘బామ్మా... ఈ వయసులో ఇంత ఓపిక ఎక్కడిది?’ అని అడిగితే– ‘నా గ్రామం బాగు కోసం నా వంతుగా కష్టపడతాను... అని అనుకుంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అదే శక్తిగా మారి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుడు నన్ను ఈ భూమి మీది నుంచి తీసుకుపోయే లోపు గ్రామ అభివృద్ధి కోసం నేను కన్న కలలు సాకారం కావాలని కోరుకుంటున్నాను’ అంటుంది వీరమ్మాళ్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుప్రియ సాహు అరిట్టపట్టి గ్రామానికి వచ్చి బామ్మను కలుసుకుంది. ‘వీరమ్మాళ్ బామ్మతో మాట్లాడడం, ఆమె నోటి నుంచి గ్రామ అభివృద్ధి ప్రణాళికల గురించి వినడం అద్భుతమైన అనుభవం’ అంటుంది సుప్రియ. -
నాలుగో దశ: పెనుగొలనులో టీడీపీకి ఎదురుదెబ్బ
సాక్షి, కృష్ణా జిల్లా: నాలుగో దశ (తుది విడత) పంచాయతీ ఎన్నికల్లో గంపలగూడెం మండలంలోని పెనుగొలను గ్రామంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధిష్టానం తీరుపై ఆ పార్టీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఆర్థిక సాయం చేస్తామని పార్టీ నాయకులు తమను పట్టించుకోలేదని మండిపడ్డారు. టీడీపీ వైఖరిని నిరసిస్తూ పార్టీ గ్రామ అధ్యక్షుడు కోటా హరిబాబు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి జ్యోతి ఎన్నికలను బహిష్కరించారు. కాగా, పంచాయతీ ఎన్నికల్లో ప్రజాతీర్పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఆ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. ఇప్పటివరకు జరిగిన మూడు దశల పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ అభిమానులు పెద్ద ఎత్తున విజయం సాధించారు. టీడీపీ ముఖ్య నేతల నియోజకవర్గాల్లో సహా అన్నింటా ఆ పార్టీ కుదేలైంది. బీజేపీ, జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. చదవండి: జెడ్పీ అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం టీడీపీకి పరాభవం: నాటి పాపాలే.. నేటి శాపాలు! -
పల్లె సమస్యలపై గళం విప్పేనా?
సాక్షి, సూర్యాపేటరూరల్ : కొత్త సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారం చేసేంతవరకూ ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న గ్రామాలు ఆశించిన మేర అభివృద్ధికి నోచుకోలేదు. నిధులు సరిగ్గా లేక అధికారులు స క్రమంగా విధులు నిర్వహించకపోవడంతో పంచా యతీల్లో ఎక్కడవేసిన గొంగళిఅక్కడే ఉంది. ఇప్పుడు పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు రావడం, అధికారులు సక్రమంగా విధుల్లో ఉండడంతో గ్రామాలు అభివృద్ధిబాట పట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 3న (బుధవారం) సూర్యాపేట మండల పరిషత్ సమావేశం జరుగనుంది. అయితే గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను ప్రస్తావించడానికి సర్పంచ్‌లకు మండల సర్వసభ్య సమావేశం అసెంబ్లీ లాంటిది. బుధవారం సూర్యాపేట మండలపరిషత్ కార్యాలయంలో జరుగనున్న క్రమంలో తొలిసారిగా హాజరవుతున్న సర్పంచ్‌లు తమ గ్రామసమస్యలపై గళం విప్పుతారో లేదో చూడాల్సి ఉంది. నూతన సర్పంచ్‌లకు తొలి వేదిక మండలంలో నూతనంగా గెలిచిన సర్పంచ్‌లకు బుధవారం జరిగే మండల సర్వసభ్య సమావేశం తొలి వేదిక కానుంది. గ్రామాల్లో ప్రజా సమస్యలకు పరిష్కార మార్గానికి మండల సర్వసభ్య స మావేశం నూతన సర్పంచ్‌లకు అనుభవంగా మా రనుంది. సూర్యాపేట మండలంలోని 23 గ్రామపంచాయతీల సర్పంచ్‌లు సర్వసభ్య సమావేశానికి హాజరై ప్రభుత్వ శాఖల ఆధీనంలో ఉన్న వివి ధశాఖలకు సంబంధించిన అంశాలను సమావేశంలో సుదీర్ఘంగా చర్చించడానికి సర్పంచ్‌లకు, ఎం పీటీసీలకు అవకాశం ఉంటుంది. బుధవారం సూ ర్యాపేట మండలపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11గంటలకు సర్వస భ్య సమావేశం నిర్వహించనున్నారు. మండల పరిషత్ అధ్యక్షుడు వట్టె జానయ్యయాదవ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి వివిధశాఖల అధికా రులు, మండల ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ముగియనున్న ఎంపీటీసీల పదవీకాలం.. బుధవారం జరిగే మండల సర్వసభ్య సమావేశానికి సర్పంచ్‌లు తొలిసారి హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలాఉంటే ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం మాత్రం ముగియనుంది. అయితే మే నెలలో ఎన్నికలు నిర్వహించకుంటే ఎంపీటీసీలు కూడా మరో సర్వసభ్య సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. అయితే సర్పంచ్‌లకు ఇప్పటికే గ్రామాల్లో ఉన్న సమస్యలపై అవగాహనకు వచ్చారు. సమస్యల పరిష్కారానికి సమావేశంలో తమ గళమెత్తే దిశగా సన్నద్ధమవుతున్నారు. చర్చకు రానున్న ఎన్నో అంశాలు.. బుధవారం జరిగే సమావేశంలో 19అంశాలు ప్రధానంగా చర్చించుటకు మండల పరిషత్ అధ్యక్షుడు అనుమతితో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. ఇందులో వ్యవసాయం, ఉద్యాన, హరితహారం, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, పౌరసరఫరాలశాఖ, గ్రామీణ విద్యుత్, వైద్యఆరోగ్యం, ప్రాథమిక విద్య, ఉపాధిహామీ పథకం, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ఐటీడీఏ, స్త్రీ, శిశుసంక్షేమశాఖ, రవాణాశాఖ, అటవీశాఖ, పశుపోషణ, మిషన్‌కాకతీయ, వసతి గృహాలు, రోడ్డు భవనాలు వంటి శాఖలకు సంబంధించిన వివిధ సమస్యలు సభలో చర్చకు వస్తాయి. అయితే వ్యవసాయ అధికారులు రైతులకు సాగులో సూచనలు ఇస్తున్నారా లేదా..అదేవిధంగా యాంత్రీకరణపై అవగాహన కల్పిస్తున్నారా లేదా అనే విషయాల తో పాటు అనేక విషయాలు చర్చకు రావాల్సి ఉంది. ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు పని కల్పిస్తున్నారా..కూలీలు ఉపాధి సద్వినియోగం చేసుకుంటున్నారా అనే అంశం చర్చకు రావాల్సి ఉంది. గతేడాది గ్రామాల్లో చేసిన ఉపాధి పనులు సరిగ్గా ఉన్నాయో లేదో చూడాల్సిన అవసరం ఉంది. రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పశుపోషణ ద్వారా పాడిగెదేలు, గొర్రెల పెంపకం తదితర కార్యక్రమాలతో పాటు వివిధ శాఖలైనా ప్రాథమిక వైద్యం పనితీరు, వైద్యసేవలు, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు, పాఠశాలలో విద్యాబోధన, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు సరిగ్గా పోషకాహారం పంపిణీ చేస్తున్నారా..రేషన్ పంపిణీ గ్రామాల్లో సక్రమంగా అవుతుం దా..అనే అంశాలపై నూతన సర్పంచ్‌లకు సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ఈ సమావేశంలో తమ గ్రామపరిధిలో ఉన్న సమస్యలపై అధికారులతో చర్చిస్తేనే సమస్యలు పరిష్కారానికి నోచుకునే అవకాశం ఉంది. ఈ సర్వసభ్య సమావేశానికి సర్పంచ్‌లు తొలిసారిగా హాజరవుతున్నారు. సమస్యలపై చర్చించి సమావేశాన్ని సద్వినియోగం చేసుకుంటారో.. లేదో వేచి చూడాల్సి ఉంది. -
తలొగ్గేవారికే ప్రత్యేక పగ్గాలు
పంచాయతీలలో సర్పంచ్ల పాలనకు కాలం తీరింది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల బండి నడిపించేందుకు ప్రత్యేక అధికారులకు పగ్గాలు అప్పగించింది. చర్నాకోలు మాత్రం తన వద్దే ఉంచుకుంది. తమకు అనుకూలంగా వ్యవహరించాలంటూ ప్రత్యేక అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఏమాత్రం తమ ఆదేశాలకు తలూపని వారిని పక్కన పెట్టింది. ఒక్కొక్కరికి పదేసి పంచాయతీలు అప్పగించింది. ప్రస్తుతం ఉన్న విధులతోపాటు ఈ ప్రత్యేక భారాన్ని మోయలేం మహాప్రభో అంటున్నా వారి వేదనను పెడచెవిన పెట్టింది. అధికార పార్టీ సర్పంచ్ల అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకుగాను అభివృద్ధికి సైతం పాతరేసింది. సాక్షి, గుంటూరు : గ్రామ సర్పంచుల పదవీకాలం ఈ నెల ఒకటో తేదీన ముగిసింది. జిల్లాలోని 1011 గ్రామ పంచాయతీలను 587 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి వీటికి తహసీల్దార్, ఎంపీడీవో, ఈఓపీఆర్డీ, ఎంఈవో వంటి గెజిటెడ్ ర్యాంకు అధికారులను స్పెషల్ అధికారులుగా నియమించారు. ఇప్పటికే కొంత మంది అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు స్వీకరించారు. అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే అందలం.. అధికార పార్టీ నేతలు చెప్పిన అధికారులకు మాత్రమే ప్రత్యేక బాధ్యతలు కట్టబెట్టారు. నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల్లో అత్యధికంగా ఒక్కో అధికారికి 6 నుంచి 13 గ్రామాల బాధ్యతలు అప్పజెప్పడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉండే వారిని ప్రత్యేక అధికారులుగా నియమించుకోవడం కోసం మాజీ సర్పంచ్‌లు కూడా పైరవీలు చేశారు. ఆందోళన చెందుతున్న ప్రజలు.. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకంపై తెలుగుదేశం పార్టీ పెత్తనానికి తెర తీసింది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఆమోదించిన వారికే ప్రత్యేక అధికారులుగా నియమించడం కోసం భారీగా ఒత్తిళ్లు తెచ్చారని తెలుస్తోంది. దీంతో అ«ధికార పార్టీకి అనుకూలంగా ఉండే అధికారులకే 5 నుంచి 10కిపైగా గ్రామాలు కట్టబెడితే సమస్యలు ఏ విధంగా పరిష్కారమవుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి గతంలో ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు పంచాయతీ కార్యదర్శులకు ఇన్చార్జి బాధ్యత అప్పగించేవారు. కానీ జిల్లాలో కార్యదర్శుల కొరత ఉంది. ఒక్కో కార్యదర్శి మూడు నుంచి నాలుగు పంచాయతీల బాధ్యతలు ఇప్పటికే మోస్తున్నారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్యం, జ్వరాల విజృంభణ, తాగు నీరు, డంపింగ్ యార్డు వంటి సమస్యలు గ్రామాల్లో పేరుకుపోయాయి. ఎక్కువ గ్రామాలకు ప్రత్యేకాధికారులుగా ఉన్న వారు ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. అభివృద్ధి అధోగతే.. పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా అధికార పార్టీకి ఇష్టమైన వారికి నియమించారు. టీడీపీ మాజీ సర్పంచ్‌లు వారి పెత్తనాన్ని కోల్పోకుండా ఉండటానికి భారీగా పైరవీలు నడిపించారు. ఇప్పటికే గ్రామాల్లో కొన్ని అభిృద్ధి కార్యక్రమాలు మధ్యలో నిలిచిపోయాయి. ఒక్కో అధికారికి 5 నుంచి 10కిపైగా గ్రామాలను కేటాయిస్తే అభివృద్ధి ఎలా సాగుతుంది. – ఆళ్ల బుచ్చిరెడ్డి, జొన్నలగడ్డ మాజీ సర్పంచ్ అన్నీ సమస్యలే.. ఇప్పటికే గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. ఒక్కో అధికారికి 4, 5 గ్రామాలు కట్టబెట్టారు. దీంతో గ్రామాల్లో సమస్యలు పట్టించుకునే నాథుడు లేకుండా పోతారు. ప్రత్యేక అధికారులుగా ఉన్న వారికి ఇప్పటికే మండల స్థాయిలో పని భారం ఎక్కువ ఉంది. ఇక పంచాయతీల సమస్యలు ఎప్పుడు పట్టించుకుంటారు. – ఇర్ల గొల్లారావు, కోనంకి, మాజీ సర్పంచ్ -
స్వాతంత్య్ర సమరయోధుడి మృతి
ఉప్లూర్ (కమ్మర్పల్లి), న్యూస్‌లైన్: మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పోతు రాజేశ్వర్(89) శనివారం సాయంత్రం అనారోగ్యంతో మరణించాడు. రాజేశ్వర్ 1925, ఆగస్టు 18న జన్మించారు. స్వాతంత్య్ర పోరాటంలో 1942-1953 మధ్య ముంబ యి సేవాదళ్ కార్యకర్తగా ఆయన పనిచేశారు. ఎన్నో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని జైలుకు సైతం వెళ్లారు. 1947, మే 22న బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొని అరెస్టై వారం పాటు జైల్లో ఉన్నారు.1953లో ముంబయి నుంచి స్వగ్రామం ఉప్లూర్‌కు వచ్చి స్థిరపడ్డారు.1965-1970 మధ్య గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. నిత్యం ఖద్దరు దుస్తులు ధరించి, తలపై ఖద్దరు టోపీ ధరించే రాజేశ్వర్ సాత్వికాహారం తీసుకునేవారు. ఆధ్యాత్మిక చింతన, గాంధేయవాదాన్ని అనుసరించేవారు. ఒంటిపూట భోజనం, ఉదయం పచ్చి పాలు తాగడం ఆయన అలవాటని, అందుకే ఇన్నేళ్లు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా బతికారని కుటుంబసభ్యులు తెలిపారు. రాజేశ్వర్ నెలక్రితం ఇంట్లో జారిపడగా తుంటి ఎముక విరిగింది. జిల్లాకేంద్రంలోని ఓ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించగా ఇన్ఫెక్షన్ ఎక్కువై శరీర అవయవాలపై ప్రభావం పడింది. దీంతో ఆయన పది రోజులుగా. అనారోగ్యంతో బాధపడుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రభుత్వ ఆదరణ కరువు... స్వాతంత్య్ర సమరయోధుడైన రాజేశ్వర్‌కు ప్రభుత్వ ఆదరణ కరువైంది. స్వాతంత్య్ర సమరయోధుల జాబితాలో ఉన్నప్పటికీ పింఛన్ సౌకర్యం కల్పించలేదు. పింఛన్, ఇతర ప్రయోజనాల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నటికైన ప్రభుత్వం తనను గుర్తించక పోతదా అని అనుకుంటూ కోరిక నెరవేకుండానే రాజేశ్వర్ లోకాన్ని విడిచి వెళ్లారు.