గ్రామ పంచాయతీ కార్యాలయం
పంచాయతీలలో సర్పంచ్‌ల పాలనకు కాలం తీరింది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల బండి నడిపించేందుకు ప్రత్యేక అధికారులకు పగ్గాలు అప్పగించింది. చర్నాకోలు మాత్రం తన వద్దే ఉంచుకుంది. తమకు అనుకూలంగా వ్యవహరించాలంటూ ప్రత్యేక అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఏమాత్రం తమ ఆదేశాలకు తలూపని వారిని పక్కన పెట్టింది. ఒక్కొక్కరికి పదేసి పంచాయతీలు అప్పగించింది. ప్రస్తుతం ఉన్న విధులతోపాటు ఈ ప్రత్యేక భారాన్ని మోయలేం మహాప్రభో అంటున్నా వారి వేదనను పెడచెవిన పెట్టింది. అధికార పార్టీ సర్పంచ్‌ల అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకుగాను అభివృద్ధికి సైతం పాతరేసింది.
సాక్షి, గుంటూరు : గ్రామ సర్పంచుల పదవీకాలం ఈ నెల ఒకటో తేదీన ముగిసింది. జిల్లాలోని 1011 గ్రామ పంచాయతీలను 587 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి వీటికి తహసీల్దార్, ఎంపీడీవో, ఈఓపీఆర్డీ, ఎంఈవో వంటి గెజిటెడ్ ర్యాంకు అధికారులను స్పెషల్ అధికారులుగా నియమించారు. ఇప్పటికే కొంత మంది అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు స్వీకరించారు.
అధికార పార్టీ నేతలు చెప్పిన
వారికే అందలం..
అధికార పార్టీ నేతలు చెప్పిన అధికారులకు మాత్రమే ప్రత్యేక బాధ్యతలు కట్టబెట్టారు. నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల్లో అత్యధికంగా ఒక్కో అధికారికి 6 నుంచి 13 గ్రామాల బాధ్యతలు అప్పజెప్పడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉండే వారిని ప్రత్యేక అధికారులుగా నియమించుకోవడం కోసం మాజీ సర్పంచ్‌లు కూడా పైరవీలు చేశారు.
ఆందోళన చెందుతున్న ప్రజలు..
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకంపై తెలుగుదేశం పార్టీ పెత్తనానికి తెర తీసింది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఆమోదించిన వారికే ప్రత్యేక అధికారులుగా నియమించడం కోసం భారీగా ఒత్తిళ్లు తెచ్చారని తెలుస్తోంది. దీంతో అ«ధికార పార్టీకి అనుకూలంగా ఉండే అధికారులకే 5 నుంచి 10కిపైగా గ్రామాలు కట్టబెడితే సమస్యలు ఏ విధంగా పరిష్కారమవుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి గతంలో ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు పంచాయతీ కార్యదర్శులకు ఇన్‌చార్జి బాధ్యత అప్పగించేవారు.
కానీ జిల్లాలో కార్యదర్శుల కొరత ఉంది. ఒక్కో కార్యదర్శి మూడు నుంచి నాలుగు పంచాయతీల బాధ్యతలు ఇప్పటికే మోస్తున్నారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్యం, జ్వరాల విజృంభణ, తాగు నీరు, డంపింగ్ యార్డు వంటి సమస్యలు గ్రామాల్లో పేరుకుపోయాయి. ఎక్కువ గ్రామాలకు ప్రత్యేకాధికారులుగా ఉన్న వారు ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు.
అభివృద్ధి అధోగతే..
పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా అధికార పార్టీకి ఇష్టమైన వారికి నియమించారు. టీడీపీ మాజీ సర్పంచ్‌లు వారి పెత్తనాన్ని కోల్పోకుండా ఉండటానికి భారీగా పైరవీలు నడిపించారు. ఇప్పటికే గ్రామాల్లో కొన్ని అభిృద్ధి కార్యక్రమాలు మధ్యలో నిలిచిపోయాయి. ఒక్కో అధికారికి 5 నుంచి 10కిపైగా గ్రామాలను కేటాయిస్తే అభివృద్ధి ఎలా సాగుతుంది.
– ఆళ్ల బుచ్చిరెడ్డి, జొన్నలగడ్డ మాజీ సర్పంచ్
అన్నీ సమస్యలే..
ఇప్పటికే గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. ఒక్కో అధికారికి 4, 5 గ్రామాలు కట్టబెట్టారు. దీంతో గ్రామాల్లో సమస్యలు పట్టించుకునే నాథుడు లేకుండా పోతారు. ప్రత్యేక అధికారులుగా ఉన్న వారికి ఇప్పటికే మండల స్థాయిలో పని భారం ఎక్కువ ఉంది. ఇక పంచాయతీల సమస్యలు ఎప్పుడు పట్టించుకుంటారు.
– ఇర్ల గొల్లారావు, కోనంకి, మాజీ సర్పంచ్
Comments
Please login to add a commentAdd a comment