
ఏజెన్సీలో ప్రమాద ఘంటికలు
భద్రాచలం : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గిరిజన గ్రామాల్లో పారిశుధ్యం లోపించటంతోనే ప్రధానంగా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. మలేరియాతో పాటు డెంగీ జ్వరాలు కూడా పట్టిపీడిస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వ్యాధుల నివారణకు వైద్య ఆరోగ్యశాఖాధికారులు తగిన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నా.. గ్రామాల్లో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణంతో వీటికి అడ్డుకట్ట వేయలేని పరిస్థితి నెలకొంది.
గ్రామ పంచాయతీలకు పాలకమండళ్లు ఉన్నప్పటికీ, నిధుల లేమితో పారిశుధ్యంపై వారు దృష్టి సారించకపోతున్నారు. ఇది గిరిజనుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. గత ఏడాది కంటే కొద్దిగా వ్యాధి పీడితుల సంఖ్య తగ్గిందని వైద్య ఆరోగ్యశాఖాధికారులు చెబుతున్నప్పటకీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరోలా కనిపిస్తోంది. జిల్లాలో 60 ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు ఉండగా, వీటిలో 50 పీహెచ్‌సీలు ఏజెన్సీలోనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 24 వరకూ ఆయా పీహెచ్‌సీలలో నమోదైన జ్వరపీడితుల సంఖ్యను పరిశీలిస్తే, ఏజెన్సీలో వ్యాధుల తీవ్రతకు అద్దం పడుతోంది.
జిల్లాలోని మొత్తం 69 పీహెచ్‌సీల పరిధిలో 1,72,042 రక్తపూత లు సేకరించగా, ఇందులో 859 మందికి మలేరియా వ్యాధి సోకినట్లు అధికారులు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో ఏజెన్సీ పీహెచ్‌సీలలో 852 మంది ఉండగా, మైదాన ప్రాంతంలోని 19 పీహెచ్‌సీలలో ఏడుగురికి మలేరియా సోకినట్లు తెలుస్తోంది. మలేరియా కేసుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈ సమయానికి తక్కువేనని వైద్య శాఖాధికారులు అంటున్నారు. కానీ డెంగీ వ్యాధి విజృంభిస్తుండటం వారికి సైతం ఆందోళన కలిగిస్తోంది.
డెంగీ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన 36 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 13 మందికి ఈ వ్యాధి సోకినట్లు నిర్ధార ణ కావటం గమనార్హం. గతేడాది జూలై నెలఖారు నాటికి ఒక్క డెంగీ కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఈ ఏడాది పరిస్థితి భయంకరంగా ఉంది. వైద్య సిబ్బంది దృష్టికి వచ్చిన కేసులు మాత్రమే ఇవి. ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదైన డెంగీ కేసులను పరిగణనలోకి తీసుకుంటే వందల సంఖ్యలోనే వ్యాధి పీడితులు ఉంటారని అంచనా. గిరిజన గ్రామాల్లోని ప్రజలు మలేరియాతో బాధపడుతుండగా, పట్టణాల్లో ఉన్న వారికి ప్రధానంగా డెంగీ జ్వరాలు సోకుతున్నాయి.
డేంజర్ జోన్‌గా ముంపు మండలాలు...
ఏజెన్సీలో నమోదవుతున్న జ్వర పీడితుల్లో ముంపు మండలాల్లోనే ఎక్కువగా ఉండడం గమనార్హం. చింతూరు మండలం తులసిపాక పీహెచ్‌సీలో అత్యధికంగా 209 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇదే మండలంలోని ఏడుగురాళ్ల పల్లి పీహెచ్‌సీలో 68 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. కూనవరం మండలం కూటూరు పీహెచ్‌సీలో 48, భద్రాచలం మండలం నెల్లిపాకలో 38, వీఆర్‌పురం మండలంలోని రేఖపల్లి పీహెచ్‌సీలో 35 మలేరియా కేసులు నమోదయ్యాయి. కుక్కునూరు మండలం అమరవరం పీహెచ్‌సీలో 23 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈ పీహెచ్‌సీలన్నీ ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన ముంపు మండలాల్లోనే ఉన్నాయి.
ఏజెన్సీ పరిధిలో 45 పీహెచ్‌సీలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించగా, ముంపు మండలాల్లోని అన్ని పీహెచ్‌సీలు డేంజర్ జోన్‌లోనే ఉన్నాయి. వర్షాకాలంతో పాటు చలికాలం ముగిసేంత వరకూ ఈ మండలాల్లో మలేరియా వ్యాధి పీడిత కేసులు వందల సంఖ్యలోనే నమోదవుతాయి. ప్రస్తుతం ఈ మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించారు.
ఇక్కడ పనిచేసే సిబ్బందిలో దాదాపు 80 శాతం మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. మరికొన్ని రోజుల్లో ముంపు మండలాలు ఆంధ్ర పాలనలోకి వెళుతున్నందున ఇక్కడ పనిచేసే సిబ్బంది తాము ఎటువైపు వెళ్తామోననే ఆందోళనతో విధుల పట్ల తగిన శ్రద్ధ చూపటం లేదు. కొంతమంది అయితే ముంపు నుంచి బయటకు వచ్చేందుకు సెలవులు కూడా పెడుతున్నారు. దీంతో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టేదెవరనేది ప్రశ్నార్థకంగా మారింది.
భర్తీకి నోచుకోని ఖాళీలు...
వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది ఖాళీలు భర్తీకి నోచుకోవటం లేదు. 12 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండగా, కీలకమైన స్టాఫ్ నర్సు పోస్టులు 21 భర్తీ చేయలేదు. ఎంపీహెచ్‌ఏ(మేల్)83, ఎంపీహెచ్‌ఏ(ఫీమేల్) 161 ఖాళీలు ఉన్నాయి. ల్యాబ్‌టె క్నీషియన్‌లు 19 ఖాళీగా ఉండగా, వ్యాధులపై అవగాహ న కల్పించే కీలకమైన హెల్త్‌ఎడ్యుకేటర్ పోస్టులు 7 భర్తీకి నోచుకోలేదు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, లేకుంటే వ్యాధుల కాలం ముగిసేంత వరకైనా మైదాన ప్రాంతం నుంచి డిప్యూటేషన్‌పై సిబ్బందిని తీసుకురావాలని గిరిజనులు కోరుతున్నారు.