పంచాయతీ పన్నుల సేకరణలో అధికారుల నిర్లక్ష్యం
జిల్లా యంత్రాంగం తీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
ఈనెల 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరం
హన్మకొండ అర్బన్ : గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లలో జిల్లా పూర్తిగా వెనుకబడిపోరుుంది. ఈనెల 31 వరకు ఆర్థిక సంవత్సరం ముగియనుండగా ఇప్పటివరకు 19.78 శాతం మాత్రమే లక్ష్యం సాధించారు. దీనిపై ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్ జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదని గణాంకాలు చెబు తున్నాయి. వసూళ్లలో జాప్యానికి పంచాయతీ సిబ్బంది కొరత కొంత కారణమైనప్పటికీ.. ప్రస్తుతం పంచాయతీల పాలనపై పర్యవేక్షణ కొరవడటం మూలంగానే పన్ను వసూళ్లలో వె నుకబడ్డామని అధికారులే చెబుతున్నారు. జిల్లాలోని 962 పంచాయతీలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 19.78 శాతం, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయ సేకరణలో 26.06 శాతం మాత్రమే వసూలు చేశారు. పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే జిల్లా చివరి స్థానంలో ఉండడం గమనార్హం.
రెండూ అంతే..
పంచాయతీలకు వచ్చే ఆదాయం పన్నులు(టాక్సబుల్), పన్నేతర (నాన్ టాక్సబుల్) అని రెండు రకాలుగా ఉంటాయి. వీటలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో ఇంటిపన్నులు , నీటి పన్నులు, గ్రంథాలయ పన్నులు ఉంటాయి. రెండోరకం ఆదాయంలో పంచాయతీలు లెసైన్స్‌లు జారీ చేయడం, సంతలు, తైబజార్, షాపింగ్ కాంప్లెక్స్‌ల అద్దెలు వంటివి ఉంటాయి. అయితే ఈ రెండింటి విషయంలోనే జిల్లా ప్రగతి అంతంతమాత్రమే.
లక్ష్యం రూ.78 కోట్లు.. వసూళ్లు 17 కోట్లు..
జిల్లాలో రెండు రకాల ఆదాయ మార్గాల ద్వారా గ్రామ పంచాయతీలకు రావాల్సిన మొత్తం పన్ను బకాయిలు రూ.78, 02,98,452గా ఉంది. అయితే తాజా లెక్కల ప్రకారం మొత్తం రూ.17,54,77,494 మాత్రమే సేకరించగలిగారు. ఇంకా రూ.60,48,20,958 వసూలు చేయాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో నాలుగురోజులే గడువు ఉండడం గమనార్హం. పన్నుల ద్వారా రూ.44,40,67,470 ఆదాయం రావల్సి ఉండగా ఇప్పటివరకు రూ. 8,78,56,929 మాత్రమే సేకరించారు. ఇంకా రూ.35,62,10,541 రావల్సి ఉంది. అంటే సరాసరిన 19.78 శాతం మాత్రమే లక్ష్యం సాధించారు. ఇక పన్నేతర ఆదాయం కింద జిల్లాలో రూ.33,62,30,982 రావల్సిండగా ఇప్పటివరకు 8,76,20,555 మాత్రమే సేకరించగలిగారు. ఇంకా రూ. 24,86,10,427 సేకరించాల్సి ఉంది.
ఈ మండలాల్లో 10 శాతంలోపే...
పంచాయతీల ఆదాయం 10 శాతంకన్నా తక్కువ సాధించిన మండలాలు పరిశీలిస్తే చేర్యాల -6.21 శాతం,ఖానాపూర్ 7.53 శాతం, పరకాల 7.17 శాతం, రాయపరి ్త 4.59 శాతం, చెన్నారావుపేట 7.53 శాతం సాధించి అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి.
50 శాతం దాటింది 8 మండలాలే...
పన్నుల వసూళ్లలో 50 శాతం లక్ష్యం దాటింది కేవలం ఎనిమిది మండలాలే. వీటిలో నర్సింహులపేట 50.08 శాతం, తాడ్వాయి 56.41 శాతం, ఏటూరునాగారం 66.36 శాతం, గీసుకొండ 53.82 శాతం, గోవిందరావుపేట 63.12 శాతం, గూడూరు 63.46 శాతం,నెక్కొండ 54.58 శాతం, తొర్రూరు 58.56 శాతం వసూళ్లు సాధించారుు.