![India Net Direct Tax Collection up 15 Percent](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/tax-collection.jpg.webp?itok=9J4cs7PY)
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల రూపంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు (2024 ఏప్రిల్ 1 నుంచి 2025 ఫిబ్రవరి 10 నాటికి) రూ.17.78 లక్షల కోట్ల నికర పత్య్రక్ష పన్ను వసూలైంది. అంతక్రితం ఆర్థిక సంత్సరం ఇదే కాలంలో ఆదాయంతో పోల్చి చూస్తే 14.69 శాతం వృద్ధి కనిపిస్తోంది.
పత్య్రక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలించినప్పుడు.. నాన్ కార్పొరేట్ పన్నుల ఆదాయం (వ్యక్తిగత ఆదాయపన్ను రూపంలో) ఫిబ్రవరి 10 నాటికి 21 శాతం ఎగసి రూ.9.48 లక్షల కోట్లకు చేరింది. ఇక కార్పొరేట్ పన్నుల ఆదాయం సైతం 6 శాతం అధికమై రూ.7.78 లక్షల కోట్లుగా నమోదైంది.
సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) ఇదే కాలంలో 65 శాతం పెరిగి రూ.49,201 కోట్లుగా ఉంది. పన్ను చెల్లింపుదారులకు ఆదాయపన్ను శాఖ ఈ కాలంలో మొత్తం రూ.4.10 లక్షల కోట్లను రిఫండ్ (తిరిగి చెల్లింపు) చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే రిఫండ్‌లు 42 శాతం పెరిగాయి.
ఇక ఫిబ్రవరి 10 నాటికి స్థూల ప్రత్యక్ష పన్నుల ఆదాయం 19 శాతం పెరిగి రూ.21.88 లక్షల కోట్లకు చేరింది. 2024–25 సంవత్సరంలో ఆదాయపన్ను వసూళ్లు రూ.12.57 లక్షల కోట్లుగా ఉండొచ్చని ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్‌లో సవరించిన అంచనాలు పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment