అనిత.. తొలి అడుగు
దేవరకొండ : చందంపేట మండలం తిమ్మాపురం గ్రామపంచాయతీ పరిధిలోని చెంచుకాలనీలో 50 కుటుంబాలు ఉంటాయి. సుమారు రెండు వందల మంది జనాభా ఉంటుంది. ఆ చెంచుకాలనీకి చెందిన దాసరి అంజయ్య, ఈదమ్మలకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో అనిత పెద్దకూతురు. ఈ కాలనీలో 50 కుటుంబాలున్నప్పటికీ పిల్లల చదువులు మాత్రం సగంలో ఆగిపోతున్నాయి. ఐటీడీఏ వారు ఈ కాలనీలో ప్రాథమిక పాఠశాలను నిర్వహించేవారు. కుటుంబం గడవని పరిస్థితుల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రులతో కలిసి బడి మానేసి కూలి పనికో.. వలసబాటనో పడుతున్నారు. దీంతో ఆ పాఠశాల కూడా ప్రస్తుతం మూతబడింది. అయితే అనితను పదవ తరగతి వరకు దేవరకొండలోని ఎంబీ హైస్కూల్‌లో చదివిం చారు. పదో తరగతిలో ఉత్తీర్ణురాలైంది. చెంచులకు రిజర్వేషన్ అమలవుతుండడంతో ఇంటర్ చదివించాలన్న ఆలోచనతో దామరచర్లలోని ఏపీటీడబ్ల్యూఆర్‌జీ జూనియర్ కళాశాలలో చేర్పించారు. అనిత ఇటీవల ఇంటర్‌లో ఉత్తీర్ణురాలు కావడంతో ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తోంది.
కలెక్టర్ ఆశయాన్ని నిజం చేసిన అనిత..
24 ఏళ్ళ క్రితం ఓ కలెక్టర్ కన్న కల నేటికి సాకారమైంది. చెంచులు అడవిలో ఆకులు అలములు తింటూ గడ్డు జీవితాన్ని గడపడాన్ని జీర్ణించుకోలేని అప్పటి కలెక్టర్ తుకారాం (చెంచు) చెంచుల అభ్యున్నతి కోసం ఏదైన చేయాలని తలచారు. చందంపేట అటవీ ప్రాంతంలో ఉన్న నాలుగు ప్రాంతాల్లో చెంచుకాలనీలు ఏర్పాటు చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి, భూమి లేని వారికి భూమి పంపిణీ చేసి వారిలో మార్పును తీసుకురావడం కోసం ప్రయత్నించారు. ఆయన బదిలీపై వెళ్లిపోవడం.. ఆ తర్వాత అధికారుల నిర్లక్ష్యం, నిధుల మంజూరులో అలసత్వం కారణంగా కలెక్టర్ తుకారాం ఆశయం నీరుగారింది. ఈ చెంచుకాలనీలను శ్రీశైలం ఐటీడీఏలో భాగస్వామ్యం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉపాధి అవకాశాలు లేకపోగా, చెంచులు జీవిత గమనం మళ్ళీ అడవికే చేరింది. ప్రభుత్వం నిర్బంధ ప్రాథమిక విద్య, బాలికా సంరక్షణా చట్టం, విద్యాహక్కు చట్టం వంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చినప్పటికీ ప్రయోజనం మాత్రం శూన్యంగా మారిందనడానికి అనిత ఉదంతమే ఒక ఉదాహరణ. ఏదేమైనా కలెక్టర్ తుకారాం ఆశయాన్ని నిజం చేసే దిశగా అనిత అడుగులు వేస్తోంది. కాగా టీటీసీ చదవడానికి ఆమె దాతల నుంచి సాయం కోరుతోంది.
ఓ వైపు కుటుంబానికి ఆసరాగా.. మరోవైపు లక్ష్యసాధన దిశగా..
ఇంటర్ వరకు చదివిన అనిత పై చదువుల కోసం తపిస్తోంది. ప్రభుత్వ టీచర్ కావాలన్న లక్ష్యంతో టీటీసీ పరీక్షకు హాజరైంది. కానీ తన ర్యాంకుకు ప్రభుత్వ కోటాలో సీటు రాదేమోనని బెంగపెట్టుకుంది. అయితే ప్రస్తుతం ఖాళీగా ఉన్న అనిత తన కుటుంబానికి ఆసరాగా కూలి పనిచేస్తుంది. తల్లిదండ్రులతో పాటు తమ్ముడు శివ కూడా మామిడి మొక్కలు నాటడానికి గోతులు తీసే పనికి వెళ్తున్నారు.
ఉద్యోగం చేసి చెల్లెళ్లను చదివిస్తా
మా అమ్మనాన్న రోజు కూలి పనిచేసి కష్టపడి చదివిస్తున్నారు. వాళ్ళ కష్టం నాకు తెలుసు. అందుకే నేను బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని పట్టుదలతో ఉన్నాను. ఉద్యోగం చేస్తూ నా ఇద్దరు చెల్లెళ్ళను చదివించాలన్నదే నా కోరిక. ఇప్పుడు చెల్లెలిద్దరిని మోడల్‌స్కూల్‌లో చదివిస్తున్నారు. తమ్ముడు చదువు మానేసి అమ్మానాన్నలతో కలిసి కూలి చేస్తుండు. నేను కూడా అప్పుడప్పుడు మా వాళ్ళతో కలిసి ఊళ్లో కూలికెళ్తుంటా. అందరం కష్టపడితేనే ఇళ్లు గడుస్తుంది. ఈ కష్టాలన్నీ తీరాలంటే నేను ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించుకోవాలి. మున్ముందు మా అమ్మానాన్నలను బాగా చూసుకుంటా. ప్రభుత్వం చేయూతనిస్తే మా కుటుంబం కష్టాల నుంచి గట్టెక్కుతుంది. - అనిత
దరిచేరని పథకాలు..
కాగా, గత 24 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఈ చెంచుకాలనీలోని వారి అభ్యున్నతి కోసం మౌలిక సదుపాయాలు కల్పించి భూమి లేని వారికి భూమినిచ్చిఆదుకుంది. ఆ తర్వాత ఐటీడీఏ అధికారులు మాత్రం వారి అభ్యున్నతిని గాలికొదిలేశారు. దీంతో ఆ చెంచుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చాలామంది వలసబాట పట్టడంతో కొంతమంది మాత్రమే ప్రస్తుతం కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా, అంజయ్యకు అప్పటికి వివాహం కాకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే రెండు ఎకరాలకు అనర్హుడయ్యాడు. దీంతో ఆ కుటుంబం రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అంజయ్య, ఈదమ్మలు రోజువారీ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని ఈడ్చుకొస్తున్నారు. నిర్బంధ ప్రాథమిక విద్య, బాలికా సంరక్షణ చట్టం, విద్యాహక్కుచట్టం వంటి ఎన్నో చట్టాలు అమలుచేసి విద్యను ప్రోత్సహిస్తున్నామని అధికారుల మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. చెంచులు కూడా విద్యాపరంగా అంత ఆసక్తి చూపకపోవడం.. .వారిని చైతన్యం చేయడంలో అధికారులు విఫలమవుతుండడంతో వారి బతుకులు మారడం లేదు.