అనితా డోంగ్రే.. ఫ్యాషన్‌తో ఏ కాస్త పరిచయం ఉన్న వాళ్లకైనా బాగా తెలిసిన పేరు! ఇంకా చెప్పాలంటే ఇండియన్ ఫ్యాషన్‌కి ఆమె ఓ క్రియేటివ్ సిగ్నేచర్! మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ‘హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే’కి రీచ్ అయిన ఆ త్రెడ్స్ అండ్ నాట్స్ జర్నీ గురించి..
అనితా డోంగ్రే.. ముంబై వాసి. సంప్రదాయ సింధీ కుటుంబం ఆమెది. ఇంటి పనులకే జీవితాన్ని అంకితం చేసిన ఆడవాళ్లున్న నేపథ్యంలో పెరిగి.. ఉద్యోగినులుగా, బాసులుగా, పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్న ఆడవాళ్ల మధ్యకు చేరింది. తనింట్లోని స్త్రీల్లా కాకుండా, తాను ఎరిగిన ప్రపంచంలోని మహిళల్లా ఉండాలని నిశ్చయించుకుంది. ఆ నిశ్చయానికి ప్రేరణ సాధికారిక స్త్రీలే అయినా స్ఫూర్తి మాత్రం అనితా వాళ్ల అమ్మ! తన అయిదుగురు సంతానానికి ఆవిడే బట్టలు కుట్టేది. అవి రెడీమేడ్ దుస్తులకు ఏమాత్రం తీసిపోయేవికావు. పిల్లలు వాటిని స్కూల్లో వేడుకలు, ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి వేసుకెళితే స్నేహితులు, బంధువులంతా ఏ షాప్‌లో కొన్నారంటూ కితాబులిచ్చేవారు. అలాంటి సందర్భాల్లోనే అమ్మ నైపుణ్యానికి మురిసిపోయేది అనితా. వర్కింగ్ విమెన్‌ని చూశాక.. అమ్మ పనితనాన్ని తనూ అందిపుచ్చుకుని వర్కింగ్ విమెన్‌కి అనువైన దుస్తులను డిజైన్ చేసి ఫ్యాషన్‌ను శాసించాలని కల కన్నది. తొలి అడుగుగా ముంబైలోని ఎస్‌ఎన్‌డీటీ (శ్రీమతి నతీబాయీ దామోదర్ ఠాకర్సే) మహిళా యునివర్సిటీలో ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ చేసింది.
యూనివర్సిటీ నుంచి బయటకు రాగానే తండ్రి దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకుని, రెండు కుట్టుమిషన్లు కొని, సోదరితో కలసి చిన్న బొటిక్ పెట్టింది. కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగినులను కోసం డ్రెసెస్‌ని డిజైన్ చేసి.. సేల్‌కి పెట్టింది. అనితా సృజనకు ఆమె బొటిక్ ఉన్న కాంప్లెక్స్‌లోని లేడీస్ డ్రెస్ వేర్ షాప్స్ అన్నీ వెలవెలపోసాగాయి. దాంతో ఆ మాల్‌లోని లేడీస్ ఎంపోరియం షాప్స్ వాళ్లంతా అనితా బొటిక్‌ని అక్కడి నుంచి ఎత్తేయించాలని పట్టుబట్టారు. మాల్ ఓనర్ వాళ్ల డిమాండ్‌కి తలొంచక తప్పలేదు.. అనితా వాళ్లు ఆ మాల్ నుంచి షిఫ్ట్ అవకతప్పలేదు.
చేతిలో విద్య ఉంటే ఇక్కడ కాకపోతే ఇంకో చోట.. అనే ధీమాతో మరో చోటును వెదుక్కుంది. కొన్ని నెలలల్లోనే బొటిక్‌ని కాస్త ఏఎన్‌డీ డిజైన్స్ అనే ఫ్యాషన్ లేబుల్‌గా మార్చేసింది. ఇక మిషన్ వీల్ వెనక్కి తిరగలేదు. ఏఎన్‌డీ లేబుల్ కాస్త ‘హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే’గా అవతరించింది. దేశీ, క్యాజువల్, బ్రైడల్, గ్లోబల్ .. దుస్తులకు పర్‌ఫెక్ట్ బ్రాండ్‌గా స్థిరపడింది. ఆ క్రియేటివ్ కంఫర్ట్‌కి సామాన్యులే కాదు సెలబ్రిటీలూ ముచ్చటపడ్డారు. అనితా డోంగ్రే డిజైన్డ్ దుస్తులతో ముస్తాబవ్వాలని క్యూ కట్టారు. ఆ వరుసలో మాధురి దీక్షిత్, మలైకా అరోరా, కాజోల్, కత్రినా కైఫ్, ప్రియంకా చోప్రా, మానుషీ చిల్లర్, కృతి సనన్, ఆలియా భట్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకుర్, కాజల్ అగర్వాల్, దియా మిర్జా, శోభిత ధూళిపాళ, రాధికా ఆప్టే, సొనాలీ బెంద్రే, మీరా కపూర్, పూజా హెగ్డే, కరిష్మా కపూర్, రష్మికా మందన్నా, అర్జున్ కపూర్, అయుష్మాన్ ఖురానా, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లంతా కనిపిస్తారు.
సంప్రదాయ కట్టు, కార్పొరేట్ లుక్, కార్పెట్ వాక్, పార్టీ వేర్.. ఏది కావాలన్నా, ఏ తీరులో మెరవాలన్నా ఏ వర్గం వారైనా కోరుకునే బ్రాండ్ ‘హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే’నే! ఫ్యాషన్ ప్రపంచంలో ఆమెకు తిరుగులేదు అనే స్థాయికి ఎదిగింది. పింక్ సిటీ పేరుతో జ్యూల్రీ లైన్‌నూ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె దగ్గర మూడు వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎంతోమంది ఔత్సాహిక ఫ్యాషన్ డిజైనర్స్ ఆమె గైడెన్స్ తీసుకుంటున్నారు. వీళ్లు సరే.. పలు ప్రాంతాల్లోని ఎంతోమంది చేనేత కళాకారులకూ పని కల్పిస్తోంది అనితా డోంగ్రే.
Comments
Please login to add a commentAdd a comment