Mohit Rai: స్టార్స్‌ని వాళ్లు పోషించే పాత్రలకు తగ్గట్టుగా.. | Mohit Rai Success Story In MR Creation | Sakshi
Sakshi News home page

Mohit Rai: 'ఎమ్‌ఆర్‌' క్రియేషన్‌..

Published Sun, Jun 16 2024 10:02 AM | Last Updated on Sun, Jun 16 2024 10:02 AM

Mohit Rai Success Story In MR Creation

స్టార్స్‌ని వాళ్లు పోషించే పాత్రలకు తగ్గట్టుగా.. వాళ్లు అటెండ్‌ అయ్యే ఈవెంట్లకు అనుగుణంగా తీర్చిదిద్దడమంటే అంత ఆషామాషీ వ్యవహారమేం కాదు! కానీ దాన్ని అవలీలగా చేసేసే స్కిల్‌ పేరే మోహిత్‌ రాయ్‌!

‘స్టయిలిస్ట్‌ బై డే, బ్యాట్‌మన్‌ బై నైట్‌’ అని తనను తాను వర్ణించుకునే  మోహిత్‌ రాయ్‌ స్వస్థలం ఢిల్లీ. అక్కడి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్‌ చేశాడు. వెంటనే హార్పర్స్‌ బజార్‌ ఇండియా మ్యాగజైన్‌లో ఫ్యాషన్‌ స్టయిలిస్ట్‌గా ఉద్యోగం దొరికింది. అక్కడ మూడేళ్లు పనిచేశాక ముంబైకి మకాం మార్చాడు. అక్కడైతే అవకాశాలు ఎక్కువుంటాయని. అక్కడ ‘ద వార్డ్‌రోబిస్ట్‌’లో క్రియేటివ్‌ డైరెక్టర్‌గా చేరాడు.

రెండేళ్లకు ‘హార్పర్స్‌ బజార్‌ బ్రైడ్‌ ఇండియా’లో ఫ్యాషన్‌ డైరెక్టర్‌గా కొలువు దొరికింది. అప్పుడే.. ‘ఫాలో మీ టు’ ఫొటో సిరీస్‌తో ఫేమస్‌ అయిన రష్యన్‌ ఫొటోగ్రాఫర్‌ మురాద్‌ ఉస్మాన్‌ తన భార్య నటాలియాతో ఇండియా వచ్చాడు. ఆ ఇద్దరితో అద్బుతమైన కవర్‌ షూట్‌ చేయించాడు హార్పర్స్‌ బజార్‌ కోసం. అది వైరల్‌ అయి మోహిత్‌ని పాపులర్‌ చేసింది. ఆ ఖ్యాతిని తన అంట్రప్రెన్యూర్‌షిప్‌కి పిల్లర్‌గా వేసుకున్నాడు. ‘ఎమ్‌ఆర్‌ (మోహిత్‌ రాయ్‌) స్టయిల్స్‌’ను స్థాపించాడు.

ఈ సంస్థ స్టార్‌ స్టయిలింగ్, సెలబ్రిటీ వెడ్డింగ్స్‌ మీద ఫోకస్‌ చేస్తుంది. దీని ద్వారానే మోహిత్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అతను మొదట స్టయిలింగ్‌ చేసింది.. హీరోయిన్‌ సోనాక్షీ సిన్హాకు. తర్వాత చిత్రాంగదా సింగ్, కరీనా కపూర్, కంగనా రనౌత్, శిల్పా శెట్టిలాంటి బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఎందరికో స్టయిలిస్ట్‌గా చేశాడు.

ఎమ్‌ఆర్‌ స్టయిల్స్‌ బాధ్యతలు చూసుకుంటూనే తన స్నేహితుడు షోహ్న దాస్‌తో కలసి ‘గ్రెయిన్‌ ఫ్యాషన్‌ కన్సల్టెన్సీ’నీ ప్రారంభించాడు. పలు ఫ్యాషన్‌ లేబుల్స్‌కి డిజైన్, స్టయిలింగ్‌లో గైడెన్స్‌ ఇస్తుందీ సంస్థ.

‘స్టార్‌కున్న ఇండివిడ్యువల్‌ స్టయిల్‌ అండ్‌ పర్సనాలిటీని ఎలివేట్‌ చేయటమే స్టయిలిస్ట్‌ జాబ్‌’అని నమ్మే మోహిత్‌ రాయ్‌ని ‘మీకిష్టమైన సెలబ్రిటీ ఎవరు’ అని అడిగితే ‘సోనాక్షి సిన్హా’ అని చెబుతాడు. ‘ఫ్యాషన్‌ విషయంలో సోనాక్షీ ఎక్స్‌పరిమెంటల్‌ అండ్‌ ఓపెన్‌. రెండేళ్లు ఆమెతో కలసి పనిచేశాను. స్టయిలిస్ట్‌ని నమ్ముతుంది. చెప్పేది వింటుంది. డిఫర్‌ అయితే డిస్కస్‌ చేస్తుంది. ఆ చర్చలు నాకెంతో ఉపయోగపడ్డాయి. నా పనిని మెరుగుపరచాయి. అందుకే సోనాక్షీ అంటే నాకు చాలా రెస్పెక్ట్‌’ అంటాడు మోహిత్‌ రాయ్‌.

"నా పనిని చూసుకున్న ప్రతిసారీ .. అరే ఇంతకన్నా బాగా చేసుండాల్సింది అనిపిస్తుంది. అందుకే రోజూ ఆత్మవిమర్శ చేసుకుంటాను. పొరపాట్ల నుంచి పాఠాలు గ్రహిస్తాను. దానివల్ల నా పనితీరు రోజురోజుకి మెరుగవుతుంది. సెలబ్రిటీలకు స్టయిలింగ్‌ చేస్తున్నప్పుడు మన వర్క్‌ స్టయిల్‌ హార్డ్‌వర్క్‌ అండ్‌ స్మార్ట్‌వర్క్‌ల కాంబినేషన్‌గా ఉండాలి!" – మోహిత్‌ రాయ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement