పర్నియా కురేశీ.. పరిచయానికి చాలా విశేషణాలనే జోడించాలి. ఆమె కూచిపూడి డాన్సర్, ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్, మోడల్, యాక్ట్రెస్, ఆథర్ ఎట్‌సెట్రా! వివరాలు కావాలంటే కథనంలోకి వెళ్లాల్సిందే!
పర్నియా పుట్టింది పాకిస్తాన్‌లో. పెరిగింది ఢిల్లీలో. చదువుకుంది అమెరికాలో. తండ్రి.. మోయిన్ అఖ్తర్ కురేశీ భారతీయుడు. బిజినెస్‌మన్. తల్లి.. నస్రీన్ కురేశీ పాకిస్తానీ నటి. తండ్రి నుంచి వ్యాపార మెలకువలు, తల్లి నుంచి కళలు వారసత్వంగా అందుకుంది. నాలుగో ఏటనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ మొదలుపెట్టింది. తొలి గురువు తల్లే. తర్వాత రాజా–రాధారెడ్డి దగ్గర కూచిపూడి నేర్చుకుంది. అమెరికాలోని జార్జ్ వాషింగ్‌టన్ యూనివర్సిటీలో ‘లా’ చదివింది. లా చదివేటప్పుడే ఫ్యాషన్ రంగంలో ఇంటర్న్‌గా చేరింది.
ఆ క్రమంలోనే ఫ్యాషన్ మీద ఆసక్తి పెరిగింది. అకడమిక్స్ కంటే తన క్రియేటివిటీకే ఎక్కువ మార్కులు పడసాగాయి. దాంతో ఫ్యాషన్‌నే సీరియస్‌గా తీసుకుని హార్పర్స్ బజార్, ఎల్ లాంటి ఫ్యాషన్ పత్రికల్లో పనిచేసింది. తర్వాత ఫ్రెంచ్ డిజైనర్ క్యాథరిన్ మలండ్రీనో దగ్గర పీఆర్ ఇంటర్న్‌గా చేరింది. ఇవన్నీ ఆమెలోని ఫ్యాషన్‌సెన్స్‌కి మెరుగులు దిద్దాయి. అయితే ఈ మొత్తం ప్రయాణంలో ఆమె ఎక్కడా తన డాన్స్‌ని నిర్లక్ష్యం చేయలేదు. సాధన చేస్తూనే ఉంది. ప్రదర్శనలిస్తూనే ఉంది.
ఇండియా తిరిగిరాగానే..
ఫ్యాషన్ రంగంలో ఆమెకు ఇబ్బడిముబ్బడి అవకాశాలు కనిపించాయి. ఆ దిశగా అడుగులు కదిపేలోపే సోనమ్ కపూర్ హీరోయిన్‌గా నటించిన ‘ఆయశా’కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చాన్స్ వచ్చింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే ఇక్కడ ఆన్‌లైన్‌లో డిజైనర్ వేర్ అందుబాటులో లేదని గ్రహించింది. అందుకే ఆ మూవీ అయిపోగానే, 2012లో Pernia's Pop-Up Shop పేరుతో ఆన్‌లైన్ స్టోర్‌ని లాంచ్ చేసింది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్యాషన్ డిజైనర్స్ డిజైన్ చేసిన దుస్తులు లభ్యమవుతాయి.
అంట్రప్రెన్యూర్‌గా మారినా డిజైనింగ్‌ను ఆపలేదు. ఈ దేశ సంస్కృతి, సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అన్నివర్గాల మహిళలకు అన్ని రకాల దుస్తులను డిజైన్ చేయడం మొదలుపెట్టింది. తన స్టయిలింగ్‌ని కోరుకునే వాళ్లకోసం ‘పర్నియా కురేశీ’ లేబుల్‌ని, ఇండియన్, ఫ్యూజన్ తరహా కావాలనుకునేవారికి ‘"Amaira' ’ లేబుల్‌ని స్టార్ట్ చేసింది. కిడ్స్ వేర్, జ్యూల్రీ డిజైనింగ్‌లోకీ అడుగుపెట్టింది. పర్సనల్ స్టయిలిస్ట్‌గా కాకుండా బాలీవుడ్ ఈవెంట్స్, రెడ్ కార్పెట్ వాక్ కోసం కోరిన సెలబ్రిటీలకు మాత్రం స్టయిలింగ్ చేస్తోంది.
సుప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ల ఫ్యాషన్ షోల్లో మోడల్‌గా ర్యాంప్ మీద మెరుస్తోంది. ‘జాన్ నిసార్’ అనే చిత్రంలోనూ నటించింది. ఫ్యాషన్, స్టయిలింగ్‌కి సంబంధించిన వివరాలు, సలహాలు, సూచనలతో ‘"Be Stylish, with Pernia Qureshi'’ పేరుతో పుస్తకాన్నీ రాసింది.
‘మా అమ్మ ఇన్‌ఫ్లుయెన్స్‌తో క్లాసికల్ డాన్సర్‌నయ్యాను. నాన్న ఇన్‌స్పిరేషన్‌తో అంట్రప్రెన్యూర్‌నయ్యాను. నా పర్సనల్ ఇంట్రెస్ట్‌తో ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్, మోడల్‌నయ్యాను. ఉత్సుకతతో పుస్తకం రాశాను. చాన్స్ రావడంతో యాక్ట్రెస్‌నయ్యాను. లైఫ్‌లో నేను పోషించిన, పోషిస్తున్న ఈ రోల్స్ అన్నిటిలోకి నాకు క్లాసికల్ డాన్సర్ రోల్ అంటేనే ఇష్టం. డాన్స్ లేని జీవితాన్ని ఊహించుకోలేను. డాన్స్ ప్రాక్టీస్ లేని షెడ్యూల్ ఉండదు. సక్సెస్ అంటే నా దృష్టిలో చాలెంజెస్‌ని హ్యాండిల్ చేయడమే! దీనికి ఓర్పు, నేర్పులే టూల్స్!’ అంటుంది పర్నియా కురేశీ.
(చదవండి: శ్లోకా మెహతా స్టైలిష్ లెహంగాలు రూపొందించిందే ఆ మహిళే..!)
Comments
Please login to add a commentAdd a comment