యాక్ట్రెస్, సింగర్, మోడల్, బెల్లీ డాన్సర్, నేషనల్ లెవెల్ బాడ్మింటన్ ప్లేయర్.. ఈ విశేషణాలన్నింటి కలబోత ఐశ్వర్యా సుష్మితా! ‘బ్యాడ్ కాప్’ సిరీస్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఐశ్వర్యా సుష్మితా పుట్టింది బిహార్‌లోని దర్భంగాలో. పెరిగింది ఢిల్లీలో. నాన్న.. నారాయణ్ వర్మ, ఎస్‌బీఐ ఉద్యోగి. అమ్మ.. నీతా వర్మ, గృహిణి. ఐశ్వర్యా.. ఫిలాసఫీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్.
ఐశ్వర్యా ఆసక్తిని గమనించి, తల్లిదండ్రులూ ఆమెను మోడలింగ్ వైపే ప్రోత్సహించారు. దాంతో ఢిల్లీ బేస్డ్ మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ అయింది ఐశ్వర్యా. అక్కడే ప్రింట్ అడ్వర్టయిజ్‌మెంట్స్‌కి మోడల్‌గా పనిచేసింది.
స్కూల్ డేస్‌లో ఆమె లక్ష్యం ఐఏఎస్ కావాలని. అందుకే కాలేజీకొచ్చాక ఫిలాసఫీ సబ్జెక్ట్‌ని ఎంచుకుంది. ఆమెకు స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టం. బాడ్మింటన్ ప్లేయర్‌గా జాతీయ స్థాయిలో రాణించింది. అంతేకాదు అందాల పోటీల్లోనూ పాల్గొని, 2016, ఎన్‌డీటీవీ గుడ్ టైమ్ కింగ్‌ఫిషర్ సూపర్‌మోడల్స్‌కీ ఎంపికైంది. ఇవన్నీ ఆమె లక్ష్యాన్ని మార్చాయి.
ఆ టైమ్‌లోనే ముంబై మోడలింగ్ ఏజెన్సీల నుంచీ ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. ముంబై వెళ్లింది. మనీశ్ మల్హోత్రా, అనితా డోంగ్రే, రేణు టాండన్, మానవ్ గంగ్వానీ, రాహుల్ ఖన్నా వంటి సూపర్ డిజైనర్స్‌కి మోడల్‌గా పని చేసింది. టీవీ కమర్షియల్స్‌లోనూ నటించింది. ఆ ఫేమే ఆమెకు ‘స్పెషల్ ఆప్స్ 1.5’ అనే వెబ్ సిరీస్‌లో అవకాశాన్నిచ్చింది.
ఆ నటన ఆమెను తాజాగా ‘బ్యాడ్ కాప్’ వెబ్ సిరీస్‌లో ప్రాధాన్యమున్న పాత్రకు ప్రమోట్ చేసింది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది.
ఐశ్వర్యాకు సంబంధించి ఇంకో విశేషం, విశేషణం ఏంటంటే ఆమెకు స్పోర్ట్స్ బైక్ రైడింగ్ అంటే ప్రాణం. ఏ కొంచెం వీలు దొరికినా బైక్ రైడింగ్ చేస్తుంది. ఆమె ఫిట్‌నెస్ ఫ్రీక్ కూడా! రోజూ యోగా చేస్తుంది.
"నా పేరు విని అందరూ ఆశ్చర్యపోతారు సంబంధం లేకుండా రెండు పేర్లేంటని! ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్‌లు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ క్రౌన్స్ గెలుచుకున్న ఏడాదే పుట్టాను. మా పేరెంట్స్‌కి వాళ్లిద్దరంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానం కొద్దే నాకు ఆ ఇద్దరి పేర్లను కలుపుతూ ఐశ్వర్యా సుష్మితా అని పెట్టారు. అదన్నమాట నా పేరు వెనుకున్న స్టోరీ!" – ఐశ్వర్యా సుష్మితా
Comments
Please login to add a commentAdd a comment