ఒట్టావా: జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటన నేపథ్యంలో.. కెనడా ప్రధాని ఎవరనేది ఆసక్తికరంగా మారింది. పదవికి భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా ఉన్న అనితతోపాటు మాజీ డిప్యూటీ పీఎం క్రిస్టియా ఫ్రీలాండ్, బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ మరికొందరు పోటీలో ఉన్నారు. తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని ట్రూడో సోమవారం తన ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే. కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు మార్చి 24 వరకు సమయం ఉన్న నేపథ్యంలో పోటీలో ఉన్న నాయకులను ఓసారి చూద్దాం.
పోటీలో ఉన్న ఇతరులు..
2021 నుంచి విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న మెలానియా జోలీకూడా పోటీలో ఉన్నారు. అంతకుముందు మరో మూడు కేబినెట్ పదవులను నిర్వహించారు. ఆక్స్‌ఫర్డ్‌లో చదివిన 45 ఏళ్ల జోలీని రాజకీయాల్లోకి ప్రోత్సహించింది ట్రూడోనేనని చెబుతారు. పోటీ ప్రచారంలో ఉన్న మరో అభ్యర్థి క్రిస్టియా ఫ్రీలాండ్. ట్రూడో సహాయకురాలిగా, ఆయన కేబినెట్‌లో అత్యంత శక్తివంతమైన మంత్రుల్లో ఒకరిగా పేరొందారు. జర్నలిస్ట్ అయిన ఫ్రీలాండ్ 2013లో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశించారు. రెండేళ్ల తర్వాత ట్రూడో కేబినెట్‌లో చేరారు. పోటీ పడేవారిలో మార్క్ కార్నీ పేరు కూడా వినబడుతోంది. బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ అయిన కార్ని.. ఇటీవలి నెలల్లో ట్రూడోకు ప్రత్యేక సలహాదారుగా పనిచేశారు. హార్వర్డ్ గ్రాడ్యుయేట్ అయిన 59 ఏళ్ల కార్నీ ఇంతకుముందెన్నడూ ప్రభుత్వ పదవుల్లో పనిచేయలేదు. కానీ ఆయనకు బలమైన ఆర్థిక నేపథ్యం ఉంది. ఇన్నోవేషన్, సైన్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపైన్ కూడా పోటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2015లో మొదటిసారి ఎంపీగా ఎన్నికైన షాంపైన్ అనేక కేబినెట్ బాధ్యతలను నిర్వహించారు. రాజకీయాల్లోకి రాకముందు స్వీడిష్–స్విస్ బహుళజాతి ఆటోమేషన్ కంపెనీ ఏబీబీ గ్రూప్‌లో షాంపైన్ సీనియర్ పాత్ర పోషించారు.
కొత్త ప్రధాని ఎన్నిక...
కొత్త నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించాలని తాను పార్టీని కోరినట్లు ట్రూడో తెలిపారు. లిబరల్ అధ్యక్షుడు సచిత్ మెహ్రా ఈ వారంలో పార్టీ జాతీయ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. అమెరికా తరహాలోనే కెనడాలో ప్రత్యేక నాయకత్వ సమావేశాల ద్వారా నాయకుడిని ఎన్నుకుంటారు. ఇది నిర్వహించడానికి నెలలు పడుతుంది. ట్రూడో ఇంకా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీకి చాలా సమయం పట్టవచ్చు. 2013 ఏప్రిల్‌లో లిబరల్ నాయకుడిగా ట్రూడోని ఎన్నుకున్నప్పుడు పోటీ సరిగ్గా ఐదు నెలలు కొనసాగింది. 2006లో దాదాపు ఎనిమిది నెలల పాటు కొనసాగింది. అయితే ట్రూడో నాయకత్వంపై పెరిగిన వ్యతిరేకత కారణంగా లిబరల్ పార్టీ వీలైనంత త్వరగా ట్రూడో స్థానాన్ని భర్తీ చేసేలా సంక్షిప్త పోటీని ప్రకటించి కొత్త నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నిక లిబరల్ పార్టీ భవిష్యత్తునే కాకుండా కెనడా రాజకీయ దిశను కూడా నిర్ణయిస్తుంది.
ముందస్తు ఎన్నికలు జరిగేనా?
అయితే నాయకుడు ఎవరయినా లిబరల్స్ ఎన్నికల్లో ఓడిపోతారని సర్వేలు బలంగా చెబుతున్నాయి. అందుకే జనవరి 27 తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టాలని తొలుత విపక్షాలు భావించాయి. జనవరి 27న తిరిగి ప్రారంభం కావాల్సిన పార్లమెంటును మార్చి 24 వరకు వాయిదా వేస్తున్నట్టు ట్రూడో ప్రకటించారు. సెషన్ ఎజెండా ప్రభుత్వ నియంత్రణలో ఉండటంతో పార్లమెంటు సమావేశాలకోసం ప్రతిపక్షాలు వేచి చూడక తప్పదు. సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రతిపక్షాలన్నీ కలిసి ఓటు వేస్తే లిబరల్స్‌ను ఓడించే అవకాశం ఉంటుంది. అలాగైనా మే లోపు కొత్త ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఎలాగోలా జూన్ 20 వరకు లిబరల్స్ అధికారంలో ఉంటే అక్టోబర్ నెలాఖరులో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి.
తమిళ మూలాలు...
భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ ఐదేళ్లుగా మంత్రి పదవిలో ఉన్నారు. రవాణా శాఖతో పాటు పబ్లిక్ సర్విసెస్, ప్రొక్యూర్మెంట్ సహా పలు శాఖలను నిర్వహించారు. అనిత తండ్రి తమిళుడు. తల్లి పంజాబీ. 57 ఏళ్ల అనిత.. ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్నారు. 2019లో ఓక్‌విల్లే నుంచి ఎంపీగా గెలుపొందిన ఆమె ట్రూడో కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. 2019 నవంబర్ నుంచి 2021 అక్టోబర్ వరకు పబ్లిక్ సర్విసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2021 అక్టోబర్ నుంచి 2023 జూలై వరకు రక్షణ మంత్రిత్వ శాఖకు సారథ్యం వహించారు. రక్షణ మంత్రిగా, రష్యాతో యుద్ధం మధ్య ఉక్రెయిన్‌కు సహాయం అందించడానికి కెనడా చేసిన ప్రయత్నాలకు ఆనంద్ నాయకత్వం వహించారు. అయితే 2024 డిసెంబర్ వరకు ట్రెజరీ బోర్డును పర్యవేక్షించడానికి ఆమెను రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి తప్పించారు. గత నెలలో జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా ఆమెను మళ్లీ రవాణా, అంతర్గత వాణిజ్య శాఖ మంత్రిగా మార్చారు.
Comments
Please login to add a commentAdd a comment