ఊళ్లలో కాని, పట్టణాల్లో కాని మనం ఉంటున్న వీధి పేర్లు ఎప్పటినుంచో ఉన్నవే. పైగా కొన్నింటి వీధుల పేర్ల చరిత్ర మనకు ఎంత మాత్రమూ తెలియదు. అయితే ఇప్పుడు గుజరాత్‌లోని కచ్ జిల్లాకు చెందిన కుక్మా గ్రామ పంచాయితీ వాళ్లు తమ పరిధిలోని వీధులకు ఓ ప్రత్యేకత తీసుకువస్తున్నారు. హిమాని మార్గ్, శివానీ మార్గ్, సోనాలి మార్గ్, రుచితా మార్గ్, భూమి మార్గ్, అశ్విని మార్గ్, గుల్జార్ మార్గ్, ఉర్వి మార్గ్, శిల్పా మార్గ్, కోమల్ మార్గ్, జియా మార్గ్, పాలక్ మార్గ్, కృపా మార్గ్, ఖుషి మార్గ్, హెన్షి మార్గ్, పూజా మార్గ్.. ఇలా తమ గ్రామాలకు చెందిన 16 మంది ప్రతిభావంతులైన కూతుళ్ల పేర్లను వీధులకు పెట్టబోతున్నారు.
వీళ్లంతా చదువులో ప్రతిభ కనబరిచి, ఉద్యోగాలలో రాణిస్తూ ఇంటికి, ఊరికి పేరు తెచ్చినవారే. కుక్మా పంచాయతీ సర్పంచ్ కంకుబెన్ వాంకర్ 2018 సెప్టెంబరులో ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ పదహారు మంది అమ్మాయిల పేర్లు పెట్టడానికి ఇటీవలే పంచాయతీ సర్వసభ్య సమావేశంలో తీర్మానాన్నీ ఆమోదించారు. కుక్మా పంచాయితీ.. కచ్ జోన్ ప్రధాన కార్యాలయమైన భుజ్ తహసీల్ పరిధిలోకి వస్తుంది. కచ్ జిల్లా మహిళా, శిశు అభివృద్ధి అధికారి గత నెలలో జారీ చేసిన సర్క్యులర్ వల్ల స్ఫూర్తివంతమైన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే కుక్మా గ్రామ పంచాయితీ తీరుతెన్నులు తెలుసుకోవడానికి ఐదు జిల్లాల నుండి సర్పంచ్‌లు వచ్చారు. తమ ప్రాంతాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలనే చేపట్టాలని, ఇది మహిళాభ్యున్నతికి తోడ్పడేలా ఉందని వారు కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment