హైదరాబాద్‌లో స్పార్క్ 10 స్టార్టప్ యాక్సిలేటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘కొత్త కంపెనీలంటేనే (స్టార్టప్స్) మంచి ఆలోచనలకు, ఆవిష్కరణలకు వేదికలు. సమస్యల్లా ఆచరణకు అవసరమైన మార్గదర్శకత్వం, నిధుల కొరత’’ ఇదీ స్పార్క్ 10 లీడ్ ఫౌండర్ అటల్ మాలవీయ మాట. దీనికి తగిన పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతోనే హైదరాబాద్ వేదికగా ‘స్పార్క్ 10’ స్టార్టప్ యాక్సిలేటర్‌ను ప్రారంభించామని తెలియజేశారాయన. స్పార్క్ 10 వ్యవస్థాపకులు సుబ్బరాజు, విజయ్ కేతన్, ఎల్‌ఎన్ పర్మి, డాక్టర్ సురేష్ కామిరెడ్డి, రాజేష్ తదితరులతో కలిసి సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు.
స్టార్టప్స్ హబ్‌గా పేరొందిన బెంగళూరును కాదని హైదరాబాద్‌లో ఈ యాక్సిలరేటర్‌ను ప్రారంభించడానికి ప్రధాన కారణం.. స్పార్క్ 10 ఫౌండర్స్‌లో చాలా మంది ఇక్కడి వారే కావటం ఒకెత్తయితే... ఇక్కడి స్టార్టప్స్‌కు కాసింత ప్రోత్సాహం, ఆఫీసు స్థలం కల్పిస్తే ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు వస్తుందని తమ పరిశోధనలో తేలిందన్నారు. అందుకే భాగ్యనగరాన్ని ఎంచుకున్నామన్నారు. అసలు స్పార్క్ 10 ఏం చేస్తుందని అడిగిన ప్రశ్నకు... ‘‘భవిష్యత్తు అవసరాలను తీర్చే 10 స్టార్టప్స్‌ను ఎంపిక చేస్తారు.
అవసరాన్ని బట్టి ఒక్కో స్టార్టప్స్‌లో రూ.20 లక్షలు పెట్టుబడులు పెడతారు. 13 వారాల పాటు ప్రపంచ స్థాయి మెంటార్స్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలుంటాయి. మరి స్పార్క్ 10కి ఏం లాభమంటే.. నిధుల సమీకరణ అయ్యాక.. కంపెనీ ఒక స్థాయికొచ్చాక.. ఆ స్టార్టప్స్‌లో కొంత వాటా తీసుకుంటాం. అది సుమారు 8% వరకూ ఉండొచ్చు’’ అని అటల్ వివరించారు. స్టార్టప్స్‌లకు ఆఫీసు ఏర్పాటుకు గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఈఎస్‌సీఐ)లో రెండున్నర ఎకరాల్లో క్యాంపస్‌ను ప్రారంభించామన్నారు.
తొలి విడతగా 4,000 చ.అ. కార్యాలయ స్థలాన్ని అందుబాటులో ఉంచామన్నారు. దరఖాస్తు విధానాన్ని వచ్చే ఏడాది జనవరి చివరి నుంచి ప్రారంభిస్తామన్నారు. మెంటార్స్‌గా యూరోపియన్ స్టార్టప్స్‌కు గాడ్ ఫాదర్‌గా పేరొందిన జాన్ బ్రాడ్‌ఫోర్డ్‌తో ఈగ్నైట్ సీఈఓ పాల్ స్మిత్, హెచ్‌బీసీ మాజీ వైస్ ప్రెసిడెంట్ విజయ్ కేతన్ మిత్రా.. సుమారు 500 మంది ఉంటారన్నారు. అలాగే 25-30 మంది పెట్టుబడిదారులు కూడా ఈ యాక్సిలరేటర్‌లో రిజిస్టరై ఉన్నారన్నారు. రెండేళ్లలో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు లక్ష్యమని మాలవీయ తెలియజేశారు.