ముంబై: అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో దేశీ అంకుర సంస్థల్లోకి పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా తగ్గిపోతోంది. గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 79 శాతం క్షీణించింది. వెంచర్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం గతేడాది జనవరి–జూన్ మధ్యకాలంలో 18.4 బిలియన్ డాలర్ల మేర ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ (పీఈ/వీసీ) పెట్టుబడులు రాగా ఈసారి మాత్రం అదే వ్యవధిలో 3.8 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి.
ఫండింగ్ పరిమాణం తగ్గిపోవడం ఒక ఎత్తైతే.. అటు డీల్స్ కూడా పడిపోవడం మరో ఎత్తు. గతేడాది ప్రథమార్థంతో పోలిస్తే ఒప్పందాల సంఖ్య 60 శాతం క్షీణించి 727 నుంచి 293కి పడిపోయింది. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో పీఈ/వీసీ ఫండ్స్ వర్ధమాన మార్కెట్లలో రిసు్కలతో కూడుకున్న పెట్టుబడులు పెట్టడం కంటే పెద్దగా రిసు్కలు లేకుండా మెరుగైన రాబడులు అందించే బాండ్లు మొదలైన సాధనాల వైపు మొగ్గు చూపుతున్నారని ఆస్క్ ప్రైవేట్ వెల్త్ సీఈవో రాజేష్ సలూజా తెలిపారు. అయితే, దీర్ఘకాలికంగా ఈ ధోరణి ఉండకపోవచ్చని, పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత పెట్టుబడులు మళ్లీ పుంజుకోగలవని ఆయన అభిప్రాయపడ్డారు.
తగ్గిన వేల్యుయేషన్స్ ..
కోవిడ్ తర్వాత ఒక్కసారిగా ఎగిసిన దేశీ టెక్నాలజీ స్టార్టప్‌ల వేల్యుయేషన్లు గత కొన్నాళ్లుగా గణనీయంగా తగ్గాయి. యూనికార్న్‌లపరంగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు) ప్రపంచంలోనే భారత్ మూడో ర్యాంకులో ఉన్నప్పటికీ .. గత తొ మ్మిది నెలలుగా కొత్తగా ఒక్క అంకుర సంస్థ కూడా యూనికార్న్ హోదా దక్కించుకోలేదు. సమీప కాలంలో దక్కించుకునే సూచనలూ కనిపించడం లేదు. యూనికార్న్‌లు కాగలిగే సత్తా ఉన్న అంకురాలంటూ హురున్ గతేడాది 122 స్టార్టప్‌లతో జాబితా చేయగా, ఈ ఏడాది అందులో నుంచి 19 సంస్థలు స్థానం కోల్పోయాయి.
మరోవైపు, ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా వాటాలు విక్రయించి పెట్టుబడులు తెచ్చుకునేందుకు అంకుర సంస్థలు కూడా సుముఖత చూపడం లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అత్యంత సంపన్న వర్గాలు లేదా వెంచర్ డెట్ ఫండ్స్ నుంచి రుణాల రూపంలో తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నాయి. తద్వారా వాటాలను విక్రయించాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నట్లు వివరించాయి. చక్కని పనితీరుతో మంచి వేల్యుయేషన్ గల కంపెనీలు.. మార్కెట్ పరిస్థితులు బాగా లేనప్పుడు నిధులను సమీకరించేందుకు ఇష్టపడవని హురున్ ఇండియా ఎండీ అనాస్ రెహా్మన్ జునైద్ తెలిపారు. బుల్ మార్కెట్‌తో పోలిస్తే బేర్ మార్కెట్లో సరైన వేల్యుయేషన్ లభించదు కాబట్టి పరిస్థితి చక్కబడే వరకు అవి కాస్త వేచి చూస్తాయని పేర్కొన్నారు.
డేటాలో మరిన్ని అంశాలు..
► 2023 ప్రథమార్ధంలో 170 పైచిలుకు తొలి దశ పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 2022 ప్రథమార్ధంలో నమోదైన 435 డీల్స్‌తో పోలిస్తే 61 శాతం క్షీణించాయి. ఇన్వెస్ట్ చేసిన నిధుల పరిమాణం బట్టి చూస్తే స్టార్టప్‌లకు 624 మిలియన్ డాలర్లు లభించాయి. గతేడాది ప్రథమార్ధంలో వచి్చన 1.8 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 65 శాతం క్షీణత.
► వృద్ధి దశ, ఆఖరు అంచె పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గాయి. 123 డీల్స్ ద్వారా 3.2 బిలియన్ డాలర్లు వచ్చాయి. గతేడాది ఇదే వ్యవధిలో ఈ విభాగానికి సంబంధించి 292 డీల్స్ ద్వారా 16.6 బిలియన్ డాలర్లు వచ్చాయి.
► మే నెలలో 948 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో 53 డీల్స్ కుదరగా .. జూన్‌లో 546 మిలియన్ డాలర్ల విలువ చేసే 44 ఒప్పందాలు కుది రాయి. గతేడాది జూన్‌లో ఏకంగా 2.4 బిలియ న్ డాలర్ల విలువ చేసే 108 డీల్స్ కుదిరాయి.
► ప్రథమార్ధంలో పీక్ 15 పార్ట్‌నర్స్ (గతంలో సెక్వోయా ఇండియా) అత్యధికంగా 21 డీల్స్‌తో టాప్ ఇన్వెస్టరుగా నిలి్చంది. యాక్సెల్ ఇండియా 11, బ్లూమ్ వెంచర్స్ 10 ఒప్పందాలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రెయిన్‌మ్యాటర్ క్యాపిటల్, ఆనికట్ క్యాపిటల్, లైట్‌స్పీడ్ వెంచర్స్ మొదలైన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు చురుగ్గా పాలుపంచుకున్నాయి.
► ఈ ఏడాది ఇప్పటివరకూ కళ్లద్దాల బ్రాండ్ లెన్స్‌కార్ట్ అత్యధికంగా 500 మిలియన్ డాలర్లు సమీకరించింది. 250 మిలియన్ డాలర్లతో బిల్డర్.ఏఐ, తలో 150 మిలియన్ డాలర్లతో ఇన్‌ఫ్రా.మార్కెట్, జెట్‌వెర్క్, ఇన్సూరెన్స్‌దేఖో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
అధిక వేల్యుయేషన్స్‌తో ఒత్తిడి ..
అంకుర సంస్థల ప్రమోటర్లు, వ్యవస్థాపకులు భారీ వేల్యుయేషన్స్‌తో పెట్టుబడులు సమీకరించడం శ్రేయస్కరం కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల సత్వరం ఫలితాలు చూపించాల్సిన ఒత్తిడి పెరిగిపోతుందని వారు తెలిపారు. ఫలితంగా దీర్ఘకాలికంగా ఆలోచించడం కన్నా స్వల్పకాలిక ప్రయోజనాల కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయని వివరించారు. భారత్‌పే, ట్రెల్, జిలింగో, గోమెకానిక్ వంటి పలు దేశీ అంకుర సంస్థల్లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు బైటపడటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాల వల్ల కూడా ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తున్నారని చెప్పారు. కాబట్టి అంకుర సంస్థలు అధిక వేల్యుయేషన్ల వెంటబడకుండా అవసరానికి తగినన్ని నిధులను మాత్రమే సమీకరించుకోవడం, సుస్థిరమైన వ్యాపార మోడల్‌ను తీర్చిదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment