న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు, అనిశ్చితి పెరగడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం తదితర అంశాల ప్రభావం దేశీ అగ్రి - టెక్ స్టార్టప్‌పైనా పడుతోంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో (2021–22, 2022–23) వాటిలో పెట్టుబడులు 45 శాతం మేర పడిపోయాయి. అటు 2022, 2023 క్యాలెండర్ సంవత్సరాల్లో అంతర్జాతీయంగా అగ్రి - టెక్ పెట్టుబడులు 10 శాతం మేర తగ్గాయి. కన్సల్టింగ్ సంస్థ ఎఫ్‌ఎస్‌జీ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో కూడా ఫండింగ్ తగ్గుదల కొనసాగవచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరం తిరిగి పుంజుకోగలదని నివేదిక పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు నిలదొక్కుకునేందుకు అంకుర సంస్థలు లాభదాయకతపైనా దృష్టి పెట్టడం కొనసాగించే అవకాశం ఉందని తెలిపింది. ‘ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం కొనసాగించవచ్చు.
తమ దగ్గర పరిమిత స్థాయిలో ఉన్న నిధులను.. ఇప్పటికే నిలదొక్కుకున్న వ్యాపారాలవైపు మళ్లించే అవకాశం ఉంది‘ అని ఎఫ్‌ఎస్‌జీ వివరించింది. ‘పెట్టుబడుల తీరు మారిపోతుండటం.. అంతర్జాతీయ ఆర్థిక ధోరణుల ప్రభావం దేశీ అగ్రి–టెక్ రంగంపై ఎలా ఉంటాయనేది తెలియజేస్తోంది. పెట్టుబడులు మందగించిన ఈ తరుణాన్ని స్టార్టప్‌లు.. తమ వ్యాపార విధానాలను మెరుగుపర్చుకునేందుకు, లాభదాయకతవైపు మళ్లేందుకు ఉపయోగించుకోవాలి‘ అని సంస్థ ఎండీ రిషి అగర్వాల్ తెలిపారు.
డీల్స్ పెరిగినా ఫండింగ్ తగ్గింది..
నివేదిక ప్రకారం.. 2022 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల డీల్స్ 121 నమోదు కాగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 140కి చేరాయి. కానీ, అగ్రి–టెక్ స్టార్టప్‌లు సమీకరించిన నిధుల పరిమాణం 2022 ఆర్థిక సంవత్సరంలో 1,279 మిలియన్ డాలర్లుగా ఉండగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 706 మిలియన్ డాలర్లకు పడిపోయింది. మరోవైపు, 2022 ఆర్థిక సంవత్సరంలో అగ్రి–టెక్ అంకుర సంస్థల్లోకి పెట్టుబడుల బూమ్ వచ్చి, వాటి వేల్యుయేషన్స్ అసాధారణ స్థాయులకు ఎగిశాయి. కానీ మరుసటి ఆర్థిక సంవత్సరంలో కరెక్షన్ రావడంతో కొంత విచక్షణాయుతమైన పెట్టుబడుల వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment