న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి 9 నెలల్లో 26 శాతం క్షీణించాయి. వెరసి ఏప్రిల్–డిసెంబర్ కాలంలో 2.65 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా దేశ, విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం ప్రభావం చూపినట్లు అనరాక్ క్యాపిటల్ పేర్కొంది. గతేడాది(2022–23) తొలి 9 నెలల్లో దేశ రియల్టీ రంగంలోకి 3.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రవహించాయి.
తాజాగా నమోదైన పీఈ పెట్టుబడుల్లో 84 శాతం ఈక్విటీ రూపేణా లభించగా.. రుణాలుగా మిగిలిన నిధులను అందించినట్లు ఫ్లక్స్ పేరుతో విడుదల చేసిన నివేదికలో అనరాక్ తెలియజేసింది. మొత్తం పీఈ పెట్టుబడుల్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా 79 శాతం నుంచి 86 శాతానికి బలపడినట్లు సంస్థ ఎండీ, సీఈవో శోభిత్ అగర్వాల్ వెల్లడించారు. ఇదే సమయంలో దేశీ పెట్టుబడుల వాటా 14 శాతం నీరసించినట్లు పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సగానికి తగ్గి 36 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది తొలి 9 నెలల్లో రియల్టీలో 71.7 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశారు.
కారణాలివే..
దేశ, విదేశీ ఇన్వెస్టర్ల లావాదేవీలు బలహీనపడటంతో రియల్టీలో మొత్తం పీఈ పెట్టుబడులు వెనకడుగు వేసినట్లు అనరాక్ పేర్కొంది. అంతర్జాతీయ అనిశ్చితులు, అధిక వడ్డీ రేట్ల వాతావరణం కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల లావాదేవీలు మందగించినట్లు వివరించింది. వ్యయభరిత నిధుల కారణంగా రెసిడెన్షియల్ రియల్టీ రుణ విభాగానికి డిమాండ్ తగ్గడంతో దేశీ ప్రత్యామ్నాయ పెట్టుబడుల ఫండ్స్(ఏఐఎఫ్) నుంచి లావాదేవీలు నీరసించినట్లు అగర్వాల్ తెలియజేశారు.
రెసిడెన్షియల్ విభాగంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆధిపత్యం నేపథ్యంలో అధిక వ్యయాలతోకూడిన ఏఐఎఫ్ పెట్టుబడులు తగ్గినట్లు వివరించారు. ఈ కాలంలో సగటు టికెట్(రుణ) పరిమాణం 9.1 కోట్ల డాలర్ల నుంచి నామమాత్ర వృద్ధితో 9.5 కోట్ల డాలర్లకు చేరింది. బ్రూక్‌ఫీల్డ్ రియల్టీ ట్రస్ట్, సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ జీఐసీ సంయుక్తంగా రెండు భారీ డీల్స్‌ను కుదుర్చుకున్నాయి. బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ నుంచి 1.4 బిలియన్ డాలర్ల ఎంటర్‌ప్రైజ్ విలువలో ఒకటి ముంబైలో, మరొకటి ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలోని గురుగ్రామ్‌లో కొనుగోలు చేశాయి. ఈ అంశాలు ఏఐఎఫ్ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపాయి.
Comments
Please login to add a commentAdd a comment