PE Fund
-
రియల్టీలో పీఈ పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి 9 నెలల్లో 26 శాతం క్షీణించాయి. వెరసి ఏప్రిల్–డిసెంబర్ కాలంలో 2.65 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా దేశ, విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం ప్రభావం చూపినట్లు అనరాక్ క్యాపిటల్ పేర్కొంది. గతేడాది(2022–23) తొలి 9 నెలల్లో దేశ రియల్టీ రంగంలోకి 3.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రవహించాయి. తాజాగా నమోదైన పీఈ పెట్టుబడుల్లో 84 శాతం ఈక్విటీ రూపేణా లభించగా.. రుణాలుగా మిగిలిన నిధులను అందించినట్లు ఫ్లక్స్ పేరుతో విడుదల చేసిన నివేదికలో అనరాక్ తెలియజేసింది. మొత్తం పీఈ పెట్టుబడుల్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా 79 శాతం నుంచి 86 శాతానికి బలపడినట్లు సంస్థ ఎండీ, సీఈవో శోభిత్ అగర్వాల్ వెల్లడించారు. ఇదే సమయంలో దేశీ పెట్టుబడుల వాటా 14 శాతం నీరసించినట్లు పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సగానికి తగ్గి 36 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది తొలి 9 నెలల్లో రియల్టీలో 71.7 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. కారణాలివే.. దేశ, విదేశీ ఇన్వెస్టర్ల లావాదేవీలు బలహీనపడటంతో రియల్టీలో మొత్తం పీఈ పెట్టుబడులు వెనకడుగు వేసినట్లు అనరాక్ పేర్కొంది. అంతర్జాతీయ అనిశ్చితులు, అధిక వడ్డీ రేట్ల వాతావరణం కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల లావాదేవీలు మందగించినట్లు వివరించింది. వ్యయభరిత నిధుల కారణంగా రెసిడెన్షియల్ రియల్టీ రుణ విభాగానికి డిమాండ్ తగ్గడంతో దేశీ ప్రత్యామ్నాయ పెట్టుబడుల ఫండ్స్(ఏఐఎఫ్) నుంచి లావాదేవీలు నీరసించినట్లు అగర్వాల్ తెలియజేశారు. రెసిడెన్షియల్ విభాగంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆధిపత్యం నేపథ్యంలో అధిక వ్యయాలతోకూడిన ఏఐఎఫ్ పెట్టుబడులు తగ్గినట్లు వివరించారు. ఈ కాలంలో సగటు టికెట్(రుణ) పరిమాణం 9.1 కోట్ల డాలర్ల నుంచి నామమాత్ర వృద్ధితో 9.5 కోట్ల డాలర్లకు చేరింది. బ్రూక్‌ఫీల్డ్ రియల్టీ ట్రస్ట్, సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ జీఐసీ సంయుక్తంగా రెండు భారీ డీల్స్‌ను కుదుర్చుకున్నాయి. బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ నుంచి 1.4 బిలియన్ డాలర్ల ఎంటర్ప్రైజ్ విలువలో ఒకటి ముంబైలో, మరొకటి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని గురుగ్రామ్‌లో కొనుగోలు చేశాయి. ఈ అంశాలు ఏఐఎఫ్ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపాయి. -
దేశీ రియల్టీ రంగంలో డీలా పడ్డ పీఈ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు ఈ క్యాలండర్ ఏడాది(2022) తొలి త్రైమాసికంలో డీలా పడ్డాయి. ఈ క్యూ1(జనవరి–మార్చి)లో 47 శాతం క్షీణించి 100 కోట్ల(బిలియన్) డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021) ఇదే కాలంలో 1.9 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ లభించాయి. అయితే గతేడాది క్యూ4(అక్టోబర్–డిసెంబర్)లో 21.8 కోట్ల డాలర్ల పెట్టుబడులే నమోదయ్యాయి. వీటితో(త్రైమాసికవారీగా) పోలిస్తే పీఈ పెట్టుబడులు తాజా క్వార్టర్లో 4.5 రెట్లు జంప్‌చేసినట్లని ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ సావిల్స్ ఇండియా పేర్కొంది. ఈ క్యూ1లో వాణిజ్య కార్యాలయాల ఆస్తులు అత్యధిక పెట్టుబడులను ఆకట్టుకున్నట్లు తెలియజేసింది. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 70 శాతాన్ని ఆక్రమించడం గమనార్హం! విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి లభించిన అత్యధిక శాతం త్రైమాసిక పెట్టుబడుల్లో బెంగళూరులోని కీలక ఆఫీసు ఆస్తులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు సావిల్స్ ఇండియా వెల్లడించింది. కాగా.. ఈ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో దేశీ రియల్టీ రంగ పీఈ పెట్టుబడులు 32 శాతం వెనకడుగు వేసినట్లు గత వారం అనరాక్ నివేదిక పేర్కొన్న విషయం విదితమే. 2020–21లో తరలివచ్చిన 6.3 బిలియన్ డాలర్లతో పోలిస్తే 4.3 బిలియన్ డాలర్లకే పరిమితమైనట్లు తెలియజేసింది. చదవండి: షాకింగ్ న్యూస్..భారీగా పెరగనున్న ఇళ్ల ధరలు..కారణం అదే..? -
టాటా ఈక్విటీ పీఈ ఫండ్ పనితీరు భేష్
ఈక్విటీ మార్కెట్లు అదే పనిగా నూతన గరిష్టాలకు ర్యాలీ చేస్తుండడంతో స్టాక్స్ విలువలు మరితంగా విస్తరించాయని.. కొన్నింటి విలువలు మరీ మితిమీరిన స్థాయికి చేరాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో వ్యాల్యూ స్టాక్స్ పట్ల దృష్టి సారించాలన్న సూచన వినిపిస్తోంది. వ్యాల్యూ స్టాక్స్ అన్నవి.. వాటి అంతర్గత విలువతో (ఇంట్రిన్సిక్ వ్యాల్యూ) పోలిస్తే ఆకర్షణీయమైన ధరల వద్ద లభించేవి. గ్రోత్ స్టాక్స్ మాదిరి వ్యాల్యూ స్టాక్స్ ధరలు పరుగులు పెట్టవు. కానీ స్థిరమైన పనితీరు చూపిస్తుంటాయి. అస్థిరతలు తక్కువ. దీర్ఘకాలంలో వ్యాల్యూ స్టాక్స్ సైతం మంచి రాబడులను ఇస్తాయని చాలా మంది నిపుణుల అంచనా. కనీసం ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికి, దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్టర్లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోని వ్యాల్యూ ఫండ్స్ విభాగాన్ని ఎంపిక చేసుకోవవచ్చు. ఈ విభాగంలో టాటా ఈక్విటీ పీఈ ఫండ్ పనితీరును గమనించినట్టయితే నిలకడగా కనిపిస్తుంది. పెట్టుబడుల విధానం బీఎస్ఈ సెన్సెక్స్ పీఈ కంటే 12 నెలల ట్రెయిలింగ్ పీఈ రేషియో తక్కువగా ఉన్న స్టాక్స్‌ను ఈ పథకం ఎంపిక చేసుకుంటుంది. తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 70 శాతాన్ని ఈ స్టాక్స్‌కే కేటాయిస్తుంటుంది. ఇలా ఎంపిక చేసిన కంపెనీల్లోనూ భవిష్యత్తులో మంచి వృద్ధికి అవకాశం ఉన్న వాటిని తుది జాబితాగా తీసుకుంటుంది. ఆయా రంగాల్లో కంపెనీల స్థానం ఏంటి, వాటికి ఉన్న వృద్ధి అవకాశాలు, రాబడుల రేషియోలు ఎలా ఉన్నాయి, స్టాక్ లిక్విడిటీ ఈ అంశాలన్నింటికీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. అన్ని రంగాల మధ్య, అన్ని స్థాయిల కంపెనీల్లోనూ (లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్) ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈ పథకానికి ఉంది. పనితీరు ఈ పథకం రాబడులను గమనించినట్టయితే.. గడిచిన ఏడాది కాలంలో 47 శాతంగా ఉన్నాయి, మూడేళ్లలో చూసినా వార్షికంగా 14.52 శాతం రాబడిని ఇచ్చింది. ఐదేళ్లలో 13.61 శాతం, ఏడేళ్లలో 14.26 శాతం, పదేళ్లలో 16.62 శాతం చొప్పున వార్షిక రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. 2004లో ఈ పథకం ప్రారంభం కాగా.. నాటి నుంచి చూసుకున్నా గానీ వార్షికంగా 19 శాతం చొప్పున పెట్టుబడులపై ఇన్వెస్టర్లకు ప్రతిఫలాన్నిచ్చింది. వ్యాల్యూ ఆధారిత విభాగం సగటు రాబడులతో పోల్చి చూస్తే ఏడేళ్లు, పదేళ్లలో ఈ పథకంలో ఎక్కువ రాబడులు కనిపిస్తాయి. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.5,021 కోట్ల ఆస్తులున్నాయి. ఇందులో 95.5 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా.. మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలోనే కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 37 స్టాక్స్ ఉన్నాయి. టాప్ 10 స్టాక్స్‌లోనే 53 శాతం పెట్టుబడులు ఉండడం గమనార్హం. పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్ సగటు పీఈ రేషియో 23.77 శాతంగా ఉంది. 69 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించగా.. మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో 27 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 4 శాతం వరకు పెట్టుబడులు పెట్టి ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 34 శాతానికి పైనే పెట్టుబడులను కేటాయించింది. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీలకు, ఇంధనం, ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ఈ పథకం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. చదవండి: స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్.. పెట్టుబడికి ఏదీ మంచిది ? -
ఆర్ఎస్ బ్రదర్స్ భారీ విస్తరణ
- 2016కల్లా దక్షిణాది రాష్ట్రాలకు - దుబాయ్, యూఎస్లకూ ఔట్లెట్లు - పీఈ ఫండ్ స్వీకరించే ఆలోచన - ఆర్ఎస్ గ్రూప్ ఎండీ వెంకటేశ్వర్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్త్రాలు, బంగారు ఆభరణాల రిటైల్ వ్యాపార రంగంలో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ భారీగా విస్తరిస్తోంది. ఈ ఏడాది మరో 3 స్టోర్లను ప్రారంభిస్తోంది. 2016లో తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అడుగు పెట్టనుంది. ఆర్ఎస్ గ్రూప్ ఇప్పటికే హైదరాబాద్, విజయవాడలో 13 ఔట్లెట్లను నిర్వహిస్తోంది. విస్తరణలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, వైజాగ్, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి పట్టణాలు సంస్థ పరిశీలనలో ఉన్నాయి. దుబాయ్, యూఎస్, సింగపూర్, మలేషియాల్లోనూ స్టోర్లను ప్రారంభించాలన్న ప్రణాళిక ఉందని గ్రూప్ ఎండీ పి.వెంకటేశ్వర్లు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. 1999లో ఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైందని, కోట్లాది మందికి చేరువయ్యామని చెప్పారు. వినియోగదార్లకు మరింత దగ్గరయ్యేందుకే విస్తరణ బాట పట్టామన్నారు. టర్నోవర్ రూ. 1,000 కోట్లు.. గ్రూప్ టర్నోవర్ 2013-14లో వస్త్రాల విక్రయాల నుంచి రూ. 480 కోట్లు, బంగారు ఆభరణాల వ్యాపారం ద్వారా రూ. 300 కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం టర్నోవర్ రూ. 900 కోట్లుగా అంచనా వేస్తోంది. 2015-16లో రూ. 1,000 కోట్లను దాటాలన్నదే తమ లక్ష్యమని గ్రూప్ డెరైక్టర్ ఎస్.రాజమౌళి వెల్లడించారు. ఒక్కో స్టోర్‌కు విస్తీర్ణాన్నిబట్టి రూ. 50 కోట్ల దాకా వ్యయం అవుతుందని చెప్పారు. విస్తరణలో భాగంగా అవసరమైతే ప్రైవేట్ ఈక్విటీ ద్వారా రూ.200 కోట్లు సమీకరించే అవకాశమూ ఉందన్నారు. ముంబైకి చెందిన పీఈ సంస్థలు తమతో సంప్రదిస్తున్నాయని వెల్లడించారు. గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న మెన్స్‌వేర్ రిటైల్ ఔట్లెట్ ‘స్టేటస్’ బ్రాండ్‌తో రెండేళ్లలో 10 ఔట్లెట్లను తెరవాలని సంస్థ నిర్ణయించింది. త్వరలో ఆన్‌లైన్‌లోనూ.. గ్రూప్ బోర్డులోకి రెండవతరం వచ్చి చేరింది. ఆన్‌లైన్‌నూ వేదికగా చేసుకొని సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లాలన్నది యువ డెరైక్టర్ల ఆలోచన. ఇందుకోసం చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. సంస్థ స్టోర్లకు నెలకు 6 లక్షల మంది కస్టమర్లు అడుగు పెడుతున్నారు. సీజన్లో ఈ సంఖ్య రెండింతలపైమాటే. వీరిలో 60 శాతం మంది పాత కస్టమర్లే కావడం విశేషం. వీరే తమ విజయానికి కారణమని సంస్థ చెబుతోంది. కస్టమర్ సగటున చేసే కొనుగోళ్లు 2010లో రూ.1,700 ఉంటే, ఇప్పుడది రూ.2,500లకు చేరిందని కంపెనీ తెలిపింది. వినియోగదార్ల కొనుగోలు సామర్థ్యం పెరగడమే ఇందుకు కారణమని వివరించింది.