న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి ఆరు నెలల(ఏప్రిల్–సెప్టెంబర్)లో కేమన్ ఐలాండ్స్, సైప్రస్ నుంచి భారత్‌కు వచ్చిన ఎఫ్‌డీఐలు భారీగా క్షీణించాయి. వెరసి దేశీయంగా నమోదైన ఎఫ్‌డీఐలు 24 శాతం బలహీనపడ్డాయి. కేమన్ ఐల్యాండ్స్ నుంచి 75 శాతం తగ్గి 14.5 కోట్ల డాలర్లకు పరిమితంకాగా.. గతేడాది(2022–23) ఇదే కాలంలో 58.2 కోట్ల డాలర్లు లభించాయి.
ఇక సైప్రస్ నుంచి మరింత అధికంగా 95 శాతం పడిపోయి 3.5 కోట్ల డాలర్లకు చేరాయి. గతంలో 76.4 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఇందుకు ఈ రెండు దేశాల దరఖాస్తులను నిశితంగా పరిశీలించడం ప్రభావం చూపింది. ఈ బాటలో సింగపూర్, యూఏఈల నుంచి సైతం పెట్టుబడులు వెనకడుగు వేశాయి.
అధిక ద్రవ్యోల్బణం కారణంగా యూఎస్, ఇతర పశ్చిమ దేశాలలో వడ్డీ రేట్లు పెరగడం, తూర్పు యూరప్, పశ్చిమాసియాలలో భౌగోళిక, రాజకీయ పరిస్థితులు తదితర అంశాలు భారత్‌కు వచ్చే ఎఫ్‌డీఐలను దెబ్బతీసినట్లు రెగ్యులేటరీ, నాంగియా ఆండర్సన్ ఇండియా పార్ట్‌నర్ అంజలీ మల్హోత్రా పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సైప్రస్ పెట్టుబడులు వార్షికంగా 62 శాతం తగ్గినట్లు డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్ సంజయ్ కుమార్ తెలియజేశారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ నుంచి కేమన్ ఐల్యాండ్స్‌ను ఎఫ్‌ఏటీఎఫ్ రిస్కుల జాబితా(గ్రే లిస్ట్) నుంచి తప్పించడంతో రానున్న కాలంలో భారత్‌కు పెట్టుబడులు పెరిగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment