Lack of funding
-
స్టార్టప్‌లకు నిధుల కొరత..
ముంబై: అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో దేశీ అంకుర సంస్థల్లోకి పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా తగ్గిపోతోంది. గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 79 శాతం క్షీణించింది. వెంచర్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం గతేడాది జనవరి–జూన్ మధ్యకాలంలో 18.4 బిలియన్ డాలర్ల మేర ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ (పీఈ/వీసీ) పెట్టుబడులు రాగా ఈసారి మాత్రం అదే వ్యవధిలో 3.8 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. ఫండింగ్ పరిమాణం తగ్గిపోవడం ఒక ఎత్తైతే.. అటు డీల్స్ కూడా పడిపోవడం మరో ఎత్తు. గతేడాది ప్రథమార్థంతో పోలిస్తే ఒప్పందాల సంఖ్య 60 శాతం క్షీణించి 727 నుంచి 293కి పడిపోయింది. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో పీఈ/వీసీ ఫండ్స్ వర్ధమాన మార్కెట్లలో రిసు్కలతో కూడుకున్న పెట్టుబడులు పెట్టడం కంటే పెద్దగా రిసు్కలు లేకుండా మెరుగైన రాబడులు అందించే బాండ్లు మొదలైన సాధనాల వైపు మొగ్గు చూపుతున్నారని ఆస్క్ ప్రైవేట్ వెల్త్ సీఈవో రాజేష్ సలూజా తెలిపారు. అయితే, దీర్ఘకాలికంగా ఈ ధోరణి ఉండకపోవచ్చని, పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత పెట్టుబడులు మళ్లీ పుంజుకోగలవని ఆయన అభిప్రాయపడ్డారు. తగ్గిన వేల్యుయేషన్స్ .. కోవిడ్ తర్వాత ఒక్కసారిగా ఎగిసిన దేశీ టెక్నాలజీ స్టార్టప్‌ల వేల్యుయేషన్లు గత కొన్నాళ్లుగా గణనీయంగా తగ్గాయి. యూనికార్న్‌లపరంగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు) ప్రపంచంలోనే భారత్ మూడో ర్యాంకులో ఉన్నప్పటికీ .. గత తొ మ్మిది నెలలుగా కొత్తగా ఒక్క అంకుర సంస్థ కూడా యూనికార్న్ హోదా దక్కించుకోలేదు. సమీప కాలంలో దక్కించుకునే సూచనలూ కనిపించడం లేదు. యూనికార్న్‌లు కాగలిగే సత్తా ఉన్న అంకురాలంటూ హురున్ గతేడాది 122 స్టార్టప్‌లతో జాబితా చేయగా, ఈ ఏడాది అందులో నుంచి 19 సంస్థలు స్థానం కోల్పోయాయి. మరోవైపు, ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా వాటాలు విక్రయించి పెట్టుబడులు తెచ్చుకునేందుకు అంకుర సంస్థలు కూడా సుముఖత చూపడం లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అత్యంత సంపన్న వర్గాలు లేదా వెంచర్ డెట్ ఫండ్స్ నుంచి రుణాల రూపంలో తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నాయి. తద్వారా వాటాలను విక్రయించాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నట్లు వివరించాయి. చక్కని పనితీరుతో మంచి వేల్యుయేషన్ గల కంపెనీలు.. మార్కెట్ పరిస్థితులు బాగా లేనప్పుడు నిధులను సమీకరించేందుకు ఇష్టపడవని హురున్ ఇండియా ఎండీ అనాస్ రెహా్మన్ జునైద్ తెలిపారు. బుల్ మార్కెట్‌తో పోలిస్తే బేర్ మార్కెట్లో సరైన వేల్యుయేషన్ లభించదు కాబట్టి పరిస్థితి చక్కబడే వరకు అవి కాస్త వేచి చూస్తాయని పేర్కొన్నారు. డేటాలో మరిన్ని అంశాలు.. ► 2023 ప్రథమార్ధంలో 170 పైచిలుకు తొలి దశ పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 2022 ప్రథమార్ధంలో నమోదైన 435 డీల్స్‌తో పోలిస్తే 61 శాతం క్షీణించాయి. ఇన్వెస్ట్ చేసిన నిధుల పరిమాణం బట్టి చూస్తే స్టార్టప్‌లకు 624 మిలియన్ డాలర్లు లభించాయి. గతేడాది ప్రథమార్ధంలో వచి్చన 1.8 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 65 శాతం క్షీణత. ► వృద్ధి దశ, ఆఖరు అంచె పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గాయి. 123 డీల్స్ ద్వారా 3.2 బిలియన్ డాలర్లు వచ్చాయి. గతేడాది ఇదే వ్యవధిలో ఈ విభాగానికి సంబంధించి 292 డీల్స్ ద్వారా 16.6 బిలియన్ డాలర్లు వచ్చాయి. ► మే నెలలో 948 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో 53 డీల్స్ కుదరగా .. జూన్‌లో 546 మిలియన్ డాలర్ల విలువ చేసే 44 ఒప్పందాలు కుది రాయి. గతేడాది జూన్‌లో ఏకంగా 2.4 బిలియ న్ డాలర్ల విలువ చేసే 108 డీల్స్ కుదిరాయి. ► ప్రథమార్ధంలో పీక్ 15 పార్ట్నర్స్ (గతంలో సెక్వోయా ఇండియా) అత్యధికంగా 21 డీల్స్‌తో టాప్ ఇన్వెస్టరుగా నిలి్చంది. యాక్సెల్ ఇండియా 11, బ్లూమ్ వెంచర్స్ 10 ఒప్పందాలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రెయిన్‌మ్యాటర్ క్యాపిటల్, ఆనికట్ క్యాపిటల్, లైట్‌స్పీడ్ వెంచర్స్ మొదలైన ఇన్వెస్ట్మెంట్ సంస్థలు చురుగ్గా పాలుపంచుకున్నాయి. ► ఈ ఏడాది ఇప్పటివరకూ కళ్లద్దాల బ్రాండ్ లెన్స్‌కార్ట్ అత్యధికంగా 500 మిలియన్ డాలర్లు సమీకరించింది. 250 మిలియన్ డాలర్లతో బిల్డర్.ఏఐ, తలో 150 మిలియన్ డాలర్లతో ఇన్ఫ్రా.మార్కెట్, జెట్వెర్క్, ఇన్సూరెన్స్‌దేఖో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అధిక వేల్యుయేషన్స్‌తో ఒత్తిడి .. అంకుర సంస్థల ప్రమోటర్లు, వ్యవస్థాపకులు భారీ వేల్యుయేషన్స్‌తో పెట్టుబడులు సమీకరించడం శ్రేయస్కరం కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల సత్వరం ఫలితాలు చూపించాల్సిన ఒత్తిడి పెరిగిపోతుందని వారు తెలిపారు. ఫలితంగా దీర్ఘకాలికంగా ఆలోచించడం కన్నా స్వల్పకాలిక ప్రయోజనాల కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయని వివరించారు. భారత్‌పే, ట్రెల్, జిలింగో, గోమెకానిక్ వంటి పలు దేశీ అంకుర సంస్థల్లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు బైటపడటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాల వల్ల కూడా ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తున్నారని చెప్పారు. కాబట్టి అంకుర సంస్థలు అధిక వేల్యుయేషన్ల వెంటబడకుండా అవసరానికి తగినన్ని నిధులను మాత్రమే సమీకరించుకోవడం, సుస్థిరమైన వ్యాపార మోడల్‌ను తీర్చిదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. -
కేంద్ర సాయం ‘లెక్కేంటి’?
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల విషయంలో సరైన సహకారం అందడం లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, జాతీయ ఆర్థిక ప్రగతిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలకు విరివిగా నిధులిచ్చి ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం... కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచే వివక్ష చూపుతోందని ‘కాగ్’గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో వివిధ పథకాల అమలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కేంద్రం నుంచి ఇప్పటివరకు రాష్ట్రం ఆశించిన దాంట్లో సగం మేరకు మాత్రమే నిధులు రావడం గమనార్హం. గత ఏడేళ్లలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 1.20 లక్షల కోట్లకుపైగా కేంద్రం ఇస్తుందని రాష్ట్రం అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనల్లో పెడితే అందులో ఏటా కోతలు విధించి ఇప్పటివరకు సుమారు రూ. 60 వేల కోట్లు మాత్రమే ఇవ్వడం గమనార్హం. కేంద్ర పన్నుల్లో వాటాలోనూ ఇదే తరహా కోతలు కనిపిస్తుండగా అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 38 వేల కోట్లకుపైగా వస్తుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొనడం గమనార్హం. (2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు కింద రూ. 38,669.46 కోట్లు, పన్నుల్లో వాటా కింద రూ. 13,990.13 కోట్లు వస్తాయని రాష్ట్రం ఆశలు పెట్టుకొని బడ్జెట్ అంచనాల్లో పొందుపరచడం గమనార్హం) ఏటేటా... అంతంతే గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయానికి వస్తే రాష్ట్రానికి ఏ యేడాదిలోనూ ఈ పద్దు కింద రూ. 15 వేల కోట్లు దాటలేదు. రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాదిలో ఈ పద్దు కింద రూ. 21 వేల కోట్లకుపైగా వస్తాయని రాష్ట్రం అంచనా వేస్తే అందులో నాలుగో వంతుకన్నా కొంచెం ఎక్కువగా అంటే... కేవలం రూ. 6 వేల కోట్లకుపైగా మాత్రమే ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుంది. ఆ తర్వాతి ఏడాది రూ. 7,500 కోట్లు, ఆ తర్వాత రూ. 9 వేల కోట్లు, అనంతరం వరుసగా రెండేళ్లు రూ. 8 వేల కోట్ల చొప్పున నామమాత్రపు సాయం చేసింది. అయితే ప్రతి ఏడాదిలోనూ కేంద్రం మీద రూ. 20 వేల కోట్లకుపైగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రానికి ఓ రకంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయంలో మొండిచేయి ఎదురైందనే చెప్పాలి. ఇక గత రెండేళ్లుగా వైఖరి మార్చిన కేంద్రం... గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులను కొంత పెంచింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి (2019–20)లో రూ. 11 వేల కోట్లకుపైగా 2020–21లో రూ. 12 వేల కోట్లకుపైగా నిధులిచ్చింది. అయితే అంతా కలిపినా రాష్ట్రం ఆశించిన దాంట్లో కేవలం సగం మాత్రమే కావడం గమనార్హం. వాటా నిధుల్లోనూ మార్పు లేదు... పన్నుల్లో వాటాకు సంబంధించి 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 12,514 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా ఆ ఏడాది అంతకుమించి రూ. 13,613.09 కోట్లను కేంద్రం ఇచ్చింది. ఆ తర్వాతి ఏడాది రూ. 14,348.90 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావించగా అందులో కోత పెట్టి కేవలం రూ. 11,450.85 కోట్లనే కేంద్రం ఇచ్చింది. గతేడాది (2020–21) కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ. 10,906.51 కోట్లు వస్తాయని బడ్జెట్లో ప్రతిపాదించగా ఫిబ్రవరి నాటికి కేంద్రం నుంచి వచ్చింది రూ. 6,483.08 కోట్లేనని ‘కాగ్’లెక్కలు చెబుతున్నాయి. అంటే గత మూడేళ్లలో రూ. 37,729 కోట్లకుపైగా నిధులను పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి కేంద్రం ఇస్తుందని అంచనా వేయగా రూ. 6 వేల కోట్ల వరకు తక్కువగా రూ. 31,547 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రాలకు పన్నుల్లో వాటా శాతం తగ్గడంతో రానున్న నాలుగేళ్లపాటు ఈ మేరకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు తగ్గనున్నాయి. -
ఈ కిరాణా ..ఆఫ్ లైన్!
♦ తీవ్ర ఒడిదుడుకుల్లో గ్రాసరీ స్టార్టప్‌లు ♦ డెలివరీ సమస్యలు, నిధుల కొరతతో వరుస మూసివేతలు ♦ జాబితాలో నియర్‌బై, ఓలా స్టోర్, గ్రోఫర్స్, లోకల్‌బనియా, పెప్పర్‌టాప్.. ♦ ఏడాదిలోపు ఫండింగ్ వస్తేనే నిలదొక్కుకోగలవంటున్న నిపుణులు ఈ-కామర్స్‌లో ఫ్లిప్‌కార్ట్ పెద్ద సక్సెస్. అదే అనుభవంతో ఈ ఏడాది మొదట్లో బెంగళూరు కేంద్రంగా గ్రాసరీ సంస్థ ‘నియర్‌బై’ను ఆరంభించింది. కానీ, మార్జిన్లు తక్కువగా ఉండటంతో మూడు నెలలు తిరక్కుండానే దుకాణాన్ని మూసేసింది! ట్యాక్సీ సేవల్లో సక్సెసైన ఓలా... బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో ‘ఓలా స్టోర్’ను ప్రారంభించింది. కానీ, డెలివరీ ఇబ్బందులతో తాళం వేసేసింది! గతేడాది అక్టోబర్‌లో తాత్కాలికంగా మాత్రమే సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటిచిన లోకల్‌బనియా... మళ్లీ ప్రారంభం కాలేదు. అసలు అవుతుందో లేదో చెప్పలేని స్థితి. లోకల్‌బనియా వెబ్‌సైట్‌ను తెరిచినా... ‘వి ఆర్ అండర్ రెనోవేషన్’ అని దర్శనమిస్తోంది. ఇక ఆశించిన మొత్తంలో ఆర్డర్లు రావట్లేదని గ్రోఫర్స్ సంస్థ తొమ్మిది నగరాల్లో సేవలని నిలిపివేస్తే.. నిధుల కొరత, డెలివరీ సమస్యల కారణంగా పెప్పర్‌టాప్ ఏకంగా దుకాణాన్నే మూసేసింది. ఇదీ దేశంలో ఈ-కిరాణా స్టార్టప్ సంస్థల పరిస్థితి. నిధుల కొరతతో కొన్ని.. నాణ్యమైన సేవలందించలేక ఇంకొన్ని... పోటీ తట్టుకోలేక మరికొన్ని... ఇలా కారణాలేమైనా దేశంలో ఆన్లైన్ గ్రాసరీ సంస్థలు వరుసగా మూతపడుతున్నాయి. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కిరాణా అంటే ఉప్పు, పప్పుల్లాంటి వంటింటి సామగ్రి మాత్రమే కాదు. ఫేస్ పౌడర్లు, కాస్మొటిక్స్, సబ్బులు, షాంపూలు, శీతల పానీయాలు, డ్రై ఫ్రూట్స్, పళ్లు, కూరగాయలు, కోడిగుడ్లు, మాంసం ఉత్పత్తులు... ఇవన్నీ నిత్యావసర కిరాణ జాబితాలోనివే. వీటన్నిటినీ ఒకే క్లిక్‌తో అందించే ఉద్దేశంతో ఈ-కిరాణా సంస్థలు ఆరంభమయ్యాయి. కొన్ని స్టార్టప్స్ నేరుగా స్టోర్లను ప్రారంభించి హోమ్ డెలివరీ చేస్తుంటే... మరికొన్ని తమ వద్ద నమోదైన దుకాణాల ద్వారా అగ్రిగేటర్ తరహాలో సేవలందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో బిగ్‌బాస్కెట్, జిప్.ఇన్, గ్రోఫర్స్, జాప్‌నౌ, కాల్‌గ్రాసరీస్, ఆస్క్‌మీ బజార్. ఆరాం షాప్, ఏక్స్టాప్, ఎట్మైడోర్స్టెప్, మైగ్రాహక్, జుగ్నో, ఓమార్ట్, రేషన్హంట్, సీటుహోమ్ వంటి 40 వరకు ఆన్లైన్ గ్రాసరీ స్టార్టప్స్ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. డెలివరీయే ప్రధాన సమస్య!! ఇతర ఈ-కామర్స్ సంస్థల్లా ఈ-కిరాణా స్టార్టప్స్ నిలదొక్కుకోలేకపోవడానికి ప్రధాన కారణం డెలివరీనే. నిధుల కొరత వీటికి తోడవుతోందన్నది నిపుణుల మాట. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ వంటి ఈ-కామర్స్ సంస్థల్లో డిస్కౌంట్లు సహజం. గ్రాసరీ కొనుగోళ్లలో డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్ల వంటివి కాస్త కష్టం. ఇక సెల్ఫోన్లు, దుస్తుల డెలివరీకి కొనుగోలుదారులు డబ్బులు చెల్లించి మరీ కొన్ని రోజులు వేచిచూస్తారు. గ్రాసరీ విషయంలో అలా కాదు. గంటలోనో.. 2 గంటలోనో లేకపోతే అదే రోజో డెలివరీ కావాలంటారు. అది కూడా ఉచితంగా. ఇవన్నీ చేయాలంటే భారీగా నిధులుండాలి. ఎక్కువ మొత్తంలో గ్రాసరీల్ని తక్కువ ధరకే కొని.. నిల్వచేసి డెలివరీ చేస్తే తప్ప సాధ్యం కాదు. లాభాలు తక్కువ.. లాజిస్టిక్స్ ఎక్కువ హైపర్ లోకల్, ఇన్వెంటరీ మోడల్ రెండింట్లోనూ లాభాలు తక్కువే. లాజిస్టిక్స్ ఖర్చు ఎక్కువ. రూ.1,000 ఆర్డర్‌కు గాను హైపర్ లోకల్లో 5% కమీషన్ ఉంటే.. ఇన్వెంటరీ మోడల్లో 20% వరకు కమిషన్ ఉంటుంది. ‘‘ఎంత మంది కస్టమర్లున్నారు? ఎన్ని నగరాల్లో సేవలందిస్తున్నామనేది ముఖ్యం కాదు.. వ్యాపారం ఎంత లాభసాటిగా ఉందనేదే ప్రధానం’’ అని జిప్.ఇన్ సీఈఓ కిశోర్ గంజి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. ‘‘హైపర్ లోకల్ సంస్థల ద్వారా కస్టమర్లు సంతృప్తికరమైన సేవలు పొందలేరు. ఎందుకంటే స్థానిక దుకాణాల్లో ఉత్పత్తుల జాబితా తక్కువగా ఉంటుంది. ఇంట్లోకి కావాల్సిన నెల వస్తువులన్నీ దొరకవు. పెపైచ్చు బ్రాండెడ్, నాణ్యత విషయంలో ఆలోచించాలి. దీంతో రోజువారీ అత్యవసర చిల్లర సామాన్లు తప్ప పెద్ద మొత్తంలో కొనటం లేదు. ఇక సంస్థలైతే ఆర్డర్ విలువతో సంబంధం లేకుండా వంద, రెండొదల ఆర్డర్లకూ సొంత ఖర్చుతో డెలివరీ చేయాలి. దీంతో చాలా సంస్థలు నెగెటివ్ మార్జిన్ రూపంలో నడుస్తున్నాయి’’ అని కిశోర్ వివరించారు. ఇన్వెంటరీలో లాభాలు ఎక్కువే కానీ.. ఇన్వెంటరీ మోడల్లో లాభాలెక్కువే. కానీ, ఆర్డర్లతో సంబంధం లేకుండా ముందుగానే భారీగా సరుకులు కొనాలి. వాటి నిల్వ కోసం గిడ్డంగులుండాలి. భూమి, అనుమతులు వంటి వాటికి భారీగా ఇన్వెస్ట్ చేయాలి. ‘‘ఇన్వెంటరీ విధానంలో గిడ్డంగులు, ఫ్రిజర్ల రక్షణ, నిర్వహణతో పాటు కొనుగోలు చేసిన సరుకుల్ని త్వరగా విక్రయించాలి. లేకపోతే కొన్ని పాడవుతాయి. గడువు తేదీ ముగిసిపోతుంది కూడా. దీంతో పెట్టిన పెట్టుబడంతా వృథా అవుతుంది’’ అని పెప్పర్ టాప్ మాజీ ఉద్యోగి చెప్పారు. కొన్ని సంస్థలు ఆర్డర్ విలువతో సంబంధం లేకుండా తమ సంస్థ ద్వారా తొలిసారి కొనుగోలు చేసినవారికి 20% వరకూ డిస్కౌంట్ ఇస్తున్నాయి. దీంతో కస్టమర్లు తెలివిగా నాలుగైదు వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి ఆర్డర్లు ఇచ్చి ప్రతి ఆర్డర్ మీదాడిస్కౌంట్ పొందుతున్నారు. ‘‘డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ల వల్ల నష్టమే. సంస్థ ప్రారంభించిన ఏడాదిలోపు ఫండింగ్ వస్తే సరి. లేకపోతే నిలదొక్కుకోవటం కష్టం’’ అని యాడ్రోబ్ వ్యవస్థాపకుడు రాజిరెడ్డి కేశిరెడ్డి చెప్పారు. ఇక సంస్థలు నిలదొక్కుకోవాలంటే బ్రాండింగ్, మార్కెటింగ్ కావాలి. బిగ్‌బాస్కెట్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను నియమించుకుంది. అన్ని సంస్థలూ అలా చేయలేకపోతున్నాయి. సరైన ప్రచారం లేక చివరకు సేవలు నిలిపేయాల్సి వస్తోంది. ♦ స్థానిక కిరాణ దుకాణాలతో ఒప్పందం చేసుకొని.. ఆర్డర్ వచ్చిన వెంటనే ఆయా స్టోర్ల నుంచి సరుకులను కొనుగోలు చేసి డెలివరీ చేసే హైపర్ లోకల్ విధానంలో... పెప్పర్‌టాప్, యాడ్రోబ్, ఆరాం షాప్ వంటివి సేవలందిస్తున్నాయి. ♦ హోల్‌సేలర్స్, రైతుల నుంచి ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకులను కొని... తమ గిడ్డంగుల నుంచే కొనుగోలుదారులకు, స్థానిక వర్తకులకూ సరఫరా చేసే ఇన్వెంటరీ విధానంలో... బిగ్‌బాస్కెట్, జిప్.ఇన్ వంటివి పనిచేస్తున్నాయి. -
జనపర్వానికి మరింత ధనమిస్తారా?
సాక్షి, రాజమండ్రి :రాబోయేదేమో.. 12 ఏళ్లకోసారి జరిగే మహా జలపర్వం! గోదావరి ఇరుతీరాల్నీ 12 రోజుల పాటు తిరణాలగా మార్చే జనపర్వం! రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న నిధులను చూడబోతే.. ఆ మహావేడుకకు ముఖ్యవేదికగా నిలిచే రాజమండ్రి నగరంలో చేయాల్సిన సన్నాహాలకే చాలనంత స్వల్పమొత్తం! ఈ నేపథ్యంలో గురువారం రాజమండ్రి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాలకు సంబంధించి ఔదార్యంతో కూడిన తీపి కబురు చెపుతారేమోనన్న ఆశ అటు ప్రజా ప్రతినిధుల్లో, ఇటు వివిధ శాఖల అధికారుల్లో వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు సంబంధించిన సన్నాహాలు నేటికీ సమావేశాలు, చర్చలు, ప్రతిపాదనల స్థాయిలోనే ఉన్నాయి. 2003లో కన్నా పుష్కరాలు ఘనంగా జరుగుతాయని భావించిన జిల్లా ప్రజలకు ప్రభుత్వం చెబుతున్న నిధుల కొరత సాకు నిరాశ మిగులుస్తోంది. పుష్కరాల నిర్వహణ కోసం మూడు నెలల ముందు నుంచీ ప్రజా ప్రతినిధులు తలో ప్రకటన చేస్తూ వచ్చారు. కొందరు కుంభమేళా స్థాయిలో నిర్వహిస్తామంటే, కొందరు కోట్ల సంఖ్యలోనే భక్తులు వస్తారని అంచనా వేశారు. అనంతరం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి అధ్యక్షతన ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ ఈ నెల ఎనిమిదిన రాజమండ్రిలో తొలి సమావేశం నిర్వహించి అందరి ఆశలపై నీళ్లు జల్లింది. ఈ పుష్కర వైభవం జిల్లాలో మరో పన్నెండేళ్లు కనిపిస్తుందని భావించిన అన్ని వర్గాలనూ కమిటీ నిర్ణయాలు నివ్వెరపరిచాయి. రాష్ట్రంలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పుష్కరాల నిర్వహణకు కేవలం రూ.వంద కోట్లు వెచ్చించడానికే ప్రభుత్వం సంసిద్ధతను చూపింది. అప్పటికే జిల్లాలోని వివిధ శాఖల అధికారులు రూ.750 కోట్ల మేర అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి అందచేశారు. కనీసం రూ.500 కోట్లయినా లేకుంటే పుష్కరాలు కష్టం అని చెబుతున్నారు. కానీ ఈ అంచనాలను భారీగా కుదించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వాటిని తిరగరాసి రూ.450 కోట్ల వరకూ తగ్గించగలిగారు. కనీసం ఈ మొత్తమైనా లేకుంటే పుష్కరాల నిర్వహణ దుస్సాధ్యమని ఆ శాఖల అధికారులు అంటున్నారు. ఈ తరుణంలో రాజమండ్రి వస్తున్న చంద్రబాబు పుష్కరాలకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారన్న ఆశలు వెల్లడవుతున్నాయి. రాజమండ్రిలో ఇవీ చేయాల్సినవి తరలి వచ్చే వీవీఐపీలకు ప్రత్యేకంగా కొత్త ఘాట్ నిర్మించాలి. ప్రధానిని పుష్కరాలకు ఆహ్వానిస్తామని నేతలు చెబుతున్న నేపథ్యంలో ఇది చాలా కీలకం. జిల్లాలో కొత్తగా మరో 11 ఘాట్ల నిర్మాణం జరగాలి. గత పుష్కరాల కన్నా ఈసారి భక్తులు నాలుగు రెట్లు ఎక్కువ వస్తారని అంచనా వేస్తున్నారు. రాజమండ్రితో పాటు నగర పరిసరాల్లో ఉన్న జాతీయ రహదారి లింకు రోడ్ల విస్తరణ జరగాలి. దీనివల్ల పుష్కరాలప్పుడు ట్రాఫిక్ సమస్య ఏర్పడదు. రాజమండ్రిలో కొత్త రోడ్లు నిర్మించాలి. వీధులను వెడల్పు చేయాలి. నగరంలో వీధులు, రోడ్లు ఆక్రమణలకు గురవడంతో ఘాట్లకు వెళ్లాలంటే భక్తులకు అవస్థలు తప్పవు. భక్తులకు వసతి సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో భక్తులు దగాకు గురి కాకుండా, మరిన్ని వసతి సదుపాయాలు కల్పించాలి. గోదావరి తీరంలో ఉన్న ఆలయాల్లో భక్తుల వసతి సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. లక్షల్లో భక్తులు వస్తే వారికి సకాలంలో దైవ దర్శనం కలిగేలా ఆలయ ప్రాంగణాలను విస్తరించాలి. ఇవీ చేయాలనుకుంటున్నవి.. ప్రస్తుతం ఉన్న ఘాట్లలోనే ఒకదాన్ని వీవీఐపీ ఘాట్‌గా అభివృద్ధి చేస్తే సరిపోతుందని భావిస్తున్నారు. నిధులు తక్కువగా ఉన్నాయన్న కారణంతో కొత్త ఘాట్ల నిర్మాణ ం లేకుండానే పుష్కరాలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రిలోని రోడ్లకు పాక్షికంగా మరమ్మతులు చేసి, తాత్కాలికంగా రోడ్లపై ఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. లింకు రోడ్లకు కూడా ఇదే తరహాలో మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. అదనంగా వసతి సదుపాయాలు కల్పించకుండా ఉన్న వాటికే మరమ్మతులు, చేపట్టి సరిపుచ్చాలని చూస్తున్నారు. ఆలయాల్లో ఏర్పాట్లను ఆలయాల ఆదాయంతోనే చేసుకోవాలని మంత్రుల కమిటీ సూచించింది. సమీపంలోని చిన్న ఆలయాల బాధ్యతను కూడా పెద్ద ఆలయాలు చూసుకోవాలంది. 3ముఖ్యమంత్రి పర్యటన ఇలా... ముఖ్యమంత్రి చంద్రబాబు జనధన యోజనను రాజమండ్రిలో సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభించనున్నారు. స్థానిక జవహర్లాల్ నెహ్రూ రోడ్‌లోని చెరుకూరి కన్వెన్షన్ హాలులో ఈ కార్యక్రమం జరుగుతుంది. చంద్రబాబు మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరతారు. 3.30 గంటలకు మధురపూడి విమానాశ్రయం చేరుకుంటారు 4.00 గంటలకు రాజమండ్రిలోని సభాస్థలికి చేరుకుంటారు. 5.30 వరకూ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. జనధన యోజన లోగోని ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ క్రమంలో అధికారులతో పుష్కరాలపై కొద్దిసేపు చర్చిస్తారు. అనంతరం మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని, ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళతారు.