జనపర్వానికి మరింత ధనమిస్తారా?
సాక్షి, రాజమండ్రి :రాబోయేదేమో.. 12 ఏళ్లకోసారి జరిగే మహా జలపర్వం! గోదావరి ఇరుతీరాల్నీ 12 రోజుల పాటు తిరణాలగా మార్చే జనపర్వం! రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న నిధులను చూడబోతే.. ఆ మహావేడుకకు ముఖ్యవేదికగా నిలిచే రాజమండ్రి నగరంలో చేయాల్సిన సన్నాహాలకే చాలనంత స్వల్పమొత్తం! ఈ నేపథ్యంలో గురువారం రాజమండ్రి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాలకు సంబంధించి ఔదార్యంతో కూడిన తీపి కబురు చెపుతారేమోనన్న ఆశ అటు ప్రజా ప్రతినిధుల్లో, ఇటు వివిధ శాఖల అధికారుల్లో వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు సంబంధించిన సన్నాహాలు నేటికీ సమావేశాలు, చర్చలు, ప్రతిపాదనల స్థాయిలోనే ఉన్నాయి.
2003లో కన్నా పుష్కరాలు ఘనంగా జరుగుతాయని భావించిన జిల్లా ప్రజలకు ప్రభుత్వం చెబుతున్న నిధుల కొరత సాకు నిరాశ మిగులుస్తోంది. పుష్కరాల నిర్వహణ కోసం మూడు నెలల ముందు నుంచీ ప్రజా ప్రతినిధులు తలో ప్రకటన చేస్తూ వచ్చారు. కొందరు కుంభమేళా స్థాయిలో నిర్వహిస్తామంటే, కొందరు కోట్ల సంఖ్యలోనే భక్తులు వస్తారని అంచనా వేశారు. అనంతరం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి అధ్యక్షతన ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ ఈ నెల ఎనిమిదిన రాజమండ్రిలో తొలి సమావేశం నిర్వహించి అందరి ఆశలపై నీళ్లు జల్లింది. ఈ పుష్కర వైభవం జిల్లాలో మరో పన్నెండేళ్లు కనిపిస్తుందని భావించిన అన్ని వర్గాలనూ కమిటీ నిర్ణయాలు నివ్వెరపరిచాయి.
రాష్ట్రంలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పుష్కరాల నిర్వహణకు కేవలం రూ.వంద కోట్లు వెచ్చించడానికే ప్రభుత్వం సంసిద్ధతను చూపింది. అప్పటికే జిల్లాలోని వివిధ శాఖల అధికారులు రూ.750 కోట్ల మేర అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి అందచేశారు. కనీసం రూ.500 కోట్లయినా లేకుంటే పుష్కరాలు కష్టం అని చెబుతున్నారు. కానీ ఈ అంచనాలను భారీగా కుదించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వాటిని తిరగరాసి రూ.450 కోట్ల వరకూ తగ్గించగలిగారు. కనీసం ఈ మొత్తమైనా లేకుంటే పుష్కరాల నిర్వహణ దుస్సాధ్యమని ఆ శాఖల అధికారులు అంటున్నారు. ఈ తరుణంలో రాజమండ్రి వస్తున్న చంద్రబాబు పుష్కరాలకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారన్న ఆశలు వెల్లడవుతున్నాయి.
రాజమండ్రిలో ఇవీ చేయాల్సినవి
తరలి వచ్చే వీవీఐపీలకు ప్రత్యేకంగా కొత్త ఘాట్ నిర్మించాలి. ప్రధానిని పుష్కరాలకు ఆహ్వానిస్తామని నేతలు చెబుతున్న నేపథ్యంలో ఇది చాలా కీలకం.
జిల్లాలో కొత్తగా మరో 11 ఘాట్‌ల నిర్మాణం జరగాలి. గత పుష్కరాల కన్నా ఈసారి భక్తులు నాలుగు రెట్లు ఎక్కువ వస్తారని అంచనా వేస్తున్నారు.
రాజమండ్రితో పాటు నగర పరిసరాల్లో ఉన్న జాతీయ రహదారి లింకు రోడ్ల విస్తరణ జరగాలి. దీనివల్ల పుష్కరాలప్పుడు ట్రాఫిక్ సమస్య ఏర్పడదు.
రాజమండ్రిలో కొత్త రోడ్లు నిర్మించాలి. వీధులను వెడల్పు చేయాలి. నగరంలో వీధులు, రోడ్లు ఆక్రమణలకు గురవడంతో ఘాట్‌లకు వెళ్లాలంటే భక్తులకు అవస్థలు తప్పవు.
భక్తులకు వసతి సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో భక్తులు దగాకు గురి కాకుండా, మరిన్ని వసతి సదుపాయాలు కల్పించాలి.
గోదావరి తీరంలో ఉన్న ఆలయాల్లో భక్తుల వసతి సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. లక్షల్లో భక్తులు వస్తే వారికి సకాలంలో దైవ దర్శనం కలిగేలా ఆలయ ప్రాంగణాలను విస్తరించాలి.
ఇవీ చేయాలనుకుంటున్నవి..
ప్రస్తుతం ఉన్న ఘాట్‌లలోనే ఒకదాన్ని వీవీఐపీ ఘాట్‌గా అభివృద్ధి చేస్తే సరిపోతుందని భావిస్తున్నారు.
నిధులు తక్కువగా ఉన్నాయన్న కారణంతో కొత్త ఘాట్‌ల నిర్మాణ ం లేకుండానే పుష్కరాలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాజమండ్రిలోని రోడ్లకు పాక్షికంగా మరమ్మతులు చేసి, తాత్కాలికంగా రోడ్లపై ఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. లింకు రోడ్లకు కూడా ఇదే తరహాలో మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది.
అదనంగా వసతి సదుపాయాలు కల్పించకుండా ఉన్న వాటికే మరమ్మతులు, చేపట్టి సరిపుచ్చాలని చూస్తున్నారు.
ఆలయాల్లో ఏర్పాట్లను ఆలయాల ఆదాయంతోనే చేసుకోవాలని మంత్రుల కమిటీ సూచించింది. సమీపంలోని చిన్న ఆలయాల బాధ్యతను కూడా పెద్ద ఆలయాలు చూసుకోవాలంది.
3ముఖ్యమంత్రి పర్యటన ఇలా...
ముఖ్యమంత్రి చంద్రబాబు జనధన యోజనను రాజమండ్రిలో సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభించనున్నారు. స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ రోడ్లోని చెరుకూరి కన్వెన్షన్ హాలులో ఈ కార్యక్రమం జరుగుతుంది.
చంద్రబాబు మధ్యాహ్నం 2.30 గంటలకు
హైదరాబాద్ నుంచి బయలుదేరతారు.
3.30 గంటలకు మధురపూడి విమానాశ్రయం చేరుకుంటారు
4.00 గంటలకు రాజమండ్రిలోని సభాస్థలికి
చేరుకుంటారు.
5.30 వరకూ జరిగే కార్యక్రమాల్లో
పాల్గొంటారు. జనధన యోజన లోగోని
ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ఈ క్రమంలో అధికారులతో పుష్కరాలపై
కొద్దిసేపు చర్చిస్తారు.
అనంతరం మధురపూడి విమానాశ్రయానికి
చేరుకుని, ప్రత్యేక విమానంలో హైదరాబాద్
వెళతారు.