కేంద్ర సాయం ‘లెక్కేంటి’? | Statistics show that there is a lack of funding Center to telangana | Sakshi
Sakshi News home page

కేంద్ర సాయం ‘లెక్కేంటి’?

Published Mon, Apr 19 2021 3:40 AM | Last Updated on Mon, Apr 19 2021 8:19 AM

Statistics show that there is a lack of funding Center to telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల విషయంలో సరైన సహకారం అందడం లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, జాతీయ ఆర్థిక ప్రగతిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలకు విరివిగా నిధులిచ్చి ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం... కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచే వివక్ష చూపుతోందని ‘కాగ్‌’గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో వివిధ పథకాల అమలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కేంద్రం నుంచి ఇప్పటివరకు రాష్ట్రం ఆశించిన దాంట్లో సగం మేరకు మాత్రమే నిధులు రావడం గమనార్హం.

గత ఏడేళ్లలో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ. 1.20 లక్షల కోట్లకుపైగా కేంద్రం ఇస్తుందని రాష్ట్రం అంచనా వేసి బడ్జెట్‌ ప్రతిపాదనల్లో పెడితే అందులో ఏటా కోతలు విధించి ఇప్పటివరకు సుమారు రూ. 60 వేల కోట్లు మాత్రమే ఇవ్వడం గమనార్హం. కేంద్ర పన్నుల్లో వాటాలోనూ ఇదే తరహా కోతలు కనిపిస్తుండగా అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ. 38 వేల కోట్లకుపైగా వస్తుందని బడ్జెట్‌ అంచనాల్లో పేర్కొనడం గమనార్హం.


(2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దు కింద రూ. 38,669.46 కోట్లు, పన్నుల్లో వాటా కింద రూ. 13,990.13 కోట్లు వస్తాయని రాష్ట్రం ఆశలు పెట్టుకొని బడ్జెట్‌ అంచనాల్లో పొందుపరచడం గమనార్హం)


ఏటేటా... అంతంతే
గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ విషయానికి వస్తే రాష్ట్రానికి ఏ యేడాదిలోనూ ఈ పద్దు కింద రూ. 15 వేల కోట్లు దాటలేదు. రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాదిలో ఈ పద్దు కింద రూ. 21 వేల కోట్లకుపైగా వస్తాయని రాష్ట్రం అంచనా వేస్తే అందులో నాలుగో వంతుకన్నా కొంచెం ఎక్కువగా అంటే... కేవలం రూ. 6 వేల కోట్లకుపైగా మాత్రమే ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుంది. ఆ తర్వాతి ఏడాది రూ. 7,500 కోట్లు, ఆ తర్వాత రూ. 9 వేల కోట్లు, అనంతరం వరుసగా రెండేళ్లు రూ. 8 వేల కోట్ల చొప్పున నామమాత్రపు సాయం చేసింది. అయితే ప్రతి ఏడాదిలోనూ కేంద్రం మీద రూ. 20 వేల కోట్లకుపైగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రానికి ఓ రకంగా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ విషయంలో మొండిచేయి ఎదురైందనే చెప్పాలి. ఇక గత రెండేళ్లుగా వైఖరి మార్చిన కేంద్రం... గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులను కొంత పెంచింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి (2019–20)లో రూ. 11 వేల కోట్లకుపైగా 2020–21లో రూ. 12 వేల కోట్లకుపైగా నిధులిచ్చింది. అయితే అంతా కలిపినా రాష్ట్రం ఆశించిన దాంట్లో కేవలం సగం మాత్రమే కావడం గమనార్హం.

వాటా నిధుల్లోనూ మార్పు లేదు...
పన్నుల్లో వాటాకు సంబంధించి 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 12,514 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా ఆ ఏడాది అంతకుమించి రూ. 13,613.09 కోట్లను కేంద్రం ఇచ్చింది. ఆ తర్వాతి ఏడాది రూ. 14,348.90 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావించగా అందులో కోత పెట్టి కేవలం రూ. 11,450.85 కోట్లనే కేంద్రం ఇచ్చింది. గతేడాది (2020–21) కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ. 10,906.51 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో ప్రతిపాదించగా ఫిబ్రవరి నాటికి కేంద్రం నుంచి వచ్చింది రూ. 6,483.08 కోట్లేనని ‘కాగ్‌’లెక్కలు చెబుతున్నాయి. అంటే గత మూడేళ్లలో రూ. 37,729 కోట్లకుపైగా నిధులను పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి కేంద్రం ఇస్తుందని అంచనా వేయగా రూ. 6 వేల కోట్ల వరకు తక్కువగా రూ. 31,547 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రాలకు పన్నుల్లో వాటా శాతం తగ్గడంతో రానున్న నాలుగేళ్లపాటు ఈ మేరకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు తగ్గనున్నాయి.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement