Statistical Comparison
-
తెలంగాణ: రానున్న 15 ఏళ్లలో భారీగా తగ్గనున్న యువత..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న 15 ఏళ్లలో యువశక్తి తగ్గిపోనుంది. రాష్ట్ర జనాభాలో ప్రస్తుతం 15–40 ఏళ్లలోపు యువత 43.6% ఉండగా 2036 నాటికి ఇందులో 15.9% తగ్గి.. 27.7% కానున్నట్లు అంచనా. బుధవారం విడుదల చేసిన ‘తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్–2021’లో ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. ప్రణాళిక, ఆర్థిక శాఖలు సంయుక్తంగా తయారు చేసిన ఈ నివేదిక ప్రకారం రానున్న 15 ఏళ్లలో 40 ఏళ్ల పైబడిన వారి జనాభా 42.5 శాతానికి పెరగనుంది. 15–40 ఏళ్లలోపు గణాం కాలను పరిగణనలోకి తీసుకునే 6 శ్లాబుల్లో 35–39 ఏళ్ల శ్లాబు మినహా అన్ని శ్లాబుల్లోనూ తగ్గుదల నమోదు కానుండటం గమనార్హం. 80ఏళ్ల పైబడిన వారి సంఖ్య 82% పెరగనుంది. ఈ గణాంకాల ప్రకారం 2021 నాటికి రాష్ట్ర జనాభా 3,77,25,000 కాగా దేశ జనాభాలో ఇది 2.8 శాతమని అంచనా. రాష్ట్రంలో 50.3 శాతం మంది పురుషులు కాగా, 49.7 శాతం మంది మహిళలున్నారు. జోనల్ విధానం ఇలా.. 2021లో ఏర్పాటైన జోనల్ విధానం ప్రకారం రాష్ట్రా న్ని 7 జోన్లుగా విభజించారు. ఇందులో బాసర, భద్రా ద్రి, కాళేశ్వరం, రాజన్న, చార్మినార్, జోగు లాంబ, యాదాద్రి జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్లో 4,5 జిల్లాలున్నాయి. బాసర, భద్రాద్రి, కాళేశ్వరం, రాజన్న జోన్లు మల్టీజోన్–1గా, చార్మినార్, జోగు లాంబ, యాదాద్రి జోన్లు మల్టీజోన్–2 పరిధిలోకి వస్తాయి. కోటి దాటిన టూవీలర్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ద్విచక్ర వాహనాల సంఖ్య కోటి దాటింది. మొత్తం వాహనాలు కోటిన్నరకు చేరువలో ఉన్నాయి. గత మూడేళ్లలోనే కొత్తగా 26 లక్షల వాహనాలు రోడ్డెక్కాయి. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 2020–21 ఆర్థిక సంవత్సరం గణాంకాల్లో స్కూటర్లు, మోటారు సైకిళ్లు, మోపెడ్లు కలిపి 1.02 కోట్లు, అన్ని రకాల వాహనాలు 1,38,11,466 ఉన్నాయి. ఇవి గత ఆర్థిక సంవత్సరం లెక్కలు. ప్రస్తుతం ఫిబ్రవరి మూడో వారం వరకు నమోదైన ద్విచక్ర వాహనాలు 5 లక్షలు, మిగతా అన్ని వాహనాల సంఖ్యను కలిపి లెక్కిస్తే ఈ సంఖ్య కోటిన్నరకు చేరువైంది. 1,45,00,000గా నమోదైంది. మరో రెండు మూడు నెలల్లో ఈ సంఖ్య కోటిన్నర దాటనుంది. ప్రస్తుతం సంవత్సరానికి 8 లక్షల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. 2020–21లో కొత్తగా 8,22,416 వాహనాలు నమోదయ్యాయి. 2019– 20 సంవత్సరంలో ఈ సంఖ్య అత్యధికంగా నమోదైంది. కరోనా వల్ల వ్యక్తిగత వాహనాల కోసం జనం పోటెత్తటంతో కొత్త వాహనాలు భారీగా రోడ్డెక్కాయి. 12,38,778 వాహనాలు అమ్ముడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9 లక్షల వాహనాలు అమ్ముడవుతాయని అంచనా. -
కేంద్ర సాయం ‘లెక్కేంటి’?
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల విషయంలో సరైన సహకారం అందడం లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, జాతీయ ఆర్థిక ప్రగతిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలకు విరివిగా నిధులిచ్చి ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం... కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచే వివక్ష చూపుతోందని ‘కాగ్’గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో వివిధ పథకాల అమలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కేంద్రం నుంచి ఇప్పటివరకు రాష్ట్రం ఆశించిన దాంట్లో సగం మేరకు మాత్రమే నిధులు రావడం గమనార్హం. గత ఏడేళ్లలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 1.20 లక్షల కోట్లకుపైగా కేంద్రం ఇస్తుందని రాష్ట్రం అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనల్లో పెడితే అందులో ఏటా కోతలు విధించి ఇప్పటివరకు సుమారు రూ. 60 వేల కోట్లు మాత్రమే ఇవ్వడం గమనార్హం. కేంద్ర పన్నుల్లో వాటాలోనూ ఇదే తరహా కోతలు కనిపిస్తుండగా అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 38 వేల కోట్లకుపైగా వస్తుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొనడం గమనార్హం. (2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు కింద రూ. 38,669.46 కోట్లు, పన్నుల్లో వాటా కింద రూ. 13,990.13 కోట్లు వస్తాయని రాష్ట్రం ఆశలు పెట్టుకొని బడ్జెట్ అంచనాల్లో పొందుపరచడం గమనార్హం) ఏటేటా... అంతంతే గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయానికి వస్తే రాష్ట్రానికి ఏ యేడాదిలోనూ ఈ పద్దు కింద రూ. 15 వేల కోట్లు దాటలేదు. రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాదిలో ఈ పద్దు కింద రూ. 21 వేల కోట్లకుపైగా వస్తాయని రాష్ట్రం అంచనా వేస్తే అందులో నాలుగో వంతుకన్నా కొంచెం ఎక్కువగా అంటే... కేవలం రూ. 6 వేల కోట్లకుపైగా మాత్రమే ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుంది. ఆ తర్వాతి ఏడాది రూ. 7,500 కోట్లు, ఆ తర్వాత రూ. 9 వేల కోట్లు, అనంతరం వరుసగా రెండేళ్లు రూ. 8 వేల కోట్ల చొప్పున నామమాత్రపు సాయం చేసింది. అయితే ప్రతి ఏడాదిలోనూ కేంద్రం మీద రూ. 20 వేల కోట్లకుపైగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రానికి ఓ రకంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయంలో మొండిచేయి ఎదురైందనే చెప్పాలి. ఇక గత రెండేళ్లుగా వైఖరి మార్చిన కేంద్రం... గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులను కొంత పెంచింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి (2019–20)లో రూ. 11 వేల కోట్లకుపైగా 2020–21లో రూ. 12 వేల కోట్లకుపైగా నిధులిచ్చింది. అయితే అంతా కలిపినా రాష్ట్రం ఆశించిన దాంట్లో కేవలం సగం మాత్రమే కావడం గమనార్హం. వాటా నిధుల్లోనూ మార్పు లేదు... పన్నుల్లో వాటాకు సంబంధించి 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 12,514 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా ఆ ఏడాది అంతకుమించి రూ. 13,613.09 కోట్లను కేంద్రం ఇచ్చింది. ఆ తర్వాతి ఏడాది రూ. 14,348.90 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావించగా అందులో కోత పెట్టి కేవలం రూ. 11,450.85 కోట్లనే కేంద్రం ఇచ్చింది. గతేడాది (2020–21) కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ. 10,906.51 కోట్లు వస్తాయని బడ్జెట్లో ప్రతిపాదించగా ఫిబ్రవరి నాటికి కేంద్రం నుంచి వచ్చింది రూ. 6,483.08 కోట్లేనని ‘కాగ్’లెక్కలు చెబుతున్నాయి. అంటే గత మూడేళ్లలో రూ. 37,729 కోట్లకుపైగా నిధులను పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి కేంద్రం ఇస్తుందని అంచనా వేయగా రూ. 6 వేల కోట్ల వరకు తక్కువగా రూ. 31,547 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రాలకు పన్నుల్లో వాటా శాతం తగ్గడంతో రానున్న నాలుగేళ్లపాటు ఈ మేరకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు తగ్గనున్నాయి. -
మాస్టర్ వర్సెస్ బ్లాస్టర్
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ లో సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. ఎన్నో రికార్డులను తన పేరిటి లిఖించుకుని 'మాస్టర్' ఆటకు వీడ్కోలు పలికాడు. సచిన్ రికార్డులను అధిగమించే సత్తా ఉన్న ఆటగాడు ఎవరనే ప్రశ్నకు సమాధానంగా మొట్టమొదట వినిపించే పేరు విరాట్ కోహ్లి. అంచనాలకు తగ్గట్టే వేగంగా పరుగులు సాధిస్తూ కోహ్లి దూసుకుపోతున్నాడు. స్వభావరీత్యా సచిన్ తో ఏమాత్రం పోలిక లేకపోయినా ఆటతీరులో మాత్రం 'మాస్టర్'ను గుర్తు చేస్తున్నాడీ యువ బ్యాట్స్ మన్. నిలకడైన ఆటతీరుతో పరుగుల వరద పారిస్తూ శిఖరస్థాయిని అందుకునేందుకు ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. సచిన్ రికార్డులను అధిగమించగల సత్తా తనకే ఉందని తన ఆటతో క్రీడా ప్రపంచానికి చాటాడు. దీంతో బ్యాటింగ్ గణంకాల పరంగా వీరిద్దరినీ పోల్చిచూస్తున్నారు. సమాన సంఖ్యలో మ్యాచ్ లు ఆడినప్పుడు వీరిద్దరూ ఎన్ని పరుగులు చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు 171 వన్డేలు, 41 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లి ఆడిన పరుగుల పరంగా సచిన్ కంటే ముందున్నాడు. ఎవరెలా ఆడారంటే... * 171 వన్డేల్లో కోహ్లి 163 ఇన్నింగ్స్ ఆడి 51.51 సగటుతో 7212 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 183. నాటౌట్ గా 23సార్లు నిలిచాడు. * సచిన్ తన మొదటి 171 వన్డేల్లో 166 ఇన్నింగ్స్ ఆడి 38.85 సగటుతో 5828 పరుగులు సాధించాడు. ఇందులో 12 శతకాలు, 36 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 137. నాటౌట్ గా 16సార్లు నిలిచాడు. (సచిన్ మొదటి 70 వన్డేల్లో 5 లేదా 6 స్థానాల్లో ఎక్కువగా బ్యాటింగ్ కు దిగాడు) * 41 టెస్టుల్లో 72 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ 44.02 సగటుతో 2994 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 12 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 169. నాలుగు సార్లు నాటౌట్ గా నిలిచాడు. * సచిన్ తన తొలి 41 టెస్టుల్లో 60 ఇన్నింగ్స్ ఆడి 54.92 సగటుతో 2911 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 14 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 179. ఏడు సార్లు నాటౌట్ గా ఉన్నాడు.