ఈ కిరాణా ..ఆఫ్ లైన్! | Startup Grossery's closed slowly lack of funding | Sakshi
Sakshi News home page

ఈ కిరాణా ..ఆఫ్ లైన్!

Published Tue, May 24 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

ఈ కిరాణా ..ఆఫ్ లైన్!

ఈ కిరాణా ..ఆఫ్ లైన్!

తీవ్ర ఒడిదుడుకుల్లో గ్రాసరీ స్టార్టప్‌లు
డెలివరీ సమస్యలు, నిధుల కొరతతో వరుస మూసివేతలు
జాబితాలో నియర్‌బై, ఓలా స్టోర్, గ్రోఫర్స్, లోకల్‌బనియా, పెప్పర్‌టాప్..
ఏడాదిలోపు ఫండింగ్ వస్తేనే నిలదొక్కుకోగలవంటున్న నిపుణులు

 ఈ-కామర్స్‌లో ఫ్లిప్‌కార్ట్ పెద్ద సక్సెస్. అదే అనుభవంతో ఈ ఏడాది మొదట్లో బెంగళూరు కేంద్రంగా గ్రాసరీ సంస్థ ‘నియర్‌బై’ను ఆరంభించింది. కానీ, మార్జిన్లు తక్కువగా ఉండటంతో మూడు నెలలు తిరక్కుండానే దుకాణాన్ని మూసేసింది!

ట్యాక్సీ సేవల్లో సక్సెసైన ఓలా... బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో ‘ఓలా స్టోర్’ను ప్రారంభించింది. కానీ, డెలివరీ ఇబ్బందులతో తాళం వేసేసింది!

 గతేడాది అక్టోబర్‌లో తాత్కాలికంగా మాత్రమే సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటిచిన లోకల్‌బనియా... మళ్లీ ప్రారంభం కాలేదు. అసలు అవుతుందో లేదో చెప్పలేని స్థితి. లోకల్‌బనియా వెబ్‌సైట్‌ను తెరిచినా... ‘వి ఆర్ అండర్ రెనోవేషన్’ అని దర్శనమిస్తోంది.

 ఇక ఆశించిన మొత్తంలో ఆర్డర్లు రావట్లేదని గ్రోఫర్స్ సంస్థ తొమ్మిది నగరాల్లో సేవలని నిలిపివేస్తే.. నిధుల కొరత, డెలివరీ సమస్యల కారణంగా పెప్పర్‌టాప్ ఏకంగా దుకాణాన్నే మూసేసింది.

 ఇదీ దేశంలో ఈ-కిరాణా స్టార్టప్ సంస్థల పరిస్థితి. నిధుల కొరతతో కొన్ని.. నాణ్యమైన సేవలందించలేక ఇంకొన్ని... పోటీ తట్టుకోలేక మరికొన్ని... ఇలా కారణాలేమైనా దేశంలో ఆన్‌లైన్ గ్రాసరీ సంస్థలు వరుసగా మూతపడుతున్నాయి.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కిరాణా అంటే ఉప్పు, పప్పుల్లాంటి వంటింటి సామగ్రి మాత్రమే కాదు. ఫేస్ పౌడర్లు, కాస్మొటిక్స్, సబ్బులు, షాంపూలు, శీతల పానీయాలు, డ్రై ఫ్రూట్స్, పళ్లు, కూరగాయలు, కోడిగుడ్లు, మాంసం ఉత్పత్తులు... ఇవన్నీ నిత్యావసర కిరాణ జాబితాలోనివే. వీటన్నిటినీ ఒకే క్లిక్‌తో అందించే ఉద్దేశంతో ఈ-కిరాణా సంస్థలు ఆరంభమయ్యాయి. కొన్ని స్టార్టప్స్ నేరుగా స్టోర్లను ప్రారంభించి హోమ్ డెలివరీ చేస్తుంటే... మరికొన్ని తమ వద్ద నమోదైన దుకాణాల ద్వారా అగ్రిగేటర్ తరహాలో సేవలందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో బిగ్‌బాస్కెట్, జిప్.ఇన్, గ్రోఫర్స్, జాప్‌నౌ, కాల్‌గ్రాసరీస్, ఆస్క్‌మీ బజార్. ఆరాం షాప్, ఏక్‌స్టాప్, ఎట్‌మైడోర్‌స్టెప్, మైగ్రాహక్, జుగ్నో, ఓమార్ట్, రేషన్‌హంట్, సీటుహోమ్ వంటి 40 వరకు ఆన్‌లైన్ గ్రాసరీ స్టార్టప్స్ కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

 డెలివరీయే ప్రధాన సమస్య!!
ఇతర ఈ-కామర్స్ సంస్థల్లా ఈ-కిరాణా స్టార్టప్స్ నిలదొక్కుకోలేకపోవడానికి ప్రధాన కారణం డెలివరీనే. నిధుల కొరత వీటికి తోడవుతోందన్నది నిపుణుల మాట. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ వంటి ఈ-కామర్స్ సంస్థల్లో డిస్కౌంట్లు సహజం. గ్రాసరీ కొనుగోళ్లలో డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్ల వంటివి కాస్త కష్టం. ఇక సెల్‌ఫోన్లు, దుస్తుల డెలివరీకి కొనుగోలుదారులు డబ్బులు చెల్లించి మరీ కొన్ని రోజులు వేచిచూస్తారు. గ్రాసరీ విషయంలో అలా కాదు. గంటలోనో.. 2 గంటలోనో లేకపోతే అదే రోజో డెలివరీ కావాలంటారు. అది కూడా ఉచితంగా. ఇవన్నీ చేయాలంటే భారీగా నిధులుండాలి. ఎక్కువ మొత్తంలో గ్రాసరీల్ని తక్కువ ధరకే కొని.. నిల్వచేసి డెలివరీ చేస్తే తప్ప సాధ్యం కాదు.

 లాభాలు తక్కువ.. లాజిస్టిక్స్ ఎక్కువ
హైపర్ లోకల్, ఇన్వెంటరీ మోడల్ రెండింట్లోనూ లాభాలు తక్కువే. లాజిస్టిక్స్ ఖర్చు ఎక్కువ. రూ.1,000 ఆర్డర్‌కు గాను హైపర్ లోకల్‌లో 5% కమీషన్ ఉంటే.. ఇన్వెంటరీ మోడల్‌లో 20% వరకు కమిషన్ ఉంటుంది. ‘‘ఎంత మంది కస్టమర్లున్నారు? ఎన్ని నగరాల్లో సేవలందిస్తున్నామనేది ముఖ్యం కాదు.. వ్యాపారం ఎంత లాభసాటిగా ఉందనేదే ప్రధానం’’ అని జిప్.ఇన్ సీఈఓ కిశోర్ గంజి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. ‘‘హైపర్ లోకల్ సంస్థల ద్వారా కస్టమర్లు సంతృప్తికరమైన సేవలు పొందలేరు.

ఎందుకంటే స్థానిక దుకాణాల్లో ఉత్పత్తుల జాబితా తక్కువగా ఉంటుంది. ఇంట్లోకి కావాల్సిన నెల వస్తువులన్నీ దొరకవు. పెపైచ్చు బ్రాండెడ్, నాణ్యత విషయంలో ఆలోచించాలి. దీంతో రోజువారీ అత్యవసర చిల్లర సామాన్లు తప్ప పెద్ద మొత్తంలో కొనటం లేదు. ఇక సంస్థలైతే ఆర్డర్ విలువతో సంబంధం లేకుండా వంద, రెండొదల ఆర్డర్లకూ సొంత ఖర్చుతో డెలివరీ చేయాలి. దీంతో చాలా సంస్థలు నెగెటివ్ మార్జిన్ రూపంలో నడుస్తున్నాయి’’ అని కిశోర్ వివరించారు. 

 ఇన్వెంటరీలో లాభాలు ఎక్కువే కానీ..
ఇన్వెంటరీ మోడల్‌లో లాభాలెక్కువే. కానీ, ఆర్డర్లతో సంబంధం లేకుండా ముందుగానే భారీగా సరుకులు కొనాలి. వాటి నిల్వ కోసం గిడ్డంగులుండాలి. భూమి, అనుమతులు వంటి వాటికి భారీగా ఇన్వెస్ట్ చేయాలి. ‘‘ఇన్వెంటరీ విధానంలో గిడ్డంగులు, ఫ్రిజర్ల రక్షణ, నిర్వహణతో పాటు కొనుగోలు చేసిన సరుకుల్ని త్వరగా విక్రయించాలి. లేకపోతే కొన్ని పాడవుతాయి. గడువు తేదీ ముగిసిపోతుంది కూడా. దీంతో పెట్టిన పెట్టుబడంతా వృథా అవుతుంది’’ అని పెప్పర్ టాప్ మాజీ ఉద్యోగి చెప్పారు.  కొన్ని సంస్థలు ఆర్డర్ విలువతో సంబంధం లేకుండా తమ సంస్థ ద్వారా తొలిసారి కొనుగోలు చేసినవారికి 20% వరకూ డిస్కౌంట్ ఇస్తున్నాయి.

దీంతో కస్టమర్లు తెలివిగా నాలుగైదు వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి ఆర్డర్లు ఇచ్చి ప్రతి ఆర్డర్ మీదాడిస్కౌంట్ పొందుతున్నారు. ‘‘డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ల వల్ల నష్టమే. సంస్థ ప్రారంభించిన ఏడాదిలోపు ఫండింగ్ వస్తే సరి. లేకపోతే  నిలదొక్కుకోవటం కష్టం’’ అని యాడ్‌రోబ్ వ్యవస్థాపకుడు రాజిరెడ్డి కేశిరెడ్డి చెప్పారు. ఇక సంస్థలు నిలదొక్కుకోవాలంటే బ్రాండింగ్, మార్కెటింగ్ కావాలి. బిగ్‌బాస్కెట్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను నియమించుకుంది. అన్ని సంస్థలూ అలా చేయలేకపోతున్నాయి. సరైన ప్రచారం లేక చివరకు సేవలు నిలిపేయాల్సి వస్తోంది.

స్థానిక కిరాణ దుకాణాలతో ఒప్పందం చేసుకొని.. ఆర్డర్ వచ్చిన వెంటనే ఆయా స్టోర్ల నుంచి సరుకులను కొనుగోలు చేసి డెలివరీ చేసే హైపర్ లోకల్ విధానంలో... పెప్పర్‌టాప్, యాడ్రోబ్, ఆరాం షాప్ వంటివి సేవలందిస్తున్నాయి.

హోల్‌సేలర్స్, రైతుల నుంచి ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకులను కొని... తమ గిడ్డంగుల నుంచే కొనుగోలుదారులకు, స్థానిక వర్తకులకూ సరఫరా చేసే ఇన్వెంటరీ విధానంలో... బిగ్‌బాస్కెట్, జిప్.ఇన్ వంటివి పనిచేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement