విత్‌డ్రాయల్స్‌ ఆంక్షలు, ఆర్‌బీఐ గుప్పిట్లో ‘యస్‌’! | RBI takes charge of YES Bank | Sakshi
Sakshi News home page

విత్‌డ్రాయల్స్‌ ఆంక్షలు, ఆర్‌బీఐ గుప్పిట్లో ‘యస్‌’!

Published Fri, Mar 6 2020 5:43 AM | Last Updated on Fri, Mar 6 2020 9:00 AM

RBI takes charge of YES Bank - Sakshi

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాలు, మొండిబాకీల భారం, నిధుల కొరత కష్టాలతో సతమతమవుతున్న ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంకుపై రిజర్వ్‌ బ్యాంక్‌ కొరడా ఝుళిపించింది. బ్యాంక్‌ బోర్డును రద్దు చేయడంతో పాటు ఖాతాదారులకు షాక్‌నిచ్చేలా విత్‌డ్రాయల్స్‌పై పరిమితులు విధించింది. ఖాతాదారులకు రూ. 50,000కు మించి చెల్లింపులు జరపకుండా 30 రోజుల మారటోరియం విధిస్తూ ఆర్‌బీఐ గురువారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 5 నుంచి అమల్లోకి వచ్చిన మారటోరియం ఏప్రిల్‌ 3 దాకా కొనసాగుతుంది.

వైద్యం, ఉన్నత విద్య, వివాహం వంటి అత్యవసర సందర్భాల్లో మాత్రమే రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. అటు యస్‌ బ్యాంకు ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిన నేపథ్యంలో బోర్డును కూడా రద్దు చేసిన ఆర్‌బీఐ.. ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్‌ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. భారీ స్కామ్‌తో కుదేలైన పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంకుపైనా ఆర్‌బీఐ కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఆంక్షలే విధించింది. అది జరిగిన 6 నెలల వ్యవధిలోనే యస్‌ బ్యాంక్‌పైనా రిజర్వ్‌ బ్యాంక్‌ అటువంటి చర్యలే తీసుకోవడం గమనార్హం.  

ఆందోళన వద్దు .. డిపాజిట్లు భద్రమే..
మొండిబాకీల భారం, డిపాజిట్ల విత్‌డ్రాయల్స్, రేటింగ్‌ డౌన్‌గ్రేడ్స్‌ వంటి పలు ప్రతికూల అంశాలతో బ్యాంకు పరిస్థితి నానాటికి దిగజారిందని ఆర్‌బీఐ పేర్కొంది. ‘పరిస్థితి చక్కదిద్దుకోవడానికి, విశ్వసనీయమైన పునరుద్ధరణ ప్రణాళికతో నిధులు సమీకరించుకోవడానికి యస్‌ బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌కు తగినన్ని అవకాశాలు ఇచ్చాం. కానీ ప్రణాళికలు అమలు చేయడంలో అది విఫలమైంది. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత.. ఖాతాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం యస్‌ బ్యాంకుపై మారటోరియం విధించాలంటూ ప్రభుత్వానికి సూచించడం మినహా మరో మార్గాంతరం లేదని భావించాం.

తదనుగుణంగానే కేంద్రం నిర్ణయం తీసుకుంది‘ అని ఆర్‌బీఐ పేర్కొంది. ఖాతాదారులు ఆందోళన చెందనక్కర్లేదన్న ఆర్‌బీఐ.. డిపాజిట్లు భద్రంగానే ఉంటాయని, డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడతామని భరోసానిచ్చింది. బ్యాంకింగ్‌ రంగ నియంత్రణ చట్ట నిబంధనల ప్రకారం యస్‌ బ్యాంక్‌ పునరుద్ధరణ లేదా మరో బ్యాంకులో విలీనం చేయడానికి సంబంధించి త్వరలోనే తగు ప్రణాళికను రూపొందిస్తామని ఆర్‌బీఐ పేర్కొంది. డిపాజిటర్లు సుదీర్ఘకాలం ఇబ్బందులు పడకుండా మారటోరియం ముగిసేలోగానే దీన్ని అమలు చేస్తామని తెలిపింది.

ఎస్‌బీఐ చేతికి..?
ఎల్‌ఐసీతో కలిసి టేకోవర్‌ వార్తలు
రిజర్వ్‌ బ్యాంక్‌ మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు.. యస్‌ బ్యాంక్‌ను ఎల్‌ఐసీతో కలిసి ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సారథ్యంలోని కన్సార్షియం టేకోవర్‌ చేయనుందంటూ వార్తలు వచ్చాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కన్సార్షియం మొత్తం 49 శాతం వాటాలు కొనేలా ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. నియంత్రణాధికారాలు దక్కే స్థాయిలో వాటాలు కొనుగోలు చేసేందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా రావొచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గురువారం ముంబైలో ఎస్‌బీఐ బోర్డు సమావేశం కావడం ఈ వార్తలకు ఊతమిచ్చింది. యస్‌ బ్యాంక్‌ మూతబడే పరిస్థితి ఉండబోదంటూ ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వ్యాఖ్యలు చేసిన కొన్నాళ్లకే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కొటక్‌ మహీంద్రా వంటి ప్రైవేట్‌ దిగ్గజ బ్యాంకులు.. యస్‌ బ్యాంక్‌ను టేకోవర్‌ చేసేందుకు అనువైనవంటూ గతంలో ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ వార్తలపై వివరణనివ్వాలంటూ ఎస్‌బీఐ, యస్‌ బ్యాంకులకు స్టాక్‌ ఎక్సే్చంజీలు సూచించాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం అలాంటి పరిణామాలేమైనా ఉన్న పక్షంలో వెల్లడిస్తామంటూ ఎస్‌బీఐ తెలియజేసింది. అటు యస్‌ బ్యాంక్‌ కూడా .. ఇప్పటిదాకా తమకు దీనిపై ఆర్‌బీఐ లేదా ప్రభుత్వం లేదా ఇతరత్రా నియంత్రణ సంస్థలు, ఎస్‌బీఐ నుంచి ఏ విధమైన సమాచారమూ రాలేదని తెలిపింది. అటు, బ్రోకరేజీ సంస్థలు మాత్రం యస్‌ బ్యాంక్‌ పరిస్థితి ఆశావహంగా లేదంటూ వ్యాఖ్యానించాయి. ఒకవేళ ఇన్వెస్టర్లకు బలవంతంగా అంటగట్టినా.. మొండిబాకీల రిస్కులు భారీగా ఉన్నందున బ్యాంకు విలువను సున్నా కింద లెక్కగట్టి తీసుకోవడమే జరగవచ్చని జేపీ మోర్గాన్‌ వర్గాలు వ్యాఖ్యానించాయి.

‘యస్‌’ నుంచి ‘నో’ వరకూ...!
►  జూన్‌ 12, 2018: యస్‌ బ్యాంక్‌  ఎమ్‌డీ, సీఈఓగా మూడేళ్లపాటు రాణా కపూర్‌ పునర్నియామకానికి వాటాదారుల ఆమోదం  
►  సెప్టెంబర్‌ 19, 2018: రాణా కపూర్‌ పదవీ కాలాన్ని జనవరి 31,2019 వరకే తగ్గించిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
►  సెప్టెంబర్‌ 21, 2018: యస్‌ బ్యాంక్‌ షేర్‌ ఒకే రోజు 30 శాతం పతనం, రూ.21,951 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ ఆవిరి  
►  సెప్టెంబర్‌ 28, 2018: ప్రమోటర్‌ షేర్లను విక్రయించబోనని, కూతుళ్లకు ఇచ్చేస్తానని రాణా కపూర్‌ ప్రకటన. యస్‌ బ్యాంక్‌ డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌కు క్రెడిట్‌ వాచ్‌ రేటింగ్‌ను ఇస్తున్నామని కేర్‌ రేటింగ్స్‌ వెల్లడి  
►  అక్టోబర్‌ 17, 2018: రాణా కపూర్‌కు మరింత గడువును ఇవ్వడానికి నిరాకరించిన ఆర్‌బీఐ. 2019, ఫిబ్రవరి 1 కల్లా కొత్త సీఈఓను నియమించుకోవాలని ఆదేశం  
►  అక్టోబర్‌ 25, 2018: గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి. మార్క్‌టు మార్కెట్‌ నష్టాలు రెట్టింపు కావడం, మొండి బకాయిలకు కేటాయింపులు అధికంగా ఉండటంతో ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. రుణ నాణ్యత భారీగా క్షీణించింది.  
►  నవంబర్‌ 14, 2018: చైర్మన్‌ పదవికి అశోక్‌ చావ్లా రాజీనామా. ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ పదవి నుంచి వైదొలగిన వసంత్‌ గుజరాతీ  
►  నవంబర్‌ 19, 2018: మరో ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ రెంటాల చంద్రశేఖర్‌ రాజీనామా  
►  నవంబర్‌ 27, 2018: యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను డౌన్‌ గ్రేడ్‌చేసిన మూడీస్‌ సంస్థ.  
►  మార్చి 1, 2019: యస్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన రవ్‌నీత్‌ గిల్‌.  3 శాతం ఎగసిన షేర్‌ ధర  
►  మార్చి 5, 2019: స్విఫ్ట్‌ కార్యకలాపాల విషయంలో నిబంధనలు పాటించనందుకు రూ. 1 కోటి జరిమానా విధించిన ఆర్‌బీఐ  
►  ఏప్రిల్‌ 26, 2019: గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఆర్థిక ఫలితాలు వెల్లడి. రూ.1,507 కోట్ల నికర నష్టాలు  
►  ఏప్రిల్‌ 29, 2019: యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసిన మాక్వైరీ బ్రోకరేజ్‌ సంస్థ.  
►  ఏప్రిల్‌ 30, 2019: క్యూ4 ఫలితాల ప్రభావంతో 30% పతనమైన షేర్‌  
►  మే 9, 2019: యస్‌ బ్యాంక్‌ లాంగ్‌ టర్మ్‌ రేటింగ్‌ను ప్రధాన రేటింగ్‌ ఏజెన్సీలైన ఇండియా రేటింగ్స్, ఇక్రాలు డౌన్‌ గ్రేడ్‌ చేశాయి.  
►  మే 15, 2019: యస్‌ బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డ్‌లో అదనపు డైరెక్టర్‌గా ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌. గాంధీ నియామకం  
►  జూలై 18, 2019: రాణా కపూర్‌ తన పూర్తి వాటా షేర్లను తనఖా పెట్టారన్న వార్తలు వచ్చాయి. భారీగా పతనమైన బ్యాంక్‌ షేర్‌  
►  ఆగస్టు 10, 2019: సీఎఫ్‌ఓగా అనురాగ్‌ అద్లాఖ నియామకం  
►  సెప్టెంబర్‌ 21, 2019: యస్‌ బ్యాంక్‌లో 2.75 శాతం వాటా విక్రయించిన రాణా కపూర్‌. 6.89 శాతానికి తగ్గిన వాటా  
►  అక్టోబర్‌ 3, 2019: యస్‌ బ్యాంక్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ రజత్‌ మోంగా రాజీనామా
►  నవంబర్‌ 1, 2019: ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.600 కోట్ల నష్టాలు  
►  డిసెంబర్‌ 6, 2019: యస్‌ బ్యాంక్‌కు నెగిటివ్‌ అవుట్‌ లుక్‌ ఇచ్చిన రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌. 9 శాతానికి పైగా పతనమైన షేర్‌ ధర  
►  డిసెంబర్‌ 17, 2019: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో యస్‌ బ్యాంక్‌ విలీనం కానున్నదని వినిపించిన వార్తలు  
►  జనవరి 10, 2020: కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సరిగ్గా లేదంటూ రాజీనామా చేసిన బోర్డ్‌ మెంటర్‌ ఉత్తమ్‌ ప్రకాశ్‌ రాజీనామా  
►  జనవరి 13, 2020: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చోటు చేసుకుందని, ఈ విషయమై సెబీ దర్యాప్తు చేయాలని లేఖ రాసిన ఉత్తమ్‌ ప్రకాశ్‌ అగర్వాల్‌. 6 శాతం పతనమైన షేర్‌ ధర
►  మార్చి 5, 2020:  ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్షియమ్‌... యస్‌ బ్యాంక్‌లో వాటా కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని వార్తలు. 26 శాతం లాభంతో రూ.36.85కు ఎగసిన షేర్‌.


షేరు టార్గెట్‌ @ రూ. 1
అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ, జేపీ మోర్గాన్‌ యస్‌ బ్యాంక్‌ షేర్‌ టార్గెట్‌ ధరను రూ.1కు (గతంలో రూ.55)కు తగ్గించింది. రేటింగ్‌ను అండర్‌ వెయిట్‌గా కొనసాగించింది. ప్రస్తుత ధర (రూ.37)కు బాగా ఎక్కువ డిస్కౌంట్‌కు కొత్త మూలధనం లభించే అవకాశాలున్నందున టార్గెట్‌ ధరను రూ.1కు తగ్గిస్తున్నామని జేపీ మోర్గాన్‌ వివరించింది.   గురువారం 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయిన యస్‌ బ్యాంక్‌ షేరు.. ఆ తర్వాత టేకోవర్‌ వార్తలతో  బీఎస్‌ఈలో 26% పెరిగి రూ.36.85 వద్ద క్లోజయ్యింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement