Dull dues
-
మొండి బాకీలపై ఉర్జిత్ పటేల్ పుస్తకం
ముంబై: బ్యాంకింగ్ మొండి బాకీల సమస్యపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాసిన పుస్తకం ఈ నెలాఖరులో విడుదల కానుంది. దీన్ని ప్రచురించిన హార్పర్‌కోలిన్స్ ఇండియా ఈ విషయం వెల్లడించింది. ‘ఓవర్‌డ్రాఫ్ట్– భారత్‌లో పొదుపు చేసే వర్గాలను కాపాడటం’ పేరిట పటేల్ ఈ పుస్తకం రాశారు. ఎన్పీఏలు పేరుకుపోవడానికి కారణాలు, పరిస్థితి చక్కదిద్దడానికి ఆర్బీఐ గవర్నర్ హోదాలో పటేల్ చేసిన ప్రయత్నాలు తదితర అంశాలను ఇందులో పొందుపర్చారు. ఆయన పదవీకాలంలోనే పెద్ద నోట్ల రద్దు అమలైంది. అయితే, కొన్ని అంశాలపై ప్రభుత్వంతో విభేదాల నేపథ్యంలో 2018 డిసెంబర్లో ఆయన అనూహ్యంగా పదవికి రాజీనామా చేశారు. కానీ, ఇటీవలే ఎన్ఐపీఎఫ్పీ చైర్మన్‌గా గత నెలలో నియమితులయ్యారు. -
విత్‌డ్రాయల్స్ ఆంక్షలు, ఆర్బీఐ గుప్పిట్లో ‘యస్’!
న్యూఢిల్లీ: కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, మొండిబాకీల భారం, నిధుల కొరత కష్టాలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ కొరడా ఝుళిపించింది. బ్యాంక్ బోర్డును రద్దు చేయడంతో పాటు ఖాతాదారులకు షాక్‌నిచ్చేలా విత్డ్రాయల్స్పై పరిమితులు విధించింది. ఖాతాదారులకు రూ. 50,000కు మించి చెల్లింపులు జరపకుండా 30 రోజుల మారటోరియం విధిస్తూ ఆర్బీఐ గురువారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 5 నుంచి అమల్లోకి వచ్చిన మారటోరియం ఏప్రిల్ 3 దాకా కొనసాగుతుంది. వైద్యం, ఉన్నత విద్య, వివాహం వంటి అత్యవసర సందర్భాల్లో మాత్రమే రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. అటు యస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిన నేపథ్యంలో బోర్డును కూడా రద్దు చేసిన ఆర్బీఐ.. ప్రభుత్వ రంగ ఎస్బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. భారీ స్కామ్‌తో కుదేలైన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకుపైనా ఆర్బీఐ కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఆంక్షలే విధించింది. అది జరిగిన 6 నెలల వ్యవధిలోనే యస్ బ్యాంక్‌పైనా రిజర్వ్ బ్యాంక్ అటువంటి చర్యలే తీసుకోవడం గమనార్హం. ఆందోళన వద్దు .. డిపాజిట్లు భద్రమే.. మొండిబాకీల భారం, డిపాజిట్ల విత్‌డ్రాయల్స్, రేటింగ్ డౌన్‌గ్రేడ్స్ వంటి పలు ప్రతికూల అంశాలతో బ్యాంకు పరిస్థితి నానాటికి దిగజారిందని ఆర్బీఐ పేర్కొంది. ‘పరిస్థితి చక్కదిద్దుకోవడానికి, విశ్వసనీయమైన పునరుద్ధరణ ప్రణాళికతో నిధులు సమీకరించుకోవడానికి యస్ బ్యాంక్ మేనేజ్మెంట్కు తగినన్ని అవకాశాలు ఇచ్చాం. కానీ ప్రణాళికలు అమలు చేయడంలో అది విఫలమైంది. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత.. ఖాతాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం యస్ బ్యాంకుపై మారటోరియం విధించాలంటూ ప్రభుత్వానికి సూచించడం మినహా మరో మార్గాంతరం లేదని భావించాం. తదనుగుణంగానే కేంద్రం నిర్ణయం తీసుకుంది‘ అని ఆర్బీఐ పేర్కొంది. ఖాతాదారులు ఆందోళన చెందనక్కర్లేదన్న ఆర్బీఐ.. డిపాజిట్లు భద్రంగానే ఉంటాయని, డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడతామని భరోసానిచ్చింది. బ్యాంకింగ్ రంగ నియంత్రణ చట్ట నిబంధనల ప్రకారం యస్ బ్యాంక్ పునరుద్ధరణ లేదా మరో బ్యాంకులో విలీనం చేయడానికి సంబంధించి త్వరలోనే తగు ప్రణాళికను రూపొందిస్తామని ఆర్బీఐ పేర్కొంది. డిపాజిటర్లు సుదీర్ఘకాలం ఇబ్బందులు పడకుండా మారటోరియం ముగిసేలోగానే దీన్ని అమలు చేస్తామని తెలిపింది. ఎస్బీఐ చేతికి..? ఎల్ఐసీతో కలిసి టేకోవర్ వార్తలు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు.. యస్ బ్యాంక్‌ను ఎల్ఐసీతో కలిసి ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని కన్సార్షియం టేకోవర్ చేయనుందంటూ వార్తలు వచ్చాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కన్సార్షియం మొత్తం 49 శాతం వాటాలు కొనేలా ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. నియంత్రణాధికారాలు దక్కే స్థాయిలో వాటాలు కొనుగోలు చేసేందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా రావొచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గురువారం ముంబైలో ఎస్బీఐ బోర్డు సమావేశం కావడం ఈ వార్తలకు ఊతమిచ్చింది. యస్ బ్యాంక్ మూతబడే పరిస్థితి ఉండబోదంటూ ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యలు చేసిన కొన్నాళ్లకే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొటక్ మహీంద్రా వంటి ప్రైవేట్ దిగ్గజ బ్యాంకులు.. యస్ బ్యాంక్‌ను టేకోవర్ చేసేందుకు అనువైనవంటూ గతంలో ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ వార్తలపై వివరణనివ్వాలంటూ ఎస్బీఐ, యస్ బ్యాంకులకు స్టాక్ ఎక్సే్చంజీలు సూచించాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం అలాంటి పరిణామాలేమైనా ఉన్న పక్షంలో వెల్లడిస్తామంటూ ఎస్బీఐ తెలియజేసింది. అటు యస్ బ్యాంక్ కూడా .. ఇప్పటిదాకా తమకు దీనిపై ఆర్బీఐ లేదా ప్రభుత్వం లేదా ఇతరత్రా నియంత్రణ సంస్థలు, ఎస్బీఐ నుంచి ఏ విధమైన సమాచారమూ రాలేదని తెలిపింది. అటు, బ్రోకరేజీ సంస్థలు మాత్రం యస్ బ్యాంక్ పరిస్థితి ఆశావహంగా లేదంటూ వ్యాఖ్యానించాయి. ఒకవేళ ఇన్వెస్టర్లకు బలవంతంగా అంటగట్టినా.. మొండిబాకీల రిస్కులు భారీగా ఉన్నందున బ్యాంకు విలువను సున్నా కింద లెక్కగట్టి తీసుకోవడమే జరగవచ్చని జేపీ మోర్గాన్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ‘యస్’ నుంచి ‘నో’ వరకూ...! ► జూన్ 12, 2018: యస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓగా మూడేళ్లపాటు రాణా కపూర్ పునర్నియామకానికి వాటాదారుల ఆమోదం ► సెప్టెంబర్ 19, 2018: రాణా కపూర్ పదవీ కాలాన్ని జనవరి 31,2019 వరకే తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ► సెప్టెంబర్ 21, 2018: యస్ బ్యాంక్ షేర్ ఒకే రోజు 30 శాతం పతనం, రూ.21,951 కోట్ల మార్కెట్ క్యాప్ ఆవిరి ► సెప్టెంబర్ 28, 2018: ప్రమోటర్ షేర్లను విక్రయించబోనని, కూతుళ్లకు ఇచ్చేస్తానని రాణా కపూర్ ప్రకటన. యస్ బ్యాంక్ డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కు క్రెడిట్ వాచ్ రేటింగ్‌ను ఇస్తున్నామని కేర్ రేటింగ్స్ వెల్లడి ► అక్టోబర్ 17, 2018: రాణా కపూర్‌కు మరింత గడువును ఇవ్వడానికి నిరాకరించిన ఆర్బీఐ. 2019, ఫిబ్రవరి 1 కల్లా కొత్త సీఈఓను నియమించుకోవాలని ఆదేశం ► అక్టోబర్ 25, 2018: గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి. మార్క్‌టు మార్కెట్ నష్టాలు రెట్టింపు కావడం, మొండి బకాయిలకు కేటాయింపులు అధికంగా ఉండటంతో ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. రుణ నాణ్యత భారీగా క్షీణించింది. ► నవంబర్ 14, 2018: చైర్మన్ పదవికి అశోక్ చావ్లా రాజీనామా. ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలగిన వసంత్ గుజరాతీ ► నవంబర్ 19, 2018: మరో ఇండిపెండెంట్ డైరెక్టర్ రెంటాల చంద్రశేఖర్ రాజీనామా ► నవంబర్ 27, 2018: యస్ బ్యాంక్ రేటింగ్‌ను డౌన్ గ్రేడ్‌చేసిన మూడీస్ సంస్థ. ► మార్చి 1, 2019: యస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన రవ్నీత్ గిల్. 3 శాతం ఎగసిన షేర్ ధర ► మార్చి 5, 2019: స్విఫ్ట్ కార్యకలాపాల విషయంలో నిబంధనలు పాటించనందుకు రూ. 1 కోటి జరిమానా విధించిన ఆర్బీఐ ► ఏప్రిల్ 26, 2019: గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఆర్థిక ఫలితాలు వెల్లడి. రూ.1,507 కోట్ల నికర నష్టాలు ► ఏప్రిల్ 29, 2019: యస్ బ్యాంక్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసిన మాక్వైరీ బ్రోకరేజ్ సంస్థ. ► ఏప్రిల్ 30, 2019: క్యూ4 ఫలితాల ప్రభావంతో 30% పతనమైన షేర్ ► మే 9, 2019: యస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ రేటింగ్‌ను ప్రధాన రేటింగ్ ఏజెన్సీలైన ఇండియా రేటింగ్స్, ఇక్రాలు డౌన్ గ్రేడ్ చేశాయి. ► మే 15, 2019: యస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్‌లో అదనపు డైరెక్టర్‌గా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ నియామకం ► జూలై 18, 2019: రాణా కపూర్ తన పూర్తి వాటా షేర్లను తనఖా పెట్టారన్న వార్తలు వచ్చాయి. భారీగా పతనమైన బ్యాంక్ షేర్ ► ఆగస్టు 10, 2019: సీఎఫ్ఓగా అనురాగ్ అద్లాఖ నియామకం ► సెప్టెంబర్ 21, 2019: యస్ బ్యాంక్‌లో 2.75 శాతం వాటా విక్రయించిన రాణా కపూర్. 6.89 శాతానికి తగ్గిన వాటా ► అక్టోబర్ 3, 2019: యస్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ రజత్ మోంగా రాజీనామా ► నవంబర్ 1, 2019: ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.600 కోట్ల నష్టాలు ► డిసెంబర్ 6, 2019: యస్ బ్యాంక్‌కు నెగిటివ్ అవుట్ లుక్ ఇచ్చిన రేటింగ్ ఏజెన్సీ మూడీస్. 9 శాతానికి పైగా పతనమైన షేర్ ధర ► డిసెంబర్ 17, 2019: కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో యస్ బ్యాంక్ విలీనం కానున్నదని వినిపించిన వార్తలు ► జనవరి 10, 2020: కార్పొరేట్ గవర్నెన్స్ సరిగ్గా లేదంటూ రాజీనామా చేసిన బోర్డ్ మెంటర్ ఉత్తమ్ ప్రకాశ్ రాజీనామా ► జనవరి 13, 2020: ఇన్సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకుందని, ఈ విషయమై సెబీ దర్యాప్తు చేయాలని లేఖ రాసిన ఉత్తమ్ ప్రకాశ్ అగర్వాల్. 6 శాతం పతనమైన షేర్ ధర ► మార్చి 5, 2020: ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియమ్... యస్ బ్యాంక్‌లో వాటా కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని వార్తలు. 26 శాతం లాభంతో రూ.36.85కు ఎగసిన షేర్. షేరు టార్గెట్ @ రూ. 1 అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, జేపీ మోర్గాన్ యస్ బ్యాంక్ షేర్ టార్గెట్ ధరను రూ.1కు (గతంలో రూ.55)కు తగ్గించింది. రేటింగ్‌ను అండర్ వెయిట్‌గా కొనసాగించింది. ప్రస్తుత ధర (రూ.37)కు బాగా ఎక్కువ డిస్కౌంట్‌కు కొత్త మూలధనం లభించే అవకాశాలున్నందున టార్గెట్ ధరను రూ.1కు తగ్గిస్తున్నామని జేపీ మోర్గాన్ వివరించింది. గురువారం 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయిన యస్ బ్యాంక్ షేరు.. ఆ తర్వాత టేకోవర్ వార్తలతో బీఎస్ఈలో 26% పెరిగి రూ.36.85 వద్ద క్లోజయ్యింది. -
ప్రభుత్వ బ్యాంకులపై తగ్గుతున్న ‘మొండి’ భారం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులపై మొండిబకాయిల (ఎన్పీఏ) భారం తగ్గుతోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2018 మార్చిలో రూ.8.96 లక్షల కోట్లు ఉన్న ఈ మొండిబకాయిల భారం 2019 సెప్టెంబర్ నాటికి రూ.7.27 లక్షల కోట్లకు తగ్గిందని తెలిపారు. దేశంలో బ్యాంకింగ్ రంగ మెరుగుదలకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇందుకు కారణమని అన్నారు. బ్యాంకింగ్‌లో పాలనా వ్యవస్థ మెరుగుదల, పర్యవేక్షణ, రికవరీ, సాంకేతికత వినియోగం వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆమె ప్రకటనలోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► సెప్టెంబర్ 2019తో ముగిసిన ఏడాదిన్నర కాలంలో దాదాపు రూ.2.03 లక్షల కోట్ల రికార్డు స్థాయిలో రికవరీ జరిగింది. ► ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో మొత్తం 18 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 12 లాభాలను నమోదు చేసుకున్నాయి. ► ఏడున్నర సంవత్సరాల్లో అత్యధిక ప్రొవిజన్ కవరేజ్ రేషియో (మొండిబకాయిలకు కేటాయింపుల నిష్పత్తి) కేటాయింపులు జరిగాయి. ► బ్యాంకింగ్ వ్యవస్థ కుదుటపడుతోందని డిసెంబర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రచురించిన బ్యాంకింగ్ ట్రెండ్ రిపోర్ట్ పేర్కొంది. అలాగే 2019 మార్చిలో 14.3 శాతం ఉన్న వాణిజ్య బ్యాంకుల క్యాపిటల్ అడిక్వసీ రేషియో 2019 సెప్టెంబర్ నాటికి 15.1 శాతానికి పెరిగింది. ► రియల్టీ, ఎన్‌బీఎఫ్‌సీలుసహా వివిధ విభాగాల్లో మొండిబకాయిల సమస్య సత్వర పరిష్కారానికి దివాలా పరిష్కార పక్రియసహా తగిన అన్ని చర్యలనూ కేంద్రం తీసుకుంటోంది. ► రుణ చెల్లింపుల్లో వైఫల్యం, మోసాలు, ద్రవ్య లభ్యత వంటి సవాళ్లతో తాజా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు కొంత సంశయించిన విషయం వాస్తవం. అయితే ఈ సవాళ్ల పరిష్కారం దిశలో తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. పారిశ్రామిక ప్రతినిధులతో భేటీ ప్రత్యక్ష పన్ను వివాదాలపై సమీక్ష ఆర్థికమంత్రి సోమవారం పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రతిపాదిత ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కార పథకంపై వారితో చర్చించారు. పన్ను బకాయిల చెల్లింపు, ఇందుకు సంబంధించి వడ్డీ, జరిమానాల నుంచి మినహాయింపు వంటి అంశా లు ఈ పథకంలో ప్రత్యేకతలు. దాదాపు రూ. 9 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు ప్రస్తుతం వివాదాల్లో ఉన్నాయి. ఆయా వివాదాల పరిష్కార లక్ష్యంగా లోక్‌సభలో ప్రభుత్వం గత వారం ‘‘డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ బిల్లు, 2020’’ని ప్రవేశపెట్టింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత నోటిఫై అవుతుంది. తాజా సమావేశంలో ఈ బిల్లుపై పారిశ్రామిక వర్గాలు తమ సూచనలు, సలహాలు ఇచ్చినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. -
త్వరలో పీసీఏ నుంచి బైటపడతాం
మొండిబాకీల రికవరీకి, నిర్వహణ మెరుగుపర్చుకోవడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మళ్లీ లాభాల బాట పట్టగలమని ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) ఎండీ, సీఈవో కరణం శేఖర్ తెలిపారు. తద్వారా సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ)పరమైన ఆంక్షల పరిధి నుంచి త్వరలోనే బైటపడగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శేఖర్ ఈ విషయాలు వెల్లడించారు. మరిన్ని వివరాలు.. పీసీఏ నుంచి ఎలా బైటపడబోతున్నారు? ఐవోబీ 2015లో పీసీఏ పరిధిలోకి వచ్చింది. మొండిబాకీలు పేరుకుపోయిన బ్యాంకులపై పీసీఏపరమైన ఆంక్షలు విధించేందుకు ఆర్బీఐ ప్రధానంగా నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. వీటిలో లీవరేజీ అంశంలో మేం మెరుగ్గానే ఉన్నాం. మూలధన నిష్పత్తి విషయంలో సెప్టెంబర్ త్రైమాసికంలో గట్టెక్కాం. మొండిబాకీలు కూడా నిర్దేశిత 6 శాతం దిగువకి తగ్గనున్నాయి. ప్రొవిజనింగ్ క్రమంగా తగ్గుతుండటంతో డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లోనే మళ్లీ లాభాల్లోకి వచ్చే అవకాశముంది. మొండిబాకీల రికవరీకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మొండిబాకీలను (ఎన్పీఏ) రాబట్టుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. అన్ని ఎన్పీఏలను 16 అసెట్ రికవరీ మేనేజ్మెంట్ శాఖలకు (ఏఆర్‌ఎంబీ) బదలాయిస్తున్నాం. రికవరీ బాధ్యతలను వాటికే అప్పగిస్తున్నాం. ప్రత్యేక వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీఎస్) కింద రూ. 25 కోట్ల దాకా రుణాల సెటిల్మెంట్కు అవకాశం కల్పిస్తున్నాం. దీన్నుంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వీటన్నింటి ఊతంతో నికర ఎన్పీఏలు 6 శాతం లోపు స్థాయికి దిగి రావొచ్చు. మొండిబాకీల పరిమాణం తగ్గే కొద్దీ ప్రొవిజనింగ్ కూడా క్రమంగా తగ్గనుంది. తద్వారా మళ్లీ స్థిరంగా లాభాలు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, డిఫాల్టర్ల ప్రాపర్టీల వేలం ప్రక్రియ కూడా చురుగ్గా నిర్వహిస్తున్నాం. ఇలాంటివి సుమారు 8,000 దాకా ప్రాపర్టీలు ఉన్నాయి. ప్రతి నెలా 1,000–1,500 దాకా వేలం నిర్వహిస్తున్నాం. గతేడాది జూలైలో ప్రారంభమైన తొలి విడత ఈ జనవరిలో పూర్తి కానుంది. దీనికి క్రమంగా మంచి స్పందనే వస్తోంది. రుణాల పోర్ట్‌ఫోలియో పరిస్థితి ఎలా ఉంది? మేం ఎక్కువగా కార్పొరేట్ రుణాల జోలికి వెళ్లడం లేదు. ప్రధానంగా లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ), రిటైల్ గృహ రుణాలు, వ్యవసాయ రుణాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. ఎంఎస్ఎంఈ రుణాల పోర్ట్‌ఫోలియో సుమారు రూ. 30,000–35,000 కోట్ల స్థాయిలో ఉంది. దీనితో పాటు రిటైల్, వ్యవసాయ రుణాలన్నీ కలిపి రూ. 1 లక్ష కోట్ల పైగానే ఉంటాయి. ఎంఎస్ఎంఈ రుణాలకు సంబంధించి ప్రత్యేకంగా 200 శాఖలను గుర్తించాం. వీటిలో 20 శాఖలు తెలుగు రాష్ట్రాల్లో ఉండనున్నాయి. ఎంఎస్ఎంఈల రుణావసరాలు తదితర అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది ఈ శాఖల్లో ఉంటారు. జనవరి–మార్చి త్రైమాసికంలోనే ఈ వ్యూహాన్ని అమల్లోకి తేనున్నాం. ఎంఎస్ఎంఈ, రిటైల్ రుణాల్లో పెద్దగా మొండిబాకీల సమస్య లేదు. నికర వడ్డీ మార్జిన్లు మెరుగ్గా ఉంటాయి. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో -
చిన్న సంస్థలకు వరం!
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) సంబంధించి ఒత్తిడిలో ఉన్న ఏ ఒక్క రుణాన్ని మొండి బాకీగా(ఎన్పీఏ)గా 2020 మార్చి వరకు ప్రకటించొద్దని కేంద్రం బ్యాంకులను కోరింది. వాటి రుణాలను పునరుద్ధరించాలని సూచించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో సమావేశమయ్యారు. బ్యాంకుల పనితీరు, రుణ వృద్ధి అంశాలపై చర్చించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒత్తిడిలోని రుణాలను ఎన్పీఏగా ప్రకటించొద్దంటూ ఆర్బీఐ జూన్ 7న ఉత్తర్వులు విడుదల చేసినట్టు చెప్పారు. ఈ ఆదేశాలను అనుసరించాలని, 2020 మార్చి వరకు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒత్తిడిలోని రుణాలను ఎన్పీఏలుగా ప్రకటించొద్దని కోరినట్టు చెప్పారు. రుణాల పునరుద్ధరణకు పనిచేయాలని సూచించామన్నారు. ఇది ఎంఎస్ఎంఈ రంగానికి మేలు చేస్తుందన్నారు. భవిష్యత్తులో వసూలు కాని నిరర్ధక ఆస్తులుగా మారే అవకాశం ఉన్న వాటిని ఒత్తిడిలోని రుణాలుగా బ్యాంకులు పరిగణిస్తుంటాయి. బ్యాంకులు కొన్ని ఎన్బీఎఫ్సీలను గుర్తించాయని.. ఆయా ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని మంత్రి సీతారామన్ తెలిపారు. దాంతో లిక్విడిటీ మెరుగవుతుందని, అవసరమైన వర్గాలకు రుణాలు అందుతాయన్నారు. రుణ మేళాలు...: దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు అక్టోబర్ 3 నుంచి రుణమేళాలు నిర్వహిస్తాయని మంత్రి సీతారామన్ తెలిపారు. తాము టై అప్ అయిన ఎన్బీఎఫ్సీలతో కలసి గృహ కొనుగోలుదారులకు, రైతులకు, ఇతరులకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ముందుగా అక్టోబర్ 3–7వ తేదీల మధ్య 200 జిల్లాల్లో, మిగిలిన 200 జిల్లాల్లో అక్టోబర్ 11 తర్వాత నుంచి ఈ సమావేశాల ఏర్పాటు ఉంటుందన్నారు. పండుగల సమయంలో సాధ్యమైనన్ని రుణాలను అందించడమే వీటి ఉద్దేశంగా చెప్పారు. -
మొండి బండ.. మరింత భారం!
మొండి బకాయిలు... ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సమస్య తీవ్రత తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అవేవీ ఫలించడం లేదు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిల సమస్య మరింత తీవ్రమవుతోంది. ఈ సమస్య కారణంగానే గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నిర్వహణ నష్టాలు రూ.50,000 కోట్లకు మించాయి. అంతే కాకుండా భారీ కంపెనీల కొన్ని బకాయిలు మొండిగా మారే ప్రమాదమూ పొంచి ఉంది. మార్చి క్వార్టర్ చివరినాటికి ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల స్థూల మొండి బకాయిలు రూ.7.7 లక్షల కోట్లకు తగ్గింది. అయితే ఇది ఏమంత ఊరటనిచ్చే విషయం కాదని నిపుణులంటున్నారు. దివాలా ప్రక్రియ మంచిదే కానీ... మొండి బకాయిల రికవరీ కోసం రూపొందించిన దివాలా చట్టం మంచి ఫలితాలనే ఇస్తోంది. అయితే ఈ ప్రక్రియ కారణంగా బ్యాంకులు ఇచ్చిన రుణాల కంటే తక్కువ మొత్తంలోనే రికవరీ కానుండటం ఒకింత ప్రతికూల ప్రభావం చూపించనున్నది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోవడం కూడా బ్యాంక్‌లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. గత ఆర్థిక సంవత్సరం(2018–19) మార్చి క్వార్టర్లో జీడీపీ ఐదేళ్ల కనిష్ట స్థాయికి, 5.8 శాతానికి పడిపోయింది. జీడీపీ క్షీణత కారణంగా వ్యవసాయ, రియల్టీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాలకు ఇచ్చిన రుణాలు మొండిగా మారిపోయే ప్రమాదమూ లేకపోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఒత్తిడి ఖాతాల కోసం మూలధన నిధులను కేటాయిస్తున్నాయి. భూషణ్ స్టీల్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ అండ్ మోనెట్ ఇస్పాత్, జెట్ ఎయిర్వేస్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, కొన్ని ఎన్బీఎఫ్సీ కంపెనీలు...ఇలా ఒత్తిడి ఖాతాలకు నిధులను కేటాయిస్తున్నాయి. ఇది ఆందోళనకరం. ఎస్సార్ స్టీల్, భూషణ్ పవర్ అండ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్‌లకు సంబంధించిన దివాలా కేసులు పూర్తిగా పరిష్కారమైతే, బ్యాంక్‌లకు మొండి బకాయిల భారం ఒకింత తీరుతుంది. ఈ కేసులన్నీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం కల్లా పరిష్కారం అవుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్లలో రూ.2 లక్షల కోట్లు... గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు కేంద్ర ప్రభుత్వం రూ.52,000 కోట్ల మేర నిధులందించింది. దీంతో కలుపుకొని మొత్తం రెండేళ్లలో రూ.2 లక్షల కోట్లు అందించినట్లయింది. ఈ నిధుల్లో అధిక మొత్తాలను బ్యాంక్‌లు మొండిబకాయిల ‘కేటాయింపులకే’ కేటాయించాయి. అయినప్పటికీ, గత క్యూ4లో బ్యాంక్‌ల నష్టాలు తగ్గలేదు. రుణ నాణ్యత తగ్గడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల రుణ మంజూరీలు కూడా తగ్గాయి. ప్రైవేట్ బ్యాంక్‌లు జోరుగా రుణాలిస్తుండగా, ప్రభుత్వ బ్యాంక్‌లు మాత్రం రుణ నాణ్యతను మెరుగుపరచుకోవడంపైననే దృష్టి పెట్టాయి. ఉదాహరణకు చూస్తే, బ్యాంక్ ఆఫ్ బరోడా రుణ–డిపాజిట్ నిష్పత్తి 2017లో 64 శాతం, గతేడాది 72 శాతంగా ఉంది. దీనికి భిన్నంగా ఐసీఐసీఐ బ్యాంక్ రుణ–డిపాజిట్ నిష్పత్తి 95, 91 శాతాలుగా నమోదైంది. కంపెనీలకు తగ్గుతున్న రుణాలు.. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.., ఇతర రుణాలతో పోల్చితే కంపెనీలకు బ్యాంక్‌లు ఇచ్చిన రుణాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో తగ్గాయి. కంపెనీలకు బ్యాంక్‌లు ఇచ్చిన రుణాలు 12 శాతం తగ్గాయి. మరోవైపు వాహన కొనుగోళ్ల రుణాలు 5 శాతం, ఇతర వ్యక్తిగత రుణాలు 21 శాతం, సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థల రుణాలు 1 శాతం మేర పెరిగాయి. మధ్య స్థాయి సంస్థలకు ఇచ్చిన రుణాలు 4 శాతం ఎగిశాయి. మెరుగుపడుతున్న రుణ నాణ్యత ఇక రుణ నాణ్యత మెరుగుదల అన్ని బ్యాంక్‌ల్లో ఒకేలా లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) స్థూల మొండి బకాయిలు 23 శాతం తగ్గి రూ.1.73 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. తాజా మొండి బకాయిలపై నియంత్రణ సాధించామని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార వ్యాఖ్యానించారు. రుణ నాణ్యత మరింతగా మెరుగుపడిందని, ఒత్తిడి ఖాతాలకు తగిన కేటాయింపులు జరిపామని పేర్కొన్నారు. దాదాపు ఏడు క్వార్టర్ల పాటు నష్టాలు ప్రకటిస్తూ వచ్చిన యునైటెట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత క్యూ4లో లాభాల బాట పట్టింది. ఈ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు 27 శాతం తగ్గి రూ.12,053 కోట్లకు తగ్గాయి. రుణ నాణ్యత మెరుగుదల పరంగా చూస్తే, ప్రభుత్వ బ్యాంక్‌ల కంటే ప్రైవేట్ బ్యాంక్‌లదే పై చేయిగా ఉంది. ఈ విషయంలో ఐసీఐసీఐ బ్యాంక్ ముందు వరుసలో ఉంది. ఈ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు 14 శాతం తగ్గి రూ.46,292 కోట్లకు చేరాయి. ప్రైవేట్ బ్యాంక్‌లకూ పాకుతున్న సమస్య... మొండి బకాయిల విషయంలో కొన్ని ప్రైవేట్ బ్యాంక్‌లు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లతో పోటీ పడుతున్నాయి. స్థూల మొండి బకాయిల పెరుగుదల విషయంలో యస్‌బ్యాంక్‌ను చెప్పుకోవాలి. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఈ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు 200 శాతం ఎగసి రూ.7,883 కోట్లకు పెరిగాయి. ఒక విమానయాన సంస్థ(జెట్ ఎయిర్వేస్ కావచ్చు), మౌలిక రంగ దిగ్గజం(ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) బకాయిలను మొండి బకాయిలుగా గుర్తించామని, అందుకే గత క్యూ4లో మొండి బకాయిలు భారీగా పెరిగాయని యస్ బ్యాంక్ యాజమాన్యం వెల్లడించింది. ఇక ఇండస్ఇండ్ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు 131 శాతం పెరిగి రూ.3,947 కోట్లకు చేరాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీల బకాయిలను మొండి బకాయిలుగా గుర్తించడం వల్ల ఈ బ్యాంక్ మొండిబకాయిలు ఇంతగా పెరిగాయి. ఈ బ్యాంక్‌కు మొండి భారం మరింతగా ఉండనున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బ్యాంక్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు, ఎస్సెల్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, ఇతర కొన్ని కంపెనీలకు బాగానే రుణాలిచ్చిందని, ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో వీటి కేటాయింపులు మరింతగా పెరుగుతాయని వారంటున్నారు. మొత్తం మీద ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంక్‌లను మొండి బకాయిల సమస్య ఇప్పట్లో వదిలేలా లేదు. -
మూడు నెలలు... 52వేల కోట్లు!
ముంబయి: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిలు అంతకంతకూ పేరుకుపోతుండటంతో వాటికి బ్యాంక్‌లు అధికంగా కేటాయింపులు జరపాల్సి వస్తోంది. ఫలితంగా ప్రతి త్రైమాసికానికీ బ్యాంక్‌ల లాభదాయకత అంతకంతకూ క్షీణిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఎన్పీఏలకు జరిపిన కేటాయింపులతో పోలిస్తే క్యూ4లో మొండి బకాయిల కేటాయింపులతో పోల్చితే ఇవి రూ.29,625 కోట్లు అధికం. విమానయాన సంస్థ, జెట్ ఎయిర్వేస్ కూలిపోవడం, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కంపెనీ కూడా మూతపడటంతో ప్రభుత్వ బ్యాంక్‌ల మొండి బకాయిల సమస్య మరింత తీవ్రంగా మారింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 13 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొత్తం కేటాయింపులు రూ.52,739 కోట్లకు చేరటంతో ఈ ప్రభావం బ్యాంక్‌ల లాభదాయకతపై బాగానే పడింది. ఎనిమిది బ్యాంక్‌లకు రూ.15,192 కోట్ల మేర నికర నష్టాలు వచ్చాయి. ఐదు బ్యాంక్‌లకు మాత్రమే నికర లాభాలొచ్చాయి. ఒక్కో బ్యాంక్ నష్టాలు నాలుగంకెల్లో (వెయ్యి కోట్లకు పైగా) ఉండగా, లాభాల్లో ఉన్న బ్యాంక్‌ల లాభాలు రెండు, మూడు అంకెల్లో (రూ.95 కోట్లు నుంచి రూ.838 కోట్ల రేంజ్) మాత్రమే ఉన్నాయి. ఇప్పట్లో కష్టమే.... ఈ మొండి బకాయిల్లో ఎంత మొత్తం బకాయిలు వసూలు అవుతాయో, ఎంత మేర బకాయిలను బ్యాంక్‌లు రద్దు చేస్తాయో, ఎన్ని కోట్ల కేటాయింపులు మళ్లీ వెనక్కి వస్తాయో ఎవరూ జవాబివ్వలేని ప్రశ్నగా మిగిలిపోయింది. కేటాయింపుల పరిమాణం చూస్తే, మొండి బకాయిల బండ ఇప్పట్లో బ్యాంక్‌లను వీడేటట్లు లేదని నిపుణులంటున్నారు. కేటాయింపుల వ్యధ... గత క్యూ3లో రూ.6,006 కోట్లుగా ఉన్న ఎస్బీఐ మొండి కేటాయింపులు గత క్యూ4లో నాలుగు రెట్లు పెరిగి రూ.16,502 కోట్లకు చేరాయి. ఐఎల్ఎఫ్ఎస్కు ఇచ్చిన రూ.3,487 కోట్ల రుణాల్లో 1,125 కోట్ల రుణాలను మొండి బకాయిలుగా ఎస్బీఐ వర్గీకరించింది. అలాగే జెట్ ఎయిర్వేస్కు చెందిన రూ.1,200 కోట్ల బకాయిలను కూడా మొండి బకాయిలుగా ఈ బ్యాంక్ గుర్తించింది. మొండి బకాయిలకు కేటాయింపులు కారణంగా రూ.1,985 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తెలిపింది. ఈ బ్యాంక్ కేటాయింపులు రూ.4,502 కోట్లుగా ఉన్నాయి. రానున్న క్వార్టర్లలో ఈ బ్యాంక్ కేటాయింపులు మరింతగా పెరుగుతాయని విశ్లేషకులంటున్నారు. దీంతో మరో రెండు క్వార్టర్ల పాటు ఈ బ్యాంక్‌కు నష్టాలు తప్పవని వారంటున్నారు. దాదాపు ప్రతి బ్యాంక్ పరిస్థితి ఇలాగే ఉంది. రెండు బ్యాంక్‌ల కేటాయింపులు మాత్రం గత క్యూ4లో తగ్గాయి. యునైటెడ్ బ్యాంక్ కేటాయింపులు రూ.1,967 కోట్ల నుంచి రూ.1,688 కోట్లకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కేటాయింపులు రూ.4,422 కోట్ల నుంచి రూ.415 కోట్లకు తగ్గాయి. ఈ రెండు బ్యాంక్‌లకు గత క్యూ4లో నికర లాభాలు వచ్చాయి. వడ్డీ ఆదాయం కంటే మొండి బకాయిల కేటాయింపులే అధికం... మొత్తం 13 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో ఎనిమిది బ్యాంక్‌ల నికర వడ్డీ ఆదాయం కంటే కూడా మొండి బకాయిల కేటాయింపులే అధికంగా ఉన్నాయి. మొండి బకాయిల ప్రక్షాళన కోసం సదరు ఎనిమిది బ్యాంక్‌లు కనీసం మరో రెండేళ్ల పాటు కేటాయింపులు జరపాల్సి ఉంటుందని నిపుణులంటున్నారు. మొత్తం 13 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నికర వడ్డీ ఆదాయం రూ.43,304 కోట్లు. కాగా, మొండి బకాయిలు కేటాయింపులు రూ.52,739 కోట్లకు చేరాయి. -
పెరిగిన ఆంధ్రా బ్యాంకు నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంకు నష్టాలు డిసెంబర్ త్రైమాసికంలో మరింత పెరిగాయి. ఈ కాలంలో బ్యాంకు రూ.578 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2017 డిసెంబర్ త్రైమాసికంలో ఈ నష్టం రూ.532 కోట్లుగా ఉంది. టర్నోవరు రూ.5,093 కోట్ల నుంచి రూ.5,322 కోట్లకు ఎగసింది. ఏప్రిల్– డిసెంబర్ కాలంలో మొత్తం రూ.15,663 కోట్ల టర్నోవరుపై రూ.1,552 కోట్ల నష్టం వచ్చినట్లు బ్యాంకు వెల్లడించింది. మొండి బకాయిల కోసం చేసిన కేటాయింపులు రూ.1,749 కోట్ల నుంచి రూ.1,790 కోట్లకు చేరాయి. 2018 డిసెంబర్ నాటికి అడ్వాన్సుల్లో మొండి బకాయిల వాటా 14.26 నుంచి 16.68%కి పెరిగింది. స్థూల నిరర్ధక ఆస్తులు రూ.21,599 కోట్ల నుంచి రూ.28,703 కోట్లను తాకాయి. నికర నిరర్ధక ఆస్తులు 7.72% నుంచి 6.99%కి దిగొచ్చాయి. సోమవారం బీఎస్ఈలో ఆంధ్రా బ్యాంకు షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.42% తగ్గి రూ.23.95 వద్ద స్థిరపడింది. -
ఫెడరల్ బ్యాంకు లాభాలకు ఎన్పీఏల దెబ్బ
ముంబై: ప్రైవేటు రంగంలోని ఫెడరల్ బ్యాంకుకు సెప్టెంబర్ త్రైమాసికంలో మొండి బకాయిల కాక తగిలింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి ఫెడరల్ బ్యాంకు నికర లాభం కేవలం 0.88 శాతానికే పరిమితం అయింది. బ్యాంకు ప్రొవిజన్స్ 63 శాతం పెరిగి రూ.288 కోట్లకు చేరాయి. దీంతో లాభం రూ.266 కోట్లకు పరిమితం అయింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.263.70 కోట్లుగా ఉండటం గమనార్హం. కేరళ వరదల ప్రభావం ఊహించదానికంటే ఎక్కువేమీ లేదని బ్యాంకు ప్రకటించింది. ‘‘రుణ నష్టాల కోసం రూ.152 కోట్లను పక్కన పెట్టాల్సి వచ్చింది. బ్యాంకు పలు ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రూ.105 కోట్లు, స్టాండర్డ్ అసెట్స్ కోసం రూ.30 కోట్లు కేటాయించాం’’ అని ఫెడరల్ బ్యాంకు ఎండీ, సీఈవో శ్యామ్ శ్రీనివాసన్ తెలిపారు. కేరళ వరదల కారణంగా బ్యాంకు లాభాలపై రూ.35 కోట్ల మేర ప్రభావం ఉన్నట్టు చెప్పారు. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 13.75 శాతం వృద్ధితో రూ.1,022 కోట్లుగా నమోదైంది. బ్యాంకు రుణాలు 26 శాతం పెరగడం, నికర వడ్డీ మార్జిన్ స్వల్పంగా పెరిగి 3.15 శాతానికి చేరడం కలిసొచ్చాయి. ఇతర ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.287 కోట్ల నుంచి రూ.322 కోట్లకు చేరింది. పెరిగిన ఎన్పీఏలు బ్యాంకుల ఆస్తుల నాణ్యత స్వల్పంగా క్షీణించింది. స్థూల ఎన్పీఏలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 2.39 శాతం నుంచి 3.11 శాతానికి పెరిగాయి. తాజాగా రూ.477 కోట్ల మేర రుణాలు ఎన్‌పీఏల్లోకి వచ్చి చేరాయి. ముఖ్యంగా ఎస్ఎంఈ రంగానికి ఇచ్చిన రుణాలు రూ.169 కోట్ల మేర ఎన్పీఏలకు జతయ్యాయి. ఆ తర్వాత కార్పొరేట్ రంగం నుంచి రూ.120 కోట్లు ఎన్పీఏలుగా మారాయి. తాజా ఎన్‌పీఏల్లో కేరళ వరదల కారణంగా వచ్చి చేరినవీ రూ.50 కోట్లు ఉన్నట్టు బ్యాంకు ఎండీ శ్రీనివాసన్ తెలిపారు. అంతేకాదు కేరళ వరదల ప్రభావంతో రానున్న రెండు క్వార్టర్లలోరూ రూ.50 కోట్ల చొప్పున ఎన్పీఏలు అదనంగా ఉంటాయని బ్యాంకు అంచనా వేసింది. కేరళ వరదల అనంతరం రుణ వ్యయాలు 0.65–0.75 శాతంగా ఉంటాయని, తాజా ఎన్పీఏలు 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్ల మేర ఉండొచ్చన్న సవరించిన అంచనాలకు కట్టుబడి ఉన్నట్టు శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఐఎల్ఎఫ్ఎస్లో బ్యాంకుకు ఎక్స్పోజర్ లేదని స్పష్టం చేశారు. ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి రూ.12,000 కోట్ల మేర ఎక్స్పోజర్ ఉండగా, ఇందులో టాప్ 5 ఎన్‌బీఎఫ్‌సీల వాటా 40 శాతంగా ఉన్నట్టు చెప్పారు. ఫలితాల నేపథ్యంలో ఫెడరల్ బ్యాంకు షేరు బీఎస్ఈలో 7.86 శాతం లాభపడి రూ.81.65 వద్ద ముగిసింది. -
పీఎన్బీకి స్వల్పంగా తగ్గిన మొండిబాకీలు
న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణంతో దెబ్బతిన్న ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మొండిబాకీలు జూలైలో స్వల్పంగా తగ్గాయి. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నుంచి రావాల్సిన బకాయిలు 1.8 శాతం మేర తగ్గి రూ. 15,175 కోట్లకు పరిమితమయ్యాయి. దాదాపు రూ. 25 లక్షలకు పైగా రుణాలు తీసుకుని డిఫాల్ట్ అయిన వారిని ఉద్దేశపూర్వక భారీ ఎగవేతదారులుగా పీఎన్బీ పరిగణిస్తోంది. జూన్ ఆఖరు నాటికి ఇలాంటి రుణగ్రహీతల నుంచి రూ. 15,355 కోట్లు రావాల్సి ఉండగా.. జూలై ఆఖరు నాటికి ఈ మొత్తం రూ. 15,175 కోట్లకు తగ్గింది. బ్యాంకు స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) రూ. 82,889 కోట్లుగా ఉన్నాయి. పీఎన్బీ ఇచ్చిన మొత్తం రుణాల్లో వీటి వాటా 18.26 శాతం. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పీఎన్బీ రూ. 7,700 కోట్ల మేర బకాయిలను రాబట్టుకోగలిగింది. కేవలం పీఎన్బీ నుంచి భారీగా రుణాలు పొందిన సంస్థల్లో విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యుయలరీ (సుమారు రూ. 900 కోట్లు), ఫరెవర్ ప్రెషియస్ జ్యుయలరీ అండ్ డైమండ్స్ (రూ. 748 కోట్లు), జూన్ డెవలపర్స్ (రూ. 410 కోట్లు) మొదలైనవి ఉన్నాయి. కన్సార్షియంలో భాగంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ (రూ. 597 కోట్లు), కుడోస్ కెమీ (రూ. 1,302 కోట్లు) వంటి సంస్థలకు కూడా భారీగానే రుణాలు ఇచ్చింది. -
సీఈఓలపై క్రిమినల్ చర్యలు!
న్యూఢిల్లీ: మొండి బకాయిల విషయమై ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల సీఈఓలకు కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన హెచ్చరిక జారీ చేసినట్లు తెలిసింది. రూ.50 కోట్లకు మించిన మొండి పద్దులను బ్యాంక్ సీఈఓలు గుర్తించాలని, అలా చేయని పక్షంలో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించినట్లు తెలియవచ్చింది. రూ.2,000 కోట్ల మేర బ్యాంక్ రుణాలను స్వాహా చేసినందుకు భూషణ్ స్టీల్ ప్రమోటర్ నీరజ్ సింఘాల్‌ను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) ఇటీవల అరెస్టు చేయడం తెలిసిందే. అలాగే ప్రస్తుతం పన్నెండుకు పైగా కంపెనీలపై దివాలా ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకుందని నిపుణులు చెబుతున్నారు. ఐపీసీ సెక్షన్ 120బి ప్రకారం చర్యలు.... పరిశోధన సంస్థల దర్యాప్తులో బ్యాంక్ రుణాలకు సంబంధించిన మోసాలు వెలుగులోకి వస్తే... సదరు బ్యాంక్ సీఈఓలపై భారత శిక్షాస్మృతి(ఐపీసీ) సెక్షన్ 120బి ప్రకారం చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సలహాను బ్యాంక్ సీఈఓలు అదనపు ముందు జాగ్రత్తగా పరిగణించాలని, న్యాయ వివాదాల్లోకి మునిగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆ వర్గాలు తెలిపాయి. మొండి బకాయిల విషయమై అలక్ష్యం వహిస్తే, బ్యాంక్ సీఈఓలపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించడం నిజమేనని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. భూషణ్ స్టీల్, మరో రియల్టీ కంపెనీ విషయంలో భారీగా అవకతవకలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. మొండి బకాయిల విషయమై సీఈఓలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే, రుణగ్రస్తుల గత ఐదేళ్ల లావాదేవీలను క్షుణ్నంగా పరిశీలించాలని ఆయన సూచించారు. అవసరమైతే, బ్యాంక్‌లు ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహించాలని పేర్కొన్నారు. తనిఖీల్లో వెల్లడవుతున్న అవకతవకలు... భూషణ్ స్టీల్ ప్రమోటర్ చేసినట్లే పలు కంపెనీల ప్రమోటర్లు కూడా బ్యాంక్ రుణాల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని మరో ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ అవకతవకల కోసం సదరు ప్రమోటర్లు తమ కంపెనీల అనుబంధ కంపెనీలను వినియోగించుకున్నారనడానికి ఆధారాలున్నాయని పేర్కొన్నారు. రుణ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న కంపెనీల ఖాతా పుస్తకాలను ఎస్ఎఫ్ఐఓ తనిఖీ చేస్తోందని వివరించారు. రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా దివాలా కంపెనీలపై విస్తృతమైన ఆడిటింగ్ జరుగుతోందని, ఈ తనిఖీల్లో పలు ఆర్థిక పరమైన అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐఓకు మరిన్ని అధికారాలు... భారత బ్యాంక్‌లు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మొండి బకాయిల సమస్యతో సతమతమవుతున్నాయి. మొత్తం మొండి బకాయిలు రూ.8 లక్షల కోట్లకు పెరిగాయని అంచనా. వీటికి తోడు పలు బ్యాంక్ రుణాలకు సంబంధించి మోసాలు, కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.14,000 కోట్ల మేర మోసం చేసిన విషయం తెలిసిందే. కాగా గత ఏడాది జూన్‌లో ఆర్బీఐ 12 ఒత్తిడి ఖాతాలను గుర్తించింది. ఒక్కో ఖాతాలో రూ.5,000 కోట్లకు మించిన రుణాలున్నాయి. ఇన్సాల్వెన్సీ బ్యాంక్ రప్టసీ కోడ్(ఐబీసీ) కింద తక్షణం చర్యలు చేపట్టిన మొత్తం బ్యాంక్‌ల మొండి బకాయిల్లో ఈ మొత్తం 12 ఖాతాల రుణాలు... నాలుగోవంతు వరకూ ఉంటాయని అంచనా. ఇక అదే ఏడాది డిసెంబర్లో మొండి బకాయిలకు సంబంధించి 28 కంపెనీలతో కూడిన మరో జాబితాను ఆర్బీఐ వెల్లడించిన విషయం తెలిసిందే. కంపెనీల చట్టం కింద మోసాలకు, వైట్ కాల ర్ నేరాలకు పాల్పడిన వారిని విచారించే ఎస్‌ఎఫ్‌ఐఓకు ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో మరిన్ని అధికారాలు ఇచ్చింది. కంపెనీ చట్టం ఉల్లంఘనకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసే అధికారాన్ని ఎస్‌ఎఫ్‌ఐఓకు కేంద్రం ఇచ్చింది. కాగా ఇప్పటివరకూ ఐబీసీ కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) 655 కేసుల్లో నిర్ణయం తీసుకుంది. -
భారీ ఎన్పీఏ ఖాతాలపై ఆర్బీఐ సమీక్ష
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న మొండి బకాయిలకు(ఎన్పీఏలు) చెక్ పెట్టేందుకు ఆర్బీఐ తన చర్యలను ముమ్మరం చేసింది. 200 భారీ ఎన్పీఏ ఖాతాలను, వాటికి బ్యాంకులు చేసిన ప్రొవిజనింగ్ (నిధుల కేటాయింపు)ను పరిశీలిస్తోంది. తద్వారా ఆయా ఖాతాల వల్ల బ్యాంకులపై వాస్తవంగా ఏ మేరకు ఒత్తిడి ఉందో ఆర్బీఐ తెలుసుకోనుంది. ఈ ఎన్పీఏ ఖాతాల విషయంలో బ్యాంకులు నిబంధనలను ఏ మేరకు పాటిస్తున్నాయో ఆర్బీఐ పరిశీలిస్తోందని ఓ ప్రభుత్వరంగ బ్యాంకు సీనియర్ అధికారి తెలిపారు. వసూళ్లు నిలిచిపోయిన రుణ ఖాతాల వర్గీకరణ, వాటికి నిధుల కేటాయింపు, రుణాల పునర్నిర్వచనం గురించి వివరాలు ఆరా తీస్తోందని పేర్కొన్నారు. ప్రతీ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఆర్బీఐ చేపట్టే సాధారణ బ్యాంకు ఖాతాల తనిఖీయేనని మరో అధికారి తెలిపారు. ఈ భారీ ఎన్పీఏ ఖాతాల్లో వీడియోకాన్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఉన్నట్టు చెప్పారు. బ్యాంకుల స్థూల ఎన్పీఏలు రూ.10.3 లక్షల కోట్లకు (మొత్తం రుణాల్లో 11.3%) పెరిగిన నేపథ్యంలో ఆర్బీఐ బ్యాంకు ఖాతాల సమగ్ర తనిఖీకి పూనుకోవడం గమనార్హం. 2017 మార్చి నాటికి బ్యాంకుల మొత్తం ఎన్పీఏలు రూ.8 లక్షల కోట్లు (9.5%)గానే ఉన్నాయి. వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఆర్బీఐ తనిఖీల్లో యాక్సిస్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా, యస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్పీఏలు తక్కువగా చూపించినట్టు వెలుగు చూసింది. -
పీఎన్బీ నష్టాలు 940 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి(2018–19, క్యూ1) రూ.940 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.343 కోట్ల నికర లాభం వచ్చిందని బ్యాంక్ తెలిపింది. అయితే విశ్లేషకుల అంచనాల కంటే తక్కువ నష్టాలను క్యూ1లో బ్యాంక్ ప్రకటించింది. పీఎన్బీ రూ.2,000 కోట్ల మేర నికర నష్టాలు ప్రకటించగలదని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. మొండి బకాయిలు తగ్గడం, నికర వడ్డీ ఆదాయం పెరగడంతో ఈ బ్యాంక్ నికర నష్టాలు తగ్గాయి. అయితే రూ.8,445 కోట్ల మొండి బకాయిలు రికవరీ అయినప్పటికీ, అధిక కేటాయింపుల కారణంగా ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయని పీఎన్బీ ఎమ్డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) సునీల్ మెహతా తెలిపారు. నీరవ్ మోదీ స్కామ్ ప్రభావంతో అంతకు ముందు త్రైమాసికం (గత ఆర్థిక సంవత్సరం క్యూ4)లో రూ.13,417 కోట్ల భారీ నష్టాలు వచ్చాయని వివరించారు. 22 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం గత క్యూ1లో రూ.14,468 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.15,072 కోట్లకు పెరిగిందని మెహతా తెలిపారు. నికర వడ్డీ ఆదాయం రూ.3,855 కోట్ల నుంచి 22 శాతం వృద్ధితో రూ.4,692 కోట్లకు పెరిగిందని, సీక్వెన్షియల్‌గా చూస్తే 53 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. ఇతర ఆదాయం 16 శాతం క్షీణించి రూ.1,959 కోట్లకు తగ్గిందని, అయితే మార్చి క్వార్టర్ ఇతర ఆదాయంతో పోల్చితే 26 శాతం వృద్ధి నమోదైందని వివరించారు. నిర్వహణ లాభం రూ.3,217 కోట్ల నుంచి రూ.4,195 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రుణాలు 4 శాతం వృద్ధితో రూ.4.15 లక్షల కోట్లకు, డిపాజిట్లు స్వల్ప వృద్ధితో రూ.6.30 లక్షల కోట్లకు పెరిగాయని తెలిపారు. కీలకం కాని ఆస్తుల విక్రయం ద్వారా రూ.8,600 కోట్ల నిధులు సమకూర్చుకోవాలని యోచిస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20,000 కోట్ల మేర రికవరీలు సాధిస్తామన్న ఆశాభావాన్ని మెహతా వ్యక్తం చేశారు. స్వల్పంగా తగ్గిన మొండి బకాయిలు... సీక్వెన్షియల్‌గా చూస్తే మొండి బకాయిలు స్వల్పంగా తగ్గాయని మెహతా తెలిపారు. మార్చి క్వార్టర్లో 18.38 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు జూన్ క్వార్టర్లో 18.26 శాతానికి తగ్గాయని, అయితే గత క్యూ1లో ఇవి 13.66 శాతంగానే ఉన్నాయని వివరించారు. మార్చి క్వార్టర్లో 11.24 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు జూన్ క్వార్టర్లో 10.58 శాతానికి తగ్గాయని, గత క్యూ1లో ఇవి 8.7 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేటాయింపులు సీక్వెన్షియల్‌గా 72 శాతం తగ్గి రూ.5,758 కోట్లకు చేరాయని, అయితే గత ఏడాది ఇదే క్వార్టర్లో కేటాయింపులు రూ.2,609 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో వాటా విక్రయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా పూర్తికాగలదన్న ఆశాభావాన్ని మెహతా వ్యక్తం చేశారు. ఈ వాటా విక్రయం కోసం మర్చంట్ బ్యాంకర్లను కూడా నియమించామని వివరించారు. అలాగే బీమా విభాగం పీఎన్బీ మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్‌ను వచ్చే ఏడాది మార్చి కల్లా స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. కీలకం కాని ఆస్తుల విక్రయంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. అంచనాల కంటే భారీగానే నష్టాలు తగ్గినప్పటికీ, బీఎస్ఈలో ఈ షేర్ భారీగా నష్టపోయింది. 8% పతనమై రూ.82.85 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ నష్టాలు రూ.7,718 కోట్లు
న్యూఢిల్లీ: మొండి బకాయిలకు భారీ కేటాయింపుల కారణంగా భారత దేశ అతి పెద్ద బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రికార్డ్ స్థాయి నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో రూ.7,718 కోట్ల నికర నష్టాలు (స్డాండెలోన్) వచ్చాయని ఎస్బీఐ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.2,815 కోట్ల నికర లాభం వచ్చిందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వివరించారు. సీక్వెన్షియల్‌గా చూసినా నికర నష్టాలు పెరిగాయని, గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.2,416 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వివరించారు. ఇటీవలే పీఎన్బీ రూ.13,417 కోట్ల నికర నష్టాలు ప్రకటించింది. ఆ బ్యాంక్ తర్వాత దేశంలో అత్యధికంగా నష్టాలు ఎస్బీఐకే వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నిర్వహణ లాభం, నికర వడ్డీ ఆదాయం తగ్గగా, వడ్డీయేతర ఆదాయం మాత్రం మెరుగుపడింది. ఆర్బీఐ గత ఏడాది ఏప్రిల్‌లో జారీ చేసిన కొత్త మార్గదర్శకాల కారణంగా ఒత్తిడి రంగాలకు ఇచ్చిన రుణాలకు కేటాయింపులు అధిక రేట్ల ప్రకారం కేటాయించాల్సి వచ్చిందని పేర్కొంది. ఇప్పుడు ఎస్బీఐ మరింత పటిష్టం మొండి బకాయిలకు కేటాయింపులు అధికంగా ఉండడం, పెట్టుబడి ఆదాయం తక్కువగా ఉండటం లాభాలపై ప్రభావం చూపాయని రజనీష్ కుమార్ చెప్పారు. వీటితో పాటు ట్రేడింగ్ నష్టాలు పెరగడం, వేతన సవరణ కోసం కూడా అధిక కేటాయింపులు జరపడం, బాండ్ల రాబడులు పెరగడం వల్ల మార్క్–టు–మార్కెట్ నష్టాలు పెరగడం వల్ల కూడా గత క్యూ4లో భారీగానష్టాలు వచ్చాయని వివరించారు. ఈ మార్క్–టు–మార్కెట్ నష్టాలను తర్వాతి నాలుగు క్వార్టర్లలో సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, మొత్తం నష్టాలను గత క్యూ4లోనే చూపించామని చెప్పారు. గత మూడేళ్లు ఎస్బీఐకి సమస్యాత్మకంగానే ఉందని, రెండేళ్ల కంటే ఇప్పుడు ఎస్బీఐ మరింత పటిష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. పుష్కలంగా మూలధన నిధులు మూలధన నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు. కామన్ ఈక్విటీ టైర్ వన్ మూలధనం ఈ ఏడాది మార్చి నాటికి 0.27% వృద్ధితో 9.68 శాతానికి పెరిగిందని వివరించింది. ఇది ఆశావహ సంవత్సరం అన్నారు. 2020 బ్యాంక్‌కు సంతోష సంవత్సరం అవుతుందని విశ్లేషించారు. భారీ నష్టాలున్నా...లాభపడిన షేర్ భారీ నష్టాలు ప్రకటించినప్పటికీ, ఎస్బీఐ షేర్ జోరుగా పెరిగింది. స్టాక్ సూచీలు ఒడిదుడుకులమయంగా సాగినప్పటికీ, ఫలితాల అనంతరం ఎస్బీఐ షేర్ దూసుకుపోయింది. బీఎస్ఈలో ఎస్బీఐ షేర్ 3.7 శాతం లాభంతో రూ. 254 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 6 శాతం లాభంతో రూ.260ను తాకింది. షేర్ ధర జోరుగా పెరగడంతో బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.8,078 కోట్లు పెరిగి రూ. 2,26,818 కోట్లకు పెరిగింది. ఎస్బీఐకి అధ్వాన పరిస్థితులు ముగిసినట్లేనని ఇన్వెస్టర్లు భావించారని, దీంతో షేర్ ధర పెరిగిందని ఐడీబీఐ క్యాపిటల్ వ్యాఖ్యానించింది. ఇతర బ్యాంక్‌ల ఫలితాల సరళిని బట్టి చూస్తే, ఎస్బీఐ ఇంకా అధిక నష్టాలు ప్రకటించగలదన్న అంచనాలున్నాయని, కానీ ఆ అంచనాల కంటే రూ.2,000 కోట్ల తక్కువే నష్టాలను ప్రకటించిందని వివరించింది. భూషణ్ స్టీల్ డీల్ వల్ల లాభమే! తమ అనుబంధ సంస్థల్లో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ కార్డ్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్ల్లో వాటాలను విక్రయించనున్నామని కుమార్ తెలిపారు. కాగా భూషణ్ స్టీల్‌ను టాటా స్టీల్ కొనుగోలు వల్ల ఎస్బీఐకి ప్రయోజనం కలుగనున్నదని విశ్లేషణ. ఎస్బీఐ నికర లాభం రూ.1,300 కోట్ల మేర పెరుగుతాయని. ఎన్పీఏలు రూ.11,000 కోట్ల మేర తగ్గుతాయని అంచనా. బ్యాంక్ ఫలితాలు ముఖ్యాంశాలు... ♦ 2016–17 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.10,993 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో 119 శాతం పెరిగి రూ.24,080 కోట్లకు ఎగిశాయి. ♦ మొత్తం కేటాయింపులు రూ.11,740 కోట్ల నుంచి రూ.28,096 కోట్లకు పెరిగాయి. ♦ ఆదాయం రూ.57,720 కోట్ల నుంచి రూ.68,436 కోట్లకు పెరిగింది. ♦ నికర వడ్డీ ఆదాయం 11 శాతం పెరిగి రూ.19,974 కోట్లకు పెరిగింది. దేశీయ నికర వడ్డీ మార్జిన్ మాత్రం 0.26 శాతం తగ్గి 2.67 శాతానికి చేరింది. ♦ ఫీజు ఆదాయం 13 శాతం పెరగడంతో ఇతర ఆదాయం 2.2 శాతం వృద్ధితో రూ.12,222 కోట్లకు పెరిగింది. ♦ ప్రొవిజన్ కవరేజ్ రేషియో 5 శాతం పెరిగి 66.17 శాతానికి పెరిగింది. బ్యాంకింగ్ రంగంలో ఉత్తమ ప్రొవిజన్ కవరేజ్ రేషియో ఉన్న బ్యాంకుల్లో ఇది కూడా ఒకటి. ♦ రద్దు చేసిన రుణాలకు సంబంధించిన రికవరీలు 21 శాతం వృద్ధి చెందాయి. పూర్తి ఆర్థిక సంవత్సరంలో.. ♦ 2016–17లో రూ.10,484 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.6,547 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ♦ఇదే కాలంలో ఆదాయం మొత్తం రూ.2,10,979 కోట్ల నుంచి రూ.2,59,664 కోట్లకు పెరిగింది. ♦ గత ఏడాది మార్చినాటికి రూ.1,12,343 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,23,427 కోట్లకు పెరిగాయి. అలాగే నికర మొండి బకాయిలు రూ.59,277 కోట్ల నుంచి రూ.1,10,855 కోట్లకు పెరిగాయి. ♦ శాతం పరంగా చూస్తే, గత ఏడాది మార్చినాటికి 6.90 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 10.91 శాతానికి పెరిగాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, అర శాతమే పెరిగాయి. అలాగే నికర మొండి బకాయిలు 3.71 శాతం నుంచి 5.73 శాతానికి పెరిగాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, 0.12 శాతమే పెరుగుదల ఉంది. -
హైదరాబాద్‌లో పీఎన్బీ ‘గాంధీగిరి’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొండి బకాయిలు (ఎన్పీఏ) రికవరీ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) సంధించిన గాంధీగిరి అస్త్రం బాగానే పనిచేస్తోంది. గతేడాది కాలంగా హైదరాబాద్‌లో మిషన్ గాంధీగిరితో రూ.27.27 కోట్ల బకాయిలను రికవరీ చేసింది. ఇందులో హైదరాబాద్, వైజాగ్‌లల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి రూ.12.52 కోట్లు, ప్రముఖ జువెల్లరీ షాప్ నుంచి రూ.9 కోట్లు రికవరీ చేసినట్లు బ్యాంక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో 1,084 మంది ఎగవేతదారులు.. రుణ రికవరీ, రిస్క్ మేనేజ్మెంట్, డాటా అనలిటిక్స్ వంటి నిర్వహణ కోసం ప్రముఖ క్రెడిట్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 1,084 మంది రుణ ఎగవేతదారుల పేర్లను ప్రకటించింది. ఇందులో 260 మంది ఫొటోలను డిఫాల్టర్లంటూ వార్తా పత్రికల్లో ప్రచురించింది కూడా. గత కొన్ని నెలలుగా 150 మంది డిఫాల్టర్ల పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుంది. గత 9 నెలల కాలంలో 37 మంది డిఫాల్టర్ల మీద ఎఫ్ఐఆర్ కేసులను నమోదు చేసింది కూడా. ప్లకార్డులతో గాంధీగిరి ప్రదర్శన.. గతేడాది మేలో పీఎన్బీ మిషన్ గాంధీగిరిని ప్రారంభించింది. పీఎన్బీ అన్ని సర్కిళ్లలో మిషన్ గాంధీగిరి కోసం ప్రత్యేక బృందాలను నియమిం చారు. ప్రస్తుతం 1,144 ఫీల్డ్ స్టాఫ్ ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. రుణ ఎగవేతదారుల పేర్లను, ఫొటోలను సమాజంలోకి తీసుకొచ్చి వారి పరువును బజారుకీడ్చి రుణ వసూలు చేయడమే ఈ మిషన్ గాంధీగిరి లక్ష్యం. సర్కిల్లోని ఎన్పీఏ సంఖ్యను బట్టి రోజు లేదా వారం వారీగా బృందం పర్యటన ఉంటుంది. మిషన్ గాంధీగిరి ఎలా పనిచేస్తుందంటే.. ఎగ వేతదారుల ఇళ్లకు, ఆఫీసులకు గాంధీగిరి బృందం వెళ్లి నిశ్శబ్దంగా కూర్చుంటుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్లకు ఎగవేతదారుడని తెలిసేలా ప్లకార్డులు, టీ–షర్టులు, క్యాప్‌లను ప్రదర్శిస్తుంటారు. ‘‘ఇది ప్రజల సొమ్ము– దయచేసి తిరిగి రుణాన్ని కట్టేయండని’’ ప్లకార్డుల మీద రాసి ఉంటుంది. ఎగవేతదారుల కార్ల మీద రికవరీ టీం డిఫాల్టర్ అని రాసిపెట్టేస్తారు. -
బ్యాంకుల చేతికి 9 విద్యుత్ ప్లాంట్లు!
మొండిబకాయిలుగా మారిన థర్మల్ ప్రాజెక్టుల టేకోవర్‌కు సన్నాహాలు ♦ నిర్వహణ ఎన్టీపీసీకి అప్పగించే అవకాశం... ♦ జాబితాలో ల్యాంకో ఇన్ఫ్రా బాబంధ్ ప్రాజెక్టు కూడా... న్యూఢిల్లీ: మొండిబకాయిల వసూళ్లపై తీవ్రంగా దృష్టిపెట్టిన బ్యాంకులు... విద్యుత్ రంగ ప్రాజెక్టులను దక్కించుకునే పనిలోపడ్డాయి. ప్రధానంగా తమకు రావలసిన బకాయిల మొత్తానికి సంబంధించి ఆయా ప్రాజెక్టుల్లో వాటాను టేకోవర్ చేసుకునేందుకు చకచకా పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 9 థర్మల్ పవర్ ప్రాజెక్టులను షార్ట్‌లిస్ట్ చేసినట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఎన్పీఏ సమస్య పరిష్కారానికి తాజాగా ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారీగా రుణాలను ఎగవేసిన సుమారు 12 కంపెనీలపై దివాలా చట్టాన్ని ప్రయోగించాలని కూడా ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించడం... ఆ మేరకు కొన్ని కంపెనీలపై బ్యాంకులు చర్యలు చేపట్టడం కూడా జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో పేరుకుపోయిన ఎన్‌పీఏల్లో ఈ 12 ఖాతాలకు సంబంధించినవే 25 శాతం(దాదాపు రూ.2 లక్షల కోట్లు) కావడం గమనార్హం.బ్యాంకులు షార్ట్‌లిస్ట్ చేసిన తొమ్మిది ప్రాజెక్టుల్లో జిందాల్ ఇండియా థర్మల్ పవర్(జేఐటీపీఎల్)కు చెందిన డేరంగ్ ప్రాజెక్టు(ఒడిశాలో ఉంది. దీని సామర్థ్యం 1,200 మెగావాట్లు), రాటన్ఇండియా పవర్ ప్లాంట్(మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉంది. సామర్థ్యం 1,350 మెగావాట్లు), లాంకో ఇన్‌ఫ్రాటెక్‌కు చెందిన బాబంధ్(ఒడిశా, 1,320 మెగావాట్లు) ప్రధానమైనవని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ 9 ప్రాజెక్టుల మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం సుమారు 25 వేల మెగావాట్లుగా అంచనా. రుణాలు ఎగ్గొట్టిన కంపెనీల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం నిర్ధేశించడంతో మంత్రిత్వ శాఖలు కూడా దీనిపై దృష్టిపెడుతున్నాయి. ఎన్పీఏలుగా మారిన విద్యుత్ ప్రాజెక్టుల టేకోవర్‌కు బ్యాంకులు అంగీకరించినట్లు విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ ఇటీవలే వెల్లడించారు. ప్రాజెక్టులన్నీ చిక్కుల్లోనే... వాటా తీసుకోవడం కోసం బ్యాంకులు చురుగ్గా పరిశీలిస్తున్న మూడు ప్రధాన పవర్ ప్లాంట్లను విక్రయించేందుకు ఏడాదిగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ... ఎవరూ ముందుకురాలేదు. జేఐటీపీఎల్ డేరంగ్ ప్లాంట్, ల్యాంకో ఇన్ఫ్రా బాబంధ్ ప్లాంట్లు తీవ్రమైన బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. వీటికి కేటాయించిన బొగ్గు గనులు బొగ్గు స్కామ్‌లో చిక్కుకోవడంతో 2014లో సుప్రీం కోర్టు రద్దు చేయడంతో ఇంధన సరఫరా సమస్యల్లో చిక్కుకున్నాయి. ఇక రాటన్ఇండియా నాసిక్ యూనిట్ విద్యుత్‌కొనుగోలు ఒప్పందాలు లేక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఇక రాటన్ ఇండియా నాసిక్ యూనిట్ 2016–17లో రూ.215 కోట్ల నష్టాన్ని చవిచూసింది. మొండిబకాయిల సమస్యను ఎదుర్కొంటున్న ప్రాజెక్టులను నడిపించేందుకు కంపెనీలు సిద్ధంగానే ఉన్నప్పటికీ.. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యుత్ పంపిణీ కంపెనీలేవీ అదనంగా విద్యుత్ కొనుగోళ్లకు టెండర్లను నిర్వహించకపోవడంతో సమస్యలు తీవ్రతరమవుతున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోపక్క, ఎన్పీఏలపై బ్యాంకుల నుంచి ఒత్తిడి అంతకంతకూ పెరిగిపోతోంది. విద్యుత్‌కు డిమాండ్ మందగించడంతో చాలా ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతోందని.. 2022 వరకూ ఈ రంగంలో కొత్తగా ప్రైవేటు పెట్టుబడులు ఉండకపోవచ్చనేది విద్యుత్ రంగ నిపుణుల అభిప్రాయం. రంగంలోకి ఎన్టీపీసీ...! బ్యాంకులు చేజిక్కించుకునే థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్వహణను ప్రభుత్వరంగంలోని ఎన్టీపీసీకి అప్పగించేందుకు విద్యుత్ శాఖ కూడా సుముఖంగానే ఉంది. ఈ విషయాన్ని గోయల్ కూడా వెల్లడించారు. అయితే, ఈ ప్లాంట్లలో ఎన్టీపీసీ పెట్టుబడులు పెట్టే అవకాశం లేదని.. నిర్వహణకు మాత్రమే పరిమితమవుతుందని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరోపక్క, ఈ ప్రాజెక్టుల్లో కొంత ఈక్విటీ వాటాను తీసుకునే అవకాశాన్ని ఎన్టీపీ పరిశీలిస్తున్నట్లు కంపెనీ వర్గాల సమాచారం. ‘ఈ ప్లాంట్ల కార్యకలాపాలను నిర్వహించేందుకు తాము బ్యాంకుల నుంచి కొంత ఫీజును తీసుకుంటాం ఒకవేళ వీటిలో 3–4 శాతం వాటా గనుక బ్యాంకులు తమకు ఇస్తే... ఫీజును చెల్లించాల్సిన అవసరం ఉండదు’ అని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నట్లు తెలుస్తోంది.