
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) సంబంధించి ఒత్తిడిలో ఉన్న ఏ ఒక్క రుణాన్ని మొండి బాకీగా(ఎన్‌పీఏ)గా 2020 మార్చి వరకు ప్రకటించొద్దని కేంద్రం బ్యాంకులను కోరింది. వాటి రుణాలను పునరుద్ధరించాలని సూచించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో సమావేశమయ్యారు. బ్యాంకుల పనితీరు, రుణ వృద్ధి అంశాలపై చర్చించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి ఒత్తిడిలోని రుణాలను ఎన్‌పీఏగా ప్రకటించొద్దంటూ ఆర్‌బీఐ జూన్ 7న ఉత్తర్వులు విడుదల చేసినట్టు చెప్పారు.
ఈ ఆదేశాలను అనుసరించాలని, 2020 మార్చి వరకు ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి ఒత్తిడిలోని రుణాలను ఎన్‌పీఏలుగా ప్రకటించొద్దని కోరినట్టు చెప్పారు. రుణాల పునరుద్ధరణకు పనిచేయాలని సూచించామన్నారు. ఇది ఎంఎస్‌ఎంఈ రంగానికి మేలు చేస్తుందన్నారు. భవిష్యత్తులో వసూలు కాని నిరర్ధక ఆస్తులుగా మారే అవకాశం ఉన్న వాటిని ఒత్తిడిలోని రుణాలుగా బ్యాంకులు పరిగణిస్తుంటాయి. బ్యాంకులు కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలను గుర్తించాయని.. ఆయా ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని మంత్రి సీతారామన్ తెలిపారు. దాంతో లిక్విడిటీ మెరుగవుతుందని, అవసరమైన వర్గాలకు రుణాలు అందుతాయన్నారు.
రుణ మేళాలు...: దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు అక్టోబర్ 3 నుంచి రుణమేళాలు నిర్వహిస్తాయని మంత్రి సీతారామన్ తెలిపారు. తాము టై అప్ అయిన ఎన్‌బీఎఫ్‌సీలతో కలసి గృహ కొనుగోలుదారులకు, రైతులకు, ఇతరులకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ముందుగా అక్టోబర్ 3–7వ తేదీల మధ్య 200 జిల్లాల్లో, మిగిలిన 200 జిల్లాల్లో అక్టోబర్ 11 తర్వాత నుంచి ఈ సమావేశాల ఏర్పాటు ఉంటుందన్నారు. పండుగల సమయంలో సాధ్యమైనన్ని రుణాలను అందించడమే వీటి ఉద్దేశంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment