
ముంబై: బడ్జెట్‌లో ప్రకటించినట్టు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రణాళిక అమలు విషయంలో ఆర్‌బీఐతో కలసి పనిచేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ముంబై వచ్చిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాల నిర్వహణ చూసేందుకు బ్యాంకు ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వ వాటాల ఉపసంహరణతోపాటు, మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనూ వాటాల ఉపసంహరణ ప్రతిపాదనలను మంత్రి బడ్జెలో భాగంగా ప్రకటించడం గమనార్హం. తాను కేవలం ప్రకటన మాత్రమే చేశానని, అంశాలపై కసరత్తు కొనసాగుతోందంటూ.. ఈ విషయంలో ఆర్‌బీఐతో కలసి ముందుకు వెళతా మని మంత్రి చెప్పారు. బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు విషయమై స్పందిస్తూ.. నేషనల్ అస్సెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి ప్రభుత్వం కొంత మేర హామీనిస్తుందంటూ.. ఇటువంటిది బ్యాంకుల నుంచి రావాలని, వాటి నిర్వహణలోనే ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బ్యాంకుల ఎన్‌పీఏలు అంతా గతంలో చేసిన దుర్వినియోగం కారణంగా వచ్చిన వారసత్వ సమస్యగా పేర్కొన్నారు. బడ్జెట్‌లో చేసిన ప్రైవేటీకరణ ప్రతిపాదనలపై ప్రతిపక్షాల విమర్శలను సోమరి ఆరోపణలుగా ఆర్థిక మంత్రి సీతారామన్ అభివర్ణించారు.