న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులపై మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారం తగ్గుతోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2018 మార్చిలో రూ.8.96 లక్షల కోట్లు ఉన్న ఈ మొండిబకాయిల భారం 2019 సెప్టెంబర్ నాటికి రూ.7.27 లక్షల కోట్లకు తగ్గిందని తెలిపారు. దేశంలో బ్యాంకింగ్ రంగ మెరుగుదలకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇందుకు కారణమని అన్నారు. బ్యాంకింగ్‌లో పాలనా వ్యవస్థ మెరుగుదల, పర్యవేక్షణ, రికవరీ, సాంకేతికత వినియోగం వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆమె ప్రకటనలోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...
► సెప్టెంబర్ 2019తో ముగిసిన ఏడాదిన్నర కాలంలో దాదాపు రూ.2.03 లక్షల కోట్ల రికార్డు స్థాయిలో రికవరీ జరిగింది.
► ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో మొత్తం 18 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 12 లాభాలను నమోదు చేసుకున్నాయి.
► ఏడున్నర సంవత్సరాల్లో అత్యధిక ప్రొవిజన్ కవరేజ్ రేషియో (మొండిబకాయిలకు కేటాయింపుల నిష్పత్తి) కేటాయింపులు జరిగాయి.
► బ్యాంకింగ్ వ్యవస్థ కుదుటపడుతోందని డిసెంబర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రచురించిన బ్యాంకింగ్ ట్రెండ్ రిపోర్ట్ పేర్కొంది. అలాగే 2019 మార్చిలో 14.3 శాతం ఉన్న వాణిజ్య బ్యాంకుల క్యాపిటల్ అడిక్వసీ రేషియో 2019 సెప్టెంబర్ నాటికి 15.1 శాతానికి పెరిగింది.
► రియల్టీ, ఎన్‌బీఎఫ్‌సీలుసహా వివిధ విభాగాల్లో మొండిబకాయిల సమస్య సత్వర పరిష్కారానికి దివాలా పరిష్కార పక్రియసహా తగిన అన్ని చర్యలనూ కేంద్రం తీసుకుంటోంది.
► రుణ చెల్లింపుల్లో వైఫల్యం, మోసాలు, ద్రవ్య లభ్యత వంటి సవాళ్లతో తాజా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు కొంత సంశయించిన విషయం వాస్తవం. అయితే ఈ సవాళ్ల పరిష్కారం దిశలో తగిన చర్యలు తీసుకోవడం జరిగింది.
పారిశ్రామిక ప్రతినిధులతో భేటీ
ప్రత్యక్ష పన్ను వివాదాలపై సమీక్ష
ఆర్థికమంత్రి సోమవారం పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రతిపాదిత ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కార పథకంపై వారితో చర్చించారు. పన్ను బకాయిల చెల్లింపు, ఇందుకు సంబంధించి వడ్డీ, జరిమానాల నుంచి మినహాయింపు వంటి అంశా లు ఈ పథకంలో ప్రత్యేకతలు. దాదాపు రూ. 9 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు ప్రస్తుతం వివాదాల్లో ఉన్నాయి. ఆయా వివాదాల పరిష్కార లక్ష్యంగా లోక్‌సభలో ప్రభుత్వం గత వారం ‘‘డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ బిల్లు, 2020’’ని ప్రవేశపెట్టింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత నోటిఫై అవుతుంది. తాజా సమావేశంలో ఈ బిల్లుపై పారిశ్రామిక వర్గాలు తమ సూచనలు, సలహాలు ఇచ్చినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వ బ్యాంకులపై తగ్గుతున్న ‘మొండి’ భారం
Published Tue, Feb 11 2020 2:51 AM | Last Updated on Tue, Feb 11 2020 2:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment