ప్రైవేట్ బ్యాంకులూ.. ‘మొండి’కొండలే!
లెక్కల్లో చూపని ఎన్‌పీఏలు ఎక్కువే
► ఆర్‌బీఐ మదింపు నిబంధనలతో బయటపడుతున్న నిజాలు
► యస్ బ్యాంక్‌లో రూ. 4,930 కోట్లు, ఐసీఐసీఐలో 7 శాతం, యాక్సిస్‌లో 4.5 శాతం
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు ఓవైపు మొండి బాకీల నష్టాలతో కుదేలవుతుంటే .. మరోవైపు ప్రైవేట్ బ్యాంకులు మాత్రం ఇప్పటిదాకా ప్రకటిస్తూ వచ్చిన ఆకర్షణీయ ఫలితాల్లో వాస్తవమెంత? వాటిల్లో మొండిబకాయిలు నిజంగానే తక్కువగానే ఉన్నాయా? ఈ ప్రశ్నలకు కాదు అనే సమాధానం వస్తోంది. ప్రైవేట్ బ్యాంకుల్లోనూ ఎన్‌పీఏలు భారీగానే ఉన్నాయని.. కాకపోతే అవి వాటిని సగం పైగా తక్కువ చేసి చూపిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. 2015–16లో యస్ బ్యాంక్ సొంత లెక్కల ప్రకారం స్థూల ఎన్‌పీఏల శాతం 0.76 శాతంగానే ఉండగా.. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం ఇవి 5 శాతం మేర ఉన్నాయి.
యస్ బ్యాంక్ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. యస్ బ్యాంక్ రూ. 750 కోట్ల ఎన్‌పీఏలు చూపించగా .. ఆర్‌బీఐ ప్రకారం ఇవి రూ. 4,930 కోట్లుగా ఉన్నాయి. ఇక మరో కన్సల్టెన్సీ గణాంకాల ప్రకారం యాక్సిస్ బ్యాంకు ఎన్‌పీఏలు మొత్తం రుణాల్లో 4.5 శాతం పైగా ఉన్నాయి. కానీ యాక్సిస్ బ్యాంక్ ఇవి 1.78 శాతం మాత్రమే ఉంటాయని చూపించింది. అటు ఐసీఐసీఐ కూడా మొండి బకాయిలు 5.85 శాతంగా ఉంటాయని పేర్కొన్నప్పటికీ.. వాస్తవానికి ఇవి 7 శాతం మేర ఉంటాయి. ఈ రెండు బ్యాంకులు ఇంకా తమ వార్షిక నివేదికలు ప్రచురించాల్సి ఉంది.
లెక్కలు చెప్పక తప్పదు..
ఆర్‌బీఐ గతేడాది అసెట్ క్వాలిటీ సమీక్ష నిర్వహించిన తర్వాత కూడా ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ మొండి బకాయిల్లో చాలా భాగాన్ని దాచి ఉంచుతున్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజా నిబంధనల ప్రకారం ఆర్‌బీఐ మదించిన గణాంకాలు, తమ సొంత లెక్కల మధ్య వ్యత్యాసం 15 శాతం పైగా ఉన్న పక్షంలో రిజర్వ్ బ్యాంక్ గణాంకాలను బ్యాంకులు తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. దీంతో మరిన్ని ప్రైవేట్ బ్యాంకుల్లోని ఎన్‌పీఏల వాస్తవ లెక్కలు ప్రజల ముందుకు రావొచ్చని భావిస్తున్నారు. బ్యాంకుల సొంత లెక్కలకు, ఆర్‌బీఐ గణాంకాలకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉంటున్న నేపథ్యంలో 2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆడిట్ నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
చాలా తగ్గాయి: యస్ బ్యాంక్
గత ఆర్థిక సంవత్సరం తీసుకున్న దిద్దుబాటు చర్యలతో మొండిబకాయీల్లో చాలా భాగం తగ్గాయని యస్ బ్యాంక్ పేర్కొంది. కొన్ని ఎన్‌పీఏలను అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించామని, కొన్ని ఖాతాలు మెరుగుపడ్డాయని.. ఫలితంగా మొత్తం రావాల్సిన స్థూల ఎన్‌పీఏలు 2017 మార్చి 31నాటికి రూ. 1,039.9 కోట్లకు పరిమితమయ్యాయని వివరించింది. ఇందులో ఒకే ఖాతాదారు నుంచి రూ. 911.5 కోట్లు రావాల్సి ఉండగా.. సమీప భవిష్యత్‌లో రాబట్టుకోగలమని తెలిపింది. ఈ ఖాతా కోసం ప్రత్యేకంగా రూ. 227.9 కోట్ల ప్రొవిజనింగ్ చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో భారీ మొండి బకాయిలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బదలాయించాల్సిన పరిస్థితి ఉండదని తెలిపింది.
ఎన్‌పీఏలపై ఆర్‌బీఐ, ఆర్థిక శాఖ సమావేశం..
మొండిబకాయిల సమస్యల పరిష్కారం అంశంపై రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థిక శాఖలో సీనియర్ అధికారులు శుక్రవారం సమావేశమయ్యారు. ఎన్‌పీఏల విషయంలో కఠినంగా వ్యవహరించేలా రిజర్వ్ బ్యాంక్‌కు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ కేంద్రం ఇటీవలే ఆర్డినెన్స్ జారీ చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
నిలకడగానే రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు: ఆర్‌బీఐ నివేదిక
2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల ద్రవ్య లోటు 3.4 శాతానికి పెరిగినప్పటికీ.. మొత్తం మీద చూస్తే మాత్రం ఆర్థిక స్థితిగతులు దీర్ఘకాలంలో నిలదొక్కుకునేలాగే ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ)విధానం వాటికి సానుకూలంగా ఉండగలదని పేర్కొంది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై వార్షిక నివేదికలో ఆర్‌బీఐ ఈ అంశాలు వెల్లడించింది.
గత ఆర్థిక సంవత్సరపు సవరించిన అంచనాల ప్రకారం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రాష్ట్రాల స్థూల ద్రవ్య లోటు (జీఎస్‌ఎఫ్‌డీ) .. బడ్జెట్‌లో ప్రతిపాదించిన 3 శాతాన్ని దాటేసి 3.4 శాతానికి పెరిగింది. విద్యుత్ డిస్కమ్‌లకు తోడ్పాటునిచ్చేందుకు ఉద్దేశించిన ఉదయ్ బాండ్ల జారీనే దీనికి ప్రధాన కారణమని.. దాన్ని మినహాయిస్తే.. జీఎస్‌ఎఫ్‌డీ 2.7 శాతంగానే ఉండొచ్చని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 2.6 శాతానికి తగ్గొచ్చని అంచనా వేసింది. పాతిక పెద్ద రాష్ట్రాల గణాంకాల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఈ నివేదికను రూపొందించింది.
12 బ్యాంకులపై ఆర్‌బీఐ చర్యలకు రంగం సిద్ధం?
మొండి బకాయిల పరిష్కారం దిశగా సవరించిన నిబంధనల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) అస్త్రాన్ని ప్రయోగించనున్న బ్యాంకులు సుమారు డజను దాకా బ్యాంకులు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటిల్లో చాలా మటుకు ప్రభుత్వ రంగ బ్యాంకులే కాగా.. పాత తరం ప్రైవేట్ బ్యాంక్ ధన్‌లక్ష్మీ బ్యాంక్ కూడా ఉండనుంది.
అసెట్ క్వాలిటీ నిబంధనల ప్రకారం స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) నికర రుణాల్లో 6 శాతాన్ని మించితే చర్యలు తప్పవు. దీన్ని బట్టి చూస్తే 11 బ్యాంకులు ఇప్పటికే ఈ పరిమితిని దాటేశాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అత్యధికంగా 14.32 శాతం మేర నికర ఎన్‌పీఏలు ప్రకటించింది. 10.66 శాతంతో దేనా బ్యాంక్, 10.62 శాతంతో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సుమారు 9.61 శాతం నికర ఎన్‌పీఏలు ఉన్న ఐడీబీఐ బ్యాంకుపై ఆర్‌బీఐ ఇప్పటికే పీసీఏ చర్యలు ప్రారంభించింది.
పీసీఏతో ఆంక్షలు..
పీసీఏ చర్యలు గానీ అమల్లోకి వస్తే సదరు బ్యాంకులు చెల్లించే డివిడెండ్లు, లాభాల పంపిణీ మొదలైన వాటిపై ఆంక్షలు విధిస్తారు. బ్యాంకులు తమ శాఖల నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ఉండదు. అధిక స్థాయిలో ప్రొవిజనింగ్ జరపాల్సి ఉంటుంది. మేనేజ్‌మెంట్ వేతనాలు, డైరెక్టర్ల ఫీజులపై పరిమితులు అమల్లోకి వస్తాయి.