ముంబై: ఇంతకాలం పనితీరు పరంగా చక్కని ఫలితాలతో ముందుండే యస్ బ్యాంకు... ఒక్కసారిగా సెప్టెంబర్ త్రైమాసికంలో నిరాశ పరిచింది. బ్యాంకు నికర లాభం 3.8 శాతం తగ్గి రూ.964.7 కోట్లుగా నమోదైంది. ఆర్‌బీఐ ఎన్‌పీఏల గుర్తింపు కార్యక్రమం తర్వాత బ్యాంకు నికర లాభం తగ్గడం ఇదే ప్రథమం. కిందటేడాది ఇదే కాలంలో బ్యాంకు లాభం రూ.1,003 కోట్లుగా ఉంది.
ఎన్‌పీఏలను యస్ బ్యాంకు రూ.10,000 కోట్ల మేర తక్కువ చేసి చూపించిందని ఆర్‌బీఐ ఆడిట్‌లో గుర్తించడం... తర్వాత పరిణామాల్లో యస్ బ్యాంకు ఎండీ, సీఈవోగా రాణా కపూర్ పదవీ కాలాన్ని మరో మూడేళ్లకు పొడిగించడానికి అనుమతివ్వకుండా, వచ్చే జనవరి 31 తర్వాత దిగిపోవాలని ఆదేశించడం తెలిసిందే. బ్యాంకు మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.6,048 కోట్ల నుంచి రూ.8,704 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం కూడా 28 శాతం వృద్ధితో రూ.2,417 కోట్లకు చేరుకుంది. మార్జిన్లు స్థిరంగా 3.3%గా ఉన్నాయి. వడ్డీయేతర ఆదాయం 18% పెరిగి రూ.1,473 కోట్లుగా నమోదైంది. కాసా డిపాజిట్ల వాటా 33.8%కి తగ్గింది.
ఆస్తుల నాణ్యత క్షీణత
కార్పొరేట్ బాండ్లపై పెట్టుబడులకు సంబంధించి నష్టాలకు చేసిన కేటాయింపులే నికర లాభం తగ్గేలా చేశాయి. స్థూల ఎన్‌పీఏల రేషియో 1.6 శాతానికి పెరిగింది. జూన్ క్వార్టర్లో ఇది 1.31 శాతం కావడం గమనార్హం. నికర ఎన్‌పీఏలు సైతం జూన్ క్వార్టర్లో ఉన్న 0.59 శాతం నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో 0.84 శాతానికి చేరాయి.
బ్యాంకు రుణాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1.48 లక్షల కోట్ల నుంచి రూ.2.39 లక్షల కోట్లకు పెరిగాయి. రిటైల్ రుణాలు సైతం వార్షికంగా చూస్తే 103 శాతం పెరిగాయి. డిపాజిట్లలో వృద్ధి 41 శాతంగా ఉంది. తాజాగా రూ.1,631 కోట్ల ఎన్‌పీఏలు ఓ డైవర్సిఫైడ్ ఖాతాకు సంబంధించి జతయ్యాయి. ఓ సిమెంట్ కంపెనీ ఖాతా కూడా ఎన్‌పీఏగా మారింది. బ్యాంకు ప్రొవిజన్లు రూ.940 కోట్లకు పెరిగాయి.
రూ. 631 కోట్లు రికవరీకి అవకాశం
అయితే, ఒక ఖాతాకు సంబంధించి రూ.631 కోట్ల ఎన్‌పీఏ తదుపరి త్రైమాసికంలో రికవరీ అవుతుందని యస్‌బ్యాంకు సీనియర్ గ్రూపు ప్రెసిడెంట్ రజత్ మోంగా తెలిపారు. డైవర్సిఫైడ్ ఖాతాకు సంబంధించి ఆస్తుల విక్రయం మొదలైందని, అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో వసూలు అవుతాయని చెప్పారు. కొంత చెల్లింపులు ఇప్పటికే సెప్టెంబర్ 30 తర్వాత వచ్చినట్టు తెలిపారు. రాణాకపూర్ తర్వాత బ్యాంకుకు సారథ్యం వహించనున్నట్టు వినిపిస్తున్న పేర్లలో రజత్ మోంగా కూడా ఉండటం గమనార్హం.
కార్పొరేట్ బాండ్ల పోర్ట్‌ఫోలియోకు సంబంధించి రూ.252 కోట్లను ఎంటీఎం రూపంలో పక్కన పెట్టినట్టు మోంగా తెలిపారు. ‘‘2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్‌బీఐ తరఫున రిస్క్ ఆధారిత పర్యవేక్షణ జరగాల్సి ఉంది. ఇందులో ఏవైనా అంతరాలు పేర్కొంటే, నిర్ణీత పరిమితిని మించితే వాటిని వెల్లడించాల్సి ఉంది’’ అని మోంగా తెలిపారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్ గ్రూపు సంస్థలకు సంబంధించి బ్యాంకుకు రూ.2,600 కోట్ల ఎక్స్‌పోజర్ ఉందని, వీటికి ఎటువంటి కేటాయింపులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment