
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంకులకు భారీ షాకిచ్చింది. మొండిబకాయిల(ఎన్‌పీఏ)లపై చర్యలను ఆర్‌బీఐ వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌పీఐలపై తప్పుడు నివేదికలు, రెగ్యులేటర్ నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణలతో ఈ రెండు బ్యాంకులకు భారీ జరిమానా విధించింది. ఆదాయం గుర్తింపు ఆస్తి వర్గీకరణ (ఐఆర్ఏసీ) నిబంధనల ఆధారంగా జరిమానా విధించినట్టు ఆర్‌బీఐ చెప్పింది.
యథాతథ ఆస్తులను వర్గీకరించడంలో ఎస్ బ్యాంక్ విఫలమైందని ఆరోపించిన ఆర్‌బీఐ ఎస్‌బ్యాంక్‌కు రూ. 6 కోట్ల జరిమానా విధించింది. అలాగే ఎటీఎం సైబర్ భద్రతా అంశంపై సకాలంలో నివేదించలేదని ఆగ్రహించింది. మరోవైపు రెగ్యులేటర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఐడీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్ 2 కోట్ల రూపాయల జరిమానా విధించింది. రుణాల మంజూరు, పునరుద్ధరించే విషయంలో నిబంధనలను అనుసరించలేదని ఐడీఎఫ్‌సీపై ఆర్‌బీఐ ఆరోపించింది. డిసెంబర్ 31, 2016 నాటి బ్యాంక్ రిపోర్టు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. 2016 మార్చి లోపు ఎన్‌పీఏలను గుర్తించి, తమకు నివేదించాలని అక్టోబర్ 2015న దేశంలోని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే.
దీంతో బుధవారం నాటి మార్కెట్లో ఎస్‌బ్యాంక్, ఐడీఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులకు భారీ స్ఠాయిలో పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు దూసుకుపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment