న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణంతో దెబ్బతిన్న ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) మొండిబాకీలు జూలైలో స్వల్పంగా తగ్గాయి. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నుంచి రావాల్సిన బకాయిలు 1.8 శాతం మేర తగ్గి రూ. 15,175 కోట్లకు పరిమితమయ్యాయి. దాదాపు రూ. 25 లక్షలకు పైగా రుణాలు తీసుకుని డిఫాల్ట్ అయిన వారిని ఉద్దేశపూర్వక భారీ ఎగవేతదారులుగా పీఎన్‌బీ పరిగణిస్తోంది. జూన్ ఆఖరు నాటికి ఇలాంటి రుణగ్రహీతల నుంచి రూ. 15,355 కోట్లు రావాల్సి ఉండగా.. జూలై ఆఖరు నాటికి ఈ మొత్తం రూ. 15,175 కోట్లకు తగ్గింది. బ్యాంకు స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) రూ. 82,889 కోట్లుగా ఉన్నాయి.
పీఎన్‌బీ ఇచ్చిన మొత్తం రుణాల్లో వీటి వాటా 18.26 శాతం. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పీఎన్‌బీ రూ. 7,700 కోట్ల మేర బకాయిలను రాబట్టుకోగలిగింది. కేవలం పీఎన్‌బీ నుంచి భారీగా రుణాలు పొందిన సంస్థల్లో విన్‌సమ్ డైమండ్స్ అండ్ జ్యుయలరీ (సుమారు రూ. 900 కోట్లు), ఫరెవర్ ప్రెషియస్ జ్యుయలరీ అండ్ డైమండ్స్ (రూ. 748 కోట్లు), జూన్ డెవలపర్స్ (రూ. 410 కోట్లు) మొదలైనవి ఉన్నాయి. కన్సార్షియంలో భాగంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ (రూ. 597 కోట్లు), కుడోస్ కెమీ (రూ. 1,302 కోట్లు) వంటి సంస్థలకు కూడా భారీగానే రుణాలు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment