
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంకు నష్టాలు డిసెంబర్ త్రైమాసికంలో మరింత పెరిగాయి. ఈ కాలంలో బ్యాంకు రూ.578 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2017 డిసెంబర్ త్రైమాసికంలో ఈ నష్టం రూ.532 కోట్లుగా ఉంది. టర్నోవరు రూ.5,093 కోట్ల నుంచి రూ.5,322 కోట్లకు ఎగసింది. ఏప్రిల్– డిసెంబర్ కాలంలో మొత్తం రూ.15,663 కోట్ల టర్నోవరుపై రూ.1,552 కోట్ల నష్టం వచ్చినట్లు బ్యాంకు వెల్లడించింది.
మొండి బకాయిల కోసం చేసిన కేటాయింపులు రూ.1,749 కోట్ల నుంచి రూ.1,790 కోట్లకు చేరాయి. 2018 డిసెంబర్ నాటికి అడ్వాన్సుల్లో మొండి బకాయిల వాటా 14.26 నుంచి 16.68%కి పెరిగింది. స్థూల నిరర్ధక ఆస్తులు రూ.21,599 కోట్ల నుంచి రూ.28,703 కోట్లను తాకాయి. నికర నిరర్ధక ఆస్తులు 7.72% నుంచి 6.99%కి దిగొచ్చాయి. సోమవారం బీఎస్‌ఈలో ఆంధ్రా బ్యాంకు షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.42% తగ్గి రూ.23.95 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment