Bank Board
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు కొత్త చైర్మన్!
ముంబై, సాక్షి: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త ఏడాదిలో కొత్త చైర్మన్‌ను ఎంపిక చేసుకోనుంది. ప్రస్తుతం పార్ట్‌టైమ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న శ్యామలా గోపీనాధ్ పదవీకాలం 2021 జనవరి 1తో ముగియనుంది. దీంతో సోమవారం సమావేశమైన హెచ్డీఎఫ్సీ బ్యాంకు బోర్డు ఇందుకు అర్హులైనవారి పేరును రిజర్వ్ బ్యాంకుకు ప్రతిపాదించినట్లు తెలియజేసింది. అయితే పేరును వెల్లడించలేదు. ఆర్బీఐ అనుమతించిన వెంటనే బ్యాంక్ బోర్డు కొత్త చైర్మన్‌ను ఎంపిక చేసుకోనున్నట్లు పేర్కొంది. (హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. శశిధర్ ఎంపిక వెనుక!) 2015 నుంచీ ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ శ్యామలా గోపీనాధ్ 2015 జనవరి 2 నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పార్ట్‌టైమ్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్బీఐ నుంచి అనుమతి వచ్చిన వెంటనే కొత్త చైర్మన్‌ను ఎంపిక చేసుకోనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సమాచారమిచ్చింది. కాగా.. కొత్త అభ్యర్థికి బాధ్యతలు అప్పగించేటంత వరకూ తాత్కాలిక చైర్మన్‌గా విధులు నిర్వహించేందుకు బోర్డు నుంచి స్వతంత్ర డైరెక్టర్లలో ఒకరిని ఎంపిక చేసుకోనున్నట్లు బ్యాంకు వర్గాలు తెలియజేశాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో కొత్త సీఈవోగా శశిధర్ జగదీశన్ బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే. 25 ఏళ్లుగా హెచ్డీఎఫ్సీ బ్యాంకును ముందుండి నడిపించిన ఆదిత్య పురీ స్థానే శశిధర్ ఎంపికయ్యారు. పురీ సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేశారు. -
విత్‌డ్రాయల్స్ ఆంక్షలు, ఆర్బీఐ గుప్పిట్లో ‘యస్’!
న్యూఢిల్లీ: కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, మొండిబాకీల భారం, నిధుల కొరత కష్టాలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ కొరడా ఝుళిపించింది. బ్యాంక్ బోర్డును రద్దు చేయడంతో పాటు ఖాతాదారులకు షాక్‌నిచ్చేలా విత్డ్రాయల్స్పై పరిమితులు విధించింది. ఖాతాదారులకు రూ. 50,000కు మించి చెల్లింపులు జరపకుండా 30 రోజుల మారటోరియం విధిస్తూ ఆర్బీఐ గురువారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 5 నుంచి అమల్లోకి వచ్చిన మారటోరియం ఏప్రిల్ 3 దాకా కొనసాగుతుంది. వైద్యం, ఉన్నత విద్య, వివాహం వంటి అత్యవసర సందర్భాల్లో మాత్రమే రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. అటు యస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిన నేపథ్యంలో బోర్డును కూడా రద్దు చేసిన ఆర్బీఐ.. ప్రభుత్వ రంగ ఎస్బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. భారీ స్కామ్‌తో కుదేలైన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకుపైనా ఆర్బీఐ కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఆంక్షలే విధించింది. అది జరిగిన 6 నెలల వ్యవధిలోనే యస్ బ్యాంక్‌పైనా రిజర్వ్ బ్యాంక్ అటువంటి చర్యలే తీసుకోవడం గమనార్హం. ఆందోళన వద్దు .. డిపాజిట్లు భద్రమే.. మొండిబాకీల భారం, డిపాజిట్ల విత్‌డ్రాయల్స్, రేటింగ్ డౌన్‌గ్రేడ్స్ వంటి పలు ప్రతికూల అంశాలతో బ్యాంకు పరిస్థితి నానాటికి దిగజారిందని ఆర్బీఐ పేర్కొంది. ‘పరిస్థితి చక్కదిద్దుకోవడానికి, విశ్వసనీయమైన పునరుద్ధరణ ప్రణాళికతో నిధులు సమీకరించుకోవడానికి యస్ బ్యాంక్ మేనేజ్మెంట్కు తగినన్ని అవకాశాలు ఇచ్చాం. కానీ ప్రణాళికలు అమలు చేయడంలో అది విఫలమైంది. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత.. ఖాతాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం యస్ బ్యాంకుపై మారటోరియం విధించాలంటూ ప్రభుత్వానికి సూచించడం మినహా మరో మార్గాంతరం లేదని భావించాం. తదనుగుణంగానే కేంద్రం నిర్ణయం తీసుకుంది‘ అని ఆర్బీఐ పేర్కొంది. ఖాతాదారులు ఆందోళన చెందనక్కర్లేదన్న ఆర్బీఐ.. డిపాజిట్లు భద్రంగానే ఉంటాయని, డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడతామని భరోసానిచ్చింది. బ్యాంకింగ్ రంగ నియంత్రణ చట్ట నిబంధనల ప్రకారం యస్ బ్యాంక్ పునరుద్ధరణ లేదా మరో బ్యాంకులో విలీనం చేయడానికి సంబంధించి త్వరలోనే తగు ప్రణాళికను రూపొందిస్తామని ఆర్బీఐ పేర్కొంది. డిపాజిటర్లు సుదీర్ఘకాలం ఇబ్బందులు పడకుండా మారటోరియం ముగిసేలోగానే దీన్ని అమలు చేస్తామని తెలిపింది. ఎస్బీఐ చేతికి..? ఎల్ఐసీతో కలిసి టేకోవర్ వార్తలు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు.. యస్ బ్యాంక్‌ను ఎల్ఐసీతో కలిసి ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని కన్సార్షియం టేకోవర్ చేయనుందంటూ వార్తలు వచ్చాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కన్సార్షియం మొత్తం 49 శాతం వాటాలు కొనేలా ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. నియంత్రణాధికారాలు దక్కే స్థాయిలో వాటాలు కొనుగోలు చేసేందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా రావొచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గురువారం ముంబైలో ఎస్బీఐ బోర్డు సమావేశం కావడం ఈ వార్తలకు ఊతమిచ్చింది. యస్ బ్యాంక్ మూతబడే పరిస్థితి ఉండబోదంటూ ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యలు చేసిన కొన్నాళ్లకే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొటక్ మహీంద్రా వంటి ప్రైవేట్ దిగ్గజ బ్యాంకులు.. యస్ బ్యాంక్‌ను టేకోవర్ చేసేందుకు అనువైనవంటూ గతంలో ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ వార్తలపై వివరణనివ్వాలంటూ ఎస్బీఐ, యస్ బ్యాంకులకు స్టాక్ ఎక్సే్చంజీలు సూచించాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం అలాంటి పరిణామాలేమైనా ఉన్న పక్షంలో వెల్లడిస్తామంటూ ఎస్బీఐ తెలియజేసింది. అటు యస్ బ్యాంక్ కూడా .. ఇప్పటిదాకా తమకు దీనిపై ఆర్బీఐ లేదా ప్రభుత్వం లేదా ఇతరత్రా నియంత్రణ సంస్థలు, ఎస్బీఐ నుంచి ఏ విధమైన సమాచారమూ రాలేదని తెలిపింది. అటు, బ్రోకరేజీ సంస్థలు మాత్రం యస్ బ్యాంక్ పరిస్థితి ఆశావహంగా లేదంటూ వ్యాఖ్యానించాయి. ఒకవేళ ఇన్వెస్టర్లకు బలవంతంగా అంటగట్టినా.. మొండిబాకీల రిస్కులు భారీగా ఉన్నందున బ్యాంకు విలువను సున్నా కింద లెక్కగట్టి తీసుకోవడమే జరగవచ్చని జేపీ మోర్గాన్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ‘యస్’ నుంచి ‘నో’ వరకూ...! ► జూన్ 12, 2018: యస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓగా మూడేళ్లపాటు రాణా కపూర్ పునర్నియామకానికి వాటాదారుల ఆమోదం ► సెప్టెంబర్ 19, 2018: రాణా కపూర్ పదవీ కాలాన్ని జనవరి 31,2019 వరకే తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ► సెప్టెంబర్ 21, 2018: యస్ బ్యాంక్ షేర్ ఒకే రోజు 30 శాతం పతనం, రూ.21,951 కోట్ల మార్కెట్ క్యాప్ ఆవిరి ► సెప్టెంబర్ 28, 2018: ప్రమోటర్ షేర్లను విక్రయించబోనని, కూతుళ్లకు ఇచ్చేస్తానని రాణా కపూర్ ప్రకటన. యస్ బ్యాంక్ డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కు క్రెడిట్ వాచ్ రేటింగ్‌ను ఇస్తున్నామని కేర్ రేటింగ్స్ వెల్లడి ► అక్టోబర్ 17, 2018: రాణా కపూర్‌కు మరింత గడువును ఇవ్వడానికి నిరాకరించిన ఆర్బీఐ. 2019, ఫిబ్రవరి 1 కల్లా కొత్త సీఈఓను నియమించుకోవాలని ఆదేశం ► అక్టోబర్ 25, 2018: గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి. మార్క్‌టు మార్కెట్ నష్టాలు రెట్టింపు కావడం, మొండి బకాయిలకు కేటాయింపులు అధికంగా ఉండటంతో ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. రుణ నాణ్యత భారీగా క్షీణించింది. ► నవంబర్ 14, 2018: చైర్మన్ పదవికి అశోక్ చావ్లా రాజీనామా. ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలగిన వసంత్ గుజరాతీ ► నవంబర్ 19, 2018: మరో ఇండిపెండెంట్ డైరెక్టర్ రెంటాల చంద్రశేఖర్ రాజీనామా ► నవంబర్ 27, 2018: యస్ బ్యాంక్ రేటింగ్‌ను డౌన్ గ్రేడ్‌చేసిన మూడీస్ సంస్థ. ► మార్చి 1, 2019: యస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన రవ్నీత్ గిల్. 3 శాతం ఎగసిన షేర్ ధర ► మార్చి 5, 2019: స్విఫ్ట్ కార్యకలాపాల విషయంలో నిబంధనలు పాటించనందుకు రూ. 1 కోటి జరిమానా విధించిన ఆర్బీఐ ► ఏప్రిల్ 26, 2019: గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఆర్థిక ఫలితాలు వెల్లడి. రూ.1,507 కోట్ల నికర నష్టాలు ► ఏప్రిల్ 29, 2019: యస్ బ్యాంక్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసిన మాక్వైరీ బ్రోకరేజ్ సంస్థ. ► ఏప్రిల్ 30, 2019: క్యూ4 ఫలితాల ప్రభావంతో 30% పతనమైన షేర్ ► మే 9, 2019: యస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ రేటింగ్‌ను ప్రధాన రేటింగ్ ఏజెన్సీలైన ఇండియా రేటింగ్స్, ఇక్రాలు డౌన్ గ్రేడ్ చేశాయి. ► మే 15, 2019: యస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్‌లో అదనపు డైరెక్టర్‌గా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ నియామకం ► జూలై 18, 2019: రాణా కపూర్ తన పూర్తి వాటా షేర్లను తనఖా పెట్టారన్న వార్తలు వచ్చాయి. భారీగా పతనమైన బ్యాంక్ షేర్ ► ఆగస్టు 10, 2019: సీఎఫ్ఓగా అనురాగ్ అద్లాఖ నియామకం ► సెప్టెంబర్ 21, 2019: యస్ బ్యాంక్‌లో 2.75 శాతం వాటా విక్రయించిన రాణా కపూర్. 6.89 శాతానికి తగ్గిన వాటా ► అక్టోబర్ 3, 2019: యస్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ రజత్ మోంగా రాజీనామా ► నవంబర్ 1, 2019: ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.600 కోట్ల నష్టాలు ► డిసెంబర్ 6, 2019: యస్ బ్యాంక్‌కు నెగిటివ్ అవుట్ లుక్ ఇచ్చిన రేటింగ్ ఏజెన్సీ మూడీస్. 9 శాతానికి పైగా పతనమైన షేర్ ధర ► డిసెంబర్ 17, 2019: కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో యస్ బ్యాంక్ విలీనం కానున్నదని వినిపించిన వార్తలు ► జనవరి 10, 2020: కార్పొరేట్ గవర్నెన్స్ సరిగ్గా లేదంటూ రాజీనామా చేసిన బోర్డ్ మెంటర్ ఉత్తమ్ ప్రకాశ్ రాజీనామా ► జనవరి 13, 2020: ఇన్సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకుందని, ఈ విషయమై సెబీ దర్యాప్తు చేయాలని లేఖ రాసిన ఉత్తమ్ ప్రకాశ్ అగర్వాల్. 6 శాతం పతనమైన షేర్ ధర ► మార్చి 5, 2020: ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియమ్... యస్ బ్యాంక్‌లో వాటా కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని వార్తలు. 26 శాతం లాభంతో రూ.36.85కు ఎగసిన షేర్. షేరు టార్గెట్ @ రూ. 1 అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, జేపీ మోర్గాన్ యస్ బ్యాంక్ షేర్ టార్గెట్ ధరను రూ.1కు (గతంలో రూ.55)కు తగ్గించింది. రేటింగ్‌ను అండర్ వెయిట్‌గా కొనసాగించింది. ప్రస్తుత ధర (రూ.37)కు బాగా ఎక్కువ డిస్కౌంట్‌కు కొత్త మూలధనం లభించే అవకాశాలున్నందున టార్గెట్ ధరను రూ.1కు తగ్గిస్తున్నామని జేపీ మోర్గాన్ వివరించింది. గురువారం 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయిన యస్ బ్యాంక్ షేరు.. ఆ తర్వాత టేకోవర్ వార్తలతో బీఎస్ఈలో 26% పెరిగి రూ.36.85 వద్ద క్లోజయ్యింది. -
ఐసీఐసీఐ బ్యాంక్ : తెరపైకి వచ్చిన మరో వివాదం
ముంబై : వీడియోకాన్ రుణ కేసుతో ఇప్పటికే తీవ్ర చిక్కుల్లో పడిన ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ మరో వివాదంలో కూరుకుపోతోంది. వీడియోకాన్ రుణ కేసు వివాదంతో ఈ బ్యాంక్ సీఈవో చందాకొచ్చర్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. తాజాగా రుణాల రైటాఫ్ ఇష్యూ తెరపైకి వచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజ్మెంట్ 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.5000 కోట్ల నుంచి రూ.5600 కోట్ల వరకు అనుమానస్పద కార్పొరేట్ రుణాలను రైటాఫ్ చేసినట్టు వెల్లడైంది. టెక్నికల్‌గా ఈ రైటాఫ్‌లు, అకౌంటింగ్ పాలసీని మారడం వల్లనే సాధ్యపడుతుందని మింట్ రిపోర్టు చేసింది. రుణాలను రైటాఫ్ చేసేందుకు అకౌంటింగ్ పాలసీని మారుస్తూ కొత్త అకౌంటింగ్ పాలసీని తీసుకొచ్చేందుకు బ్యాంక్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించారని, అయితే ఆ విషయాన్ని బ్యాంక్ వాటాదారులకు, ప్రజలకు తెలుపలేదని మింట్ రిపోర్టు వెల్లడించింది. ఇది అకౌంటింగ్ స్టాండర్డ్(ఏఎస్) నిబంధనలకు తూట్లు పొడిచినట్టే అవుతుందని తెలిసింది. వీడియోకాన్ రుణ వివాద కేసులో సీఈవో చందా కొచర్‌పై జరుగుతున్న విచారణ నేపథ్యంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఈవోపై విచారణతో పాటు బ్యాంక్ అంతకముందు జరిపిన డీలింగ్స్‌ను దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ అకౌంటింగ్ పాలసీ మార్పు విషయం వెలుగులోకి వచ్చింది. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో మొండిబకాయిల రేషియోను తక్కువగా చూపించేందుకు బ్యాంకు కొత్త అకౌంటింగ్ పాలసీని తీసుకొచ్చిందని ఆ న్యూస్‌పేపర్ వివరించింది. 2017 ఆర్థిక సంవత్సరంలో ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)లు 7.89 శాతంగా ఉన్నాయి. ఒకవేళ కొత్త అకౌంటింగ్ పాలసీ తీసుకురాకపోతే, ఆ ఎన్పీఏలు 8.5 శాతానికి పైన ఉండేవని పేర్కొంది. అయితే ఏ లిస్టెడ్ కంపెనీ అయినా.. బ్యాంక్ అయినా.. తన అకౌంటింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్(ఏఎస్) నిబంధనలను ఉల్లంఘించకుండా.. కచ్చితంగా అనుసరించాల్సి ఉంటుందని ఓ సీనియర్ రెగ్యులేటరీ అధికారి చెప్పారు. అకౌంటింగ్ పాలసీలో ఏదైనా మార్పులు చేపట్టాల్సి వస్తే, కచ్చితంగా ప్రజలకు, వాటాదారులకు ఈ నిర్ణయాన్ని తెలుపాల్సి ఉంటుందని తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలన్నా, డిస్‌ఇన్వెస్టింగ్ చేయాలన్నా ప్రజలకు, వాటాదారులకు తెలుపాల్సిన బాధ్యత బ్యాంక్ బోర్డుపై ఉందన్నారు. కానీ ఐసీఐసీఐ బ్యాంక్ 2017 ఏప్రిల్ 7న ఆమోదించిన కొత్త అకౌంటింగ్ పాలసీపై ఎవరికి తెలుపలేదని వెల్లడించారు. అయితే అకౌంటింగ్ పాలసీ మార్చిన విషయాన్ని తెలుపకుండా.. చందా కొచ్చర్ కేవలం రైటాఫ్ విషయాన్ని మాత్రమే 2017 ఏప్రిల్ 7న జరిగిన బోర్డు మీటింగ్ నోట్లో పేర్కొన్నారు. -
ఐసీఐసీఐ స్కాం: ప్రభుత్వ కీలక చర్య
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ వివాదంలో ప్రభుత్వం కీలక చర్య చేపట్టింది. ఐసీఐసీఐ బోర్డు నామినీని తొలగించింది. ఈ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించింది. బ్యాంకు బోర్డులో ప్రభుత్వ నామినీ డైరెక్టర్‌గా ఉన్న అమిత్ అగర్వాల్ స్థానంలో లోక్ రంజన్‌ను నియమించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం జాయింట్ సెక్రటరీగా ఉన్న రంజన్ నియమాకం ఏప్రిల్ 5నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకుకు సమాచారం అందించింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన భారీ కుంభకోణం, ఇతర పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మరోవైపు 3,250 కోట్ల రూపాయల స్కాం ఆరోపణలపై రంగంలోకి దిగిన సీబీఐ.. చందా కొచ్చర్ భర్త, దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌పై ప్రాథమిక విచారణ చేపట్టింది. అటు ఈ వివాదంలో అవిస్టా సంస్థపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మూడురోజుల క్రితం ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న దీపక్ కొచ్చర్ సోదరుడు విజయ్ కొచ్చర్‌ను శనివారం కూడా విచారిస్తోంది. -
చందాకొచర్‌కు ఐసీఐసీఐ బోర్డు బాసట
న్యూఢిల్లీ: రుణాల మంజూరు విషయంలో వీడియోకాన్ గ్రూప్‌నకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్‌కు బ్యాంకు బోర్డు బాసటగా నిల్చింది. ఇవన్నీ దురుద్దేశపూర్వకమైన, నిరాధారమైన వదంతులేనని స్పష్టం చేసింది. కొచర్‌పై తమకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని పేర్కొంది. రుణాలను ఆమోదించే విషయంలో తమ బ్యాంకు అంతర్గత వ్యవస్థ పటిష్టంగా ఉందని బోర్డు పేర్కొంది. క్విడ్ ప్రో కో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలివ్వడం ద్వారా కొచర్, ఆమె కుటుంబీకులు లబ్ధి పొందారంటూ ఒక వెబ్సైట్లో వార్తలొచ్చిన నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు ఈ మేరకు వివరణనిచ్చింది. ఆరోపణల్లో పేర్కొంటున్నట్లుగా వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలిచ్చినందుకు చందా కొచర్ ఎటువంటి లబ్ధి పొందలేదని.. ఈ వ్యవహారంలో క్విడ్ ప్రో కో గానీ ఆశ్రిత పక్షపాతం గానీ స్వార్థ ప్రయోజనాలు గానీ లేవని స్పష్టం చేసింది. బ్యాంకు, టాప్ మేనేజ్మెంటును అప్రతిష్ట పాలు చేసేందుకే కొన్ని స్వార్థ శక్తులు వదంతులను వ్యాపింపచేస్తున్నాయని బోర్డు తెలిపింది. 2012 ఏప్రిల్‌లో వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలిచ్చిన కన్సార్షియంలో తమది లీడ్ బ్యాంక్ కూడా కాదని పేర్కొంది. కన్సార్షియంలో భాగంగానే సుమారు రూ.3,250 కోట్లు ఇవ్వడం జరిగిందని, ఇది కన్సార్షియం ఇచ్చిన మొత్తం రుణంలో 10 శాతం కన్నా తక్కువేనని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
బ్యాంక్ బోర్డు చింపింది మా కార్యకర్తలే
అనంతపురం అర్బన్ : ఐసీఐసీఐ బ్యాంకు వద్ద ఈ నెల 22న ధర్నా చేస్తున్న క్రమంలో బ్యాంక్ బోర్డుని చించివేసింది తమ పార్టీ కార్యకర్తలేనని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ అన్నారు. శనివారం స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.నోట్ల రద్దు కారణంగా పేద, సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపద్యంలో రాష్ట్ర సమితి పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద ధర్నా చేసేందుకు వెళితే, బ్యాంకర్లు తమని దొంగల మాదిరిగా చూస్తూ షెటర్లు వేశారన్నారు. మా విన్నపాన్ని స్వీకరించకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనై బ్యాంక్ పేరు బోర్డుపై దాడి చేయాల్సి వచ్చిందన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ప్రజల పక్షాన పోరాడే క్రమంలో ఎన్ని కేసులు బకాయించినా, జైలుకి పంపినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. నోట్ల రద్దుపై జనవరి 3 నుంచి 10 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బ్యాంకుల వద్ద ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం ప్రజలకు అవసరమైన మేరకు చిల్లర నోట్లను పంపిణీ చేయకుండా శ్రీమంతులు, కార్పొరేట్ శక్తులకు ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా నోట్లు తరలిస్తున్నారన్నారు. ఈ వర్గాలకు ప్రైవేటు బ్యాంకులపై సహకరిస్తున్నాయన్నారు. ఇవే చర్యలు కొనసాగితే ప్రైవేటు బ్యాంకులపై దాడులను కొనసాగిస్తామని, ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 26న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం : సీపీఐ 91వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ నెల 26న జిల్లాలోని పార్టీ శాఖల్లో ఘనంగా నిర్వహించాలని నాయకులకు జగదీశ్ పిలుపునిచ్చారు. అనంతపురం, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హాజరవుతాన్నారు. -
ఎన్పీఏల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం!
బీబీబీ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడి న్యూఢిల్లీ: ఆందోళనకరంగా ఉన్న బ్యాంకింగ్ మొండిబకాయిల (ఎన్పీఏ) పరిష్కారానికి ఒక ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయనున్నట్లు బ్యాంక్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) చీఫ్ వినోద్ రాయ్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారమవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన రాయ్, ఈ దిశలో ఒక ‘ఇంటర్మీడియట్ మెకానిజం’ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారంలో బ్యాంక్ మేనేజ్మెంట్కు కూడా ఈ యంత్రాంగం తగిన సౌలభ్యం కల్పిస్తుందని ఆయన తెలిపారు. వివిధ బ్యాంకులకు సంబంధించి ఎన్పీఏల సమస్య పరిష్కారంలో అనుసరించాల్సిన ప్రక్రియను విశ్లేషించి, అమలు చేయడంపై ప్రతిపాదిత యంత్రాగం కృషి చేస్తుందని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రాయ్ పేర్కొన్నారు. ఒక మొండిబకాయిలకు సంబంధించి ప్రైసింగ్ నిర్ణయం విషయంలో సైతం ఈ యంత్రాంగం బ్యాంకింగ్‌కు సహకరిస్తుందని అన్నారు. అయితే ఈ యంత్రాంగం ఎప్పుటి నుంచీ అమల్లోకి వస్తుందన్న ప్రశ్నకు మాత్రం ఆయన నిర్ధిష్ట సమాధానం చెప్పలేదు. యంత్రాంగం విధివిధాన ప్రక్రియ మొత్తం పదిహేను రోజుల్లో పూర్తవుతుందని మాత్రం సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు అవకాశం ఉందా అన్న ప్రశ్నకు రాయ్ సమాధానం ఇస్తూ... మొండి బకాయిల పరిష్కారం, రుణ ప్రక్రియలో పారదర్శకత, ఖాళీల భర్తీ తొలి ప్రాధాన్యతలని వివరించారు. అనంతరమే హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు, బ్యాంకుల విలీనం వంటి అంశాల పరిశీలన జరుగుతుందని తెలిపారు. జాయింట్ లెండింగ్పై త్వరలో మార్గదర్శకాలు! బ్యాంకుల జాయింట్ లెండింగ్ అంశంపై అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఆర్బీఐ రూపొందిస్తున్నట్లు తెలిపారు. మొండిబకాయిల పరిష్కారం అంశంలో న్యాయ ప్రక్రియ అడ్డంకి అవుతుందన్న భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు తగిన సమయంలో అన్ని వ్యవస్థలూ తగిన విధంగా పనిచేస్తాయన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు.