ఎన్పీఏల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం!
బీబీబీ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడి
న్యూఢిల్లీ: ఆందోళనకరంగా ఉన్న బ్యాంకింగ్ మొండిబకాయిల (ఎన్‌పీఏ) పరిష్కారానికి ఒక ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయనున్నట్లు బ్యాంక్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) చీఫ్ వినోద్ రాయ్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారమవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన రాయ్, ఈ దిశలో ఒక ‘ఇంటర్మీడియట్ మెకానిజం’ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారంలో బ్యాంక్ మేనేజ్‌మెంట్‌కు కూడా ఈ యంత్రాంగం తగిన సౌలభ్యం కల్పిస్తుందని ఆయన తెలిపారు. వివిధ బ్యాంకులకు సంబంధించి ఎన్‌పీఏల సమస్య పరిష్కారంలో అనుసరించాల్సిన ప్రక్రియను విశ్లేషించి, అమలు చేయడంపై ప్రతిపాదిత యంత్రాగం కృషి చేస్తుందని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రాయ్ పేర్కొన్నారు.
ఒక మొండిబకాయిలకు సంబంధించి ప్రైసింగ్ నిర్ణయం విషయంలో సైతం ఈ యంత్రాంగం బ్యాంకింగ్‌కు సహకరిస్తుందని అన్నారు. అయితే ఈ యంత్రాంగం ఎప్పుటి నుంచీ అమల్లోకి వస్తుందన్న ప్రశ్నకు మాత్రం ఆయన నిర్ధిష్ట సమాధానం చెప్పలేదు. యంత్రాంగం విధివిధాన ప్రక్రియ మొత్తం పదిహేను రోజుల్లో పూర్తవుతుందని మాత్రం సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు అవకాశం ఉందా అన్న ప్రశ్నకు రాయ్ సమాధానం ఇస్తూ... మొండి బకాయిల పరిష్కారం, రుణ ప్రక్రియలో పారదర్శకత, ఖాళీల భర్తీ తొలి ప్రాధాన్యతలని వివరించారు. అనంతరమే హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు, బ్యాంకుల విలీనం వంటి అంశాల పరిశీలన జరుగుతుందని తెలిపారు.
జాయింట్ లెండింగ్‌పై త్వరలో మార్గదర్శకాలు!
బ్యాంకుల జాయింట్ లెండింగ్ అంశంపై అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఆర్‌బీఐ రూపొందిస్తున్నట్లు తెలిపారు. మొండిబకాయిల పరిష్కారం అంశంలో న్యాయ ప్రక్రియ అడ్డంకి అవుతుందన్న భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు తగిన సమయంలో అన్ని వ్యవస్థలూ తగిన విధంగా పనిచేస్తాయన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు.