అనంతపురం అర్బన్ : ఐసీఐసీఐ బ్యాంకు వద్ద ఈ నెల 22న ధర్నా చేస్తున్న క్రమంలో బ్యాంక్ బోర్డుని చించివేసింది తమ పార్టీ కార్యకర్తలేనని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ అన్నారు. శనివారం స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.నోట్ల రద్దు కారణంగా పేద, సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపద్యంలో రాష్ట్ర సమితి పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద ధర్నా చేసేందుకు వెళితే, బ్యాంకర్లు తమని దొంగల మాదిరిగా చూస్తూ షెటర్లు వేశారన్నారు. మా విన్నపాన్ని స్వీకరించకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనై బ్యాంక్ పేరు బోర్డుపై దాడి చేయాల్సి వచ్చిందన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.
ప్రజల పక్షాన పోరాడే క్రమంలో ఎన్ని కేసులు బకాయించినా, జైలుకి పంపినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. నోట్ల రద్దుపై జనవరి 3 నుంచి 10 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బ్యాంకుల వద్ద ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం ప్రజలకు అవసరమైన మేరకు చిల్లర నోట్లను పంపిణీ చేయకుండా శ్రీమంతులు, కార్పొరేట్ శక్తులకు ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా నోట్లు తరలిస్తున్నారన్నారు. ఈ వర్గాలకు ప్రైవేటు బ్యాంకులపై సహకరిస్తున్నాయన్నారు. ఇవే చర్యలు కొనసాగితే ప్రైవేటు బ్యాంకులపై దాడులను కొనసాగిస్తామని, ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
26న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం : సీపీఐ 91వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ నెల 26న జిల్లాలోని పార్టీ శాఖల్లో ఘనంగా నిర్వహించాలని నాయకులకు జగదీశ్ పిలుపునిచ్చారు. అనంతపురం, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హాజరవుతాన్నారు.
బ్యాంక్ బోర్డు చింపింది మా కార్యకర్తలే
Published Sat, Dec 24 2016 11:25 PM | Last Updated on Mon, Aug 13 2018 6:24 PM
Advertisement
Advertisement