‘మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి’
అనంతపురం అర్బన్ : జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తున్న హామీలు చేతల్లో చూపకపోతే ప్రజలు నమ్మరని వామపక్ష పార్టీ నాయకులు అన్నారు. ఇప్పటి వరకు జిల్లాకు ఇచ్చిన వాటిలో ఏ ఒక్క హామీ అమలు కాలేదని, అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలకు అదే గతి పట్టించారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకి ఏ మాత్రం నిజాయితీ ఉన్నా తన హామీలను ఆచరణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో మంగళవారం సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, ఎస్‌యూసీఐ(సీ) జిల్లా కార్యదర్శులు డి.జగదీశ్, వి.రాంభూపాల్, సి.పెద్దన్న, ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, అమర్‌నాథ్ మాట్లాడారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాకు రూ.6,554 కోట్ల ప్యాకేజీని చంద్రబాబు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రజల్ని మభ్యపెట్టడానికో, మోసగించేందుకో చంద్రబాబు మాటలు చెబితే సరిపోదని, ఈ మొత్తాన్ని బడ్జెట్‌లో చూపించడంతో పాటు, నిధులు కేటాయించి, నిర్ధిష్ట గడువు విధించి అమలు చేసినప్పుడు సీఎం స్థాయికి, స్వాతంత్య్ర దినోత్సవ వేదికకు విలువ ఉంటుందన్నారు. గతంలో కర్నూలులో వేడుకలు నిర్వహించిన సందర్భంలో అక్కడ ఇచ్చిన హామీల్లో ఊర్దూ యూనివర్సిటీ తప్ప ఏ ఒక్కటీ అమలు కాలేదని గుర్తు చేశారు.
అలాగే ఎన్టీఆర్ ఆశయమైన హంద్రీ–నీవా ప్రాజెక్టు, హెచ్‌ఎల్‌సీ ఆధునికీకరణ అంశాలను ప్రస్తావించలేదని, పారిశ్రామికాభివృద్ధికి జిల్లాలో 1.72 లక్షల ఎకరాలు సేకరించారని, అయితే ఇప్పటి వరకు పదెకరాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు కాలేదన్నారు. బెల్ కంపెనీకి శంకుస్థాపన చేసి 18 నెలలు గుడుస్తున్నా కనీసం ప్రహరీ నిర్మాణం కాలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద జిల్లాకు కేంద్రం ఇచ్చిన రూ.100 కోట్లను జిల్లా అభివృద్ధికి ఖర్చు చేయకుండా పక్కదారి పట్టించారని విమర్శించారు. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన ప్యాకేజీని అమలు చేయకపోతే ప్రజా ఉద్యమం నిర్మిస్తామని హెచ్చరించారు.