హక్కులపై ఉక్కుపాదం!
రాజధానిలో ధర్నాల్లేవ్... నిరసనల్లేవ్ !
- పోలీసులకు స్పష్టం చేసిన చంద్రబాబు ?
- ధర్నా చౌక్‌లోనూ అనుమతి నిరాకరణ
- స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమాను కలవాలట
- టీడీపీ సర్కారు నిరంకుశ ధోరణితో బెంబేలు
రాజధానిలో ప్రజాస్వామ్య హక్కులపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిరసన తెలిపే రాజ్యాంగబద్ధ హక్కును కాలరాస్తోంది. రాజధాని ప్రాంతంలో ధర్నాలు లేకుండా చూడాలని పోలీసులకు హుకుం జారీ చేసింది. ఈ అంశంలో సర్వాధికారాలను
అనధికారికంగా టీడీపీ ప్రజాప్రతినిధులకు కట్టబెట్టింది. అన్యాయంపై గొంతెత్తి నినదించే పరిస్థితి లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తోంది.
సాక్షి, అమరావతి బ్యూరో : తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధానిలో ఎలాంటి నిరసన ప్రదర్శనలు జరగకూడదని సీఎం చంద్రబాబు పోలీసులకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని చూసుకోవాలని టీడీపీ ప్రజాప్రతినిధులకు కూడా సూచించారు. విజయవాడలో ధర్నాలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ధర్నా చౌక్‌లో కూడా నిరసనకు అనుమతించకపోవడం విడ్డూరంగా ఉంది. అక్కడ ఏ ధర్నా చేయాలన్న స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమా అనుమతి తీసుకోవాలని పోలీసులు చెబు తుండటం గమనార్హం. జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లోనూ పరిస్థితి దాదాపు ఇంతే. తప్పనిసరి పరిస్థితుల్లో ధర్నా, నిరసనలకు అనుమతిస్తూనే పోలీసులు వాటిని తమదైన శైలిలో అడ్డుకుంటున్నారు. అందుకు కొన్ని తార్కాణాలు ఇవిగో ...
► రాష్ట్రవైశ్య ఫెడరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండుతో ఆ సంఘాల ప్రతినిధులు విజయవాడలో ఈ నెల 5న ధర్నా నిర్వహణకు అనుమతి కోరారు. పోలీసులు స్పందిస్తూ ఆ ధర్నాలో వైశ్య వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పాల్గొనకూడదని షరతు విధించారు. విషయం తెలిసిన శ్రీనివాస్ తన వల్ల సంఘ కార్యక్రమం ఎందుకు నిలిచిపోవడమని భావించారు. తాను ధర్నాలో పాల్గొనను అని వైశ్య సంఘం ప్రతినిధులకు తెలిపారు. అయినా పోలీసులను మాత్రం సందేహం వీడలేదు. వెలంపల్లి శ్రీనివాస్ వస్తే అరెస్టు చేసేందుకు ధర్నా చౌక్ వద్ద దాదాపు 100 మంది పోలీసులు మోహరించారు.
► విజయవాడ ధర్నా చౌక్‌లో గత నెల 27, 28 తేదీలలో ధర్నాకు రాష్ట్ర రజకసంఘం అధ్యక్షుడు అంజిబాబు పోలీసుల అనుమతి కోరారు. మౌఖికంగా అనుమతిచ్చిన పోలీసులు చివరి నిమిషంలో మాట మార్చారు. ఓసారి ఎమ్మెల్యే బొండా ఉమాను కలిసి అనుమతి తీసు కోవాలని చెప్పారు. అనుమతివ్వాల్సిందిగా పోలీసులు గానీ, ఎమ్మెల్యే కాదు కదా అని ఆయన చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో అంజిబాబు తన సంఘ ప్రతినిధులతో కలసి ఎమ్మెల్యే బొండా ఉమా నివాసానికి వెళ్లారు. మూడు గంటలకుపైగా వేచిఉన్న తరువాతే ఎమ్మెల్యే వారిని లోపలకు అనుమతించారు. అంతేకాక, ధర్నా ఎందుకు చేస్తారని ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు కంగుతిన్నారు. ఓ దశలో ఎమ్మెల్యే పరుష పదజాలం ఉపయోగించడంతో రజక సంఘం ప్రతినిధులు కొందరు తీవ్రంగా స్పందించారు. ఆ తరువాత 27న ధర్నా చేస్తున్న రజక సంఘం ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. సంఘం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. రాష్ట్ర అధ్యక్షుడు అంజిబాబును అరెస్టు చేసి పమిడిముక్కల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమాచారం తెలిసి కొలనుకొండ శివాజీ తదితరులు నిరసన తెలిపేందుకు యత్నించగా వారినీ అడ్డుకున్నారు. ఆయన్ను ఉంగుటూరు పోలీస్‌స్టేషన్‌ను తరలించారు. రజకుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాష్ట్ర రజక సంఘం విజయవాడలో ధర్నా చేయాలని భావించింది.
► ఎస్సీల భూముల్లో ఆక్రమణను తొలగించి, వారికి భూములు పంపిణీ చేయాలన్న వామపక్ష పార్టీల ఆందోళనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గుడివాడ నియోజకవర్గం ఇలపర్రులో ఎస్సీలకు కేటాయించిన భూములు కబ్జాకు గురయ్యాయి. ఆ ఆక్రమణను తొలగించి ఎస్సీలకు భూములు పంపిణీ చేయాలనే డిమాండుతో ధర్నా నిర్వహణకు సీపీఎం, సీపీఐ అనుమతి కోరాయి. పోలీసులు అనుమతివ్వలేదు. దాంతో ఈ నెల 4న వామపక్ష పార్టీలు ఆర్డీవో కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి. పోలీసులు అమానుషంగా లాఠీచార్జి చేశారు. సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు రఘు, అక్కినేని వనజలతోసహా పలువురు కార్యకర్తలపై లాఠీలతో విరుచుకుపడి బీభత్సం సృష్టించారు.