సాక్షి, అమరావతి: విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధన కోసం చర్చిద్దామంటూ అఖిల సంఘాల సమావేశం ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబుకు చుక్కెదురైంది. ప్రత్యేక హోదా కోసం తాను పోరాడుతున్నట్లు చెప్పుకునేందుకు.. వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామా అంశాన్ని మరుగుపరిచేందుకు చేపట్టిన ఈ సమావేశంలో వామపక్షాలు ఆయన్ని కడిగిపారేశాయి. తాము పోరాడినప్పుడు జైళ్లలో వేసి.. ఇప్పుడు కలిసి ఉద్యమిద్దామంటారా? అంటూ నిలదీశాయి. మీతో కలిసి పనిచేయలేమని తేల్చిచెప్పాయి. ‘మీ దారి మీదే.. మా దారి మాదే’ అని చంద్రబాబుకు స్పష్టం చేశాయి. ప్రత్యేక హోదాపై ‘షో’ నడిపిద్దామనుకుంటే.. ఒక్కసారిగా సీపీఎం, సీపీఐ నేతలు నిలదీయడంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరయ్యారు.
తల పట్టుకున్న ప్రభుత్వ పెద్దలు..
నాలుగేళ్లుగా కేంద్రంలో అధికారాన్ని అనుభవించి రాజకీయ అవసరాల కోసం రకరకాల డ్రామాలాడుతున్న చంద్రబాబు అఖిల సంఘాల సమావేశం నిర్వహించడం ఏమిటంటూ.. ఈ సమావేశాన్ని వైఎస్సార్‌సీపీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తాను చేసిన పాపాన్ని అందరికీ అంటించాలని చూస్తున్నారంటూ జనసేన కూడా సమావేశానికి గైర్హాజరైంది. మరోవైపు సమావేశానికి హాజరైన సీపీఎం, సీపీఐ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డాయి. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానానికి సైతం వామపక్షాలు అంగీకారం తెలపలేదు. ప్రత్యేక హోదా సాధన సమితి కూడా కొన్ని అంశాలకు మాత్రమే మద్దతు తెలిపింది. అయినా కూడా ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు ప్రకటించి అఖిలపక్షం స్ఫూర్తిని దెబ్బతీసిందని విశ్లేషకులు పేర్కొన్నారు. అఖిల సంఘాల సమావేశం ద్వారా చంద్రబాబు రక్తికట్టించాలనుకున్న డ్రామా తుస్సుమనడమే కాకుండా.. టీడీపీకి వ్యతిరేకంగా మారడంతో ప్రభుత్వ పెద్దలు తల పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. సమావేశం ముగిసిన తర్వాత వివిధ పార్టీలు, సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబుతో కలవడమంటే..పెళ్లికెళుతూ పిల్లిని చంకన పెట్టుకోవడమే!
‘అమ్మానాన్నలను చంపి.. నేను తల్లిదండ్రులు లేనివాడిని.. క్షమించండి’ అన్నట్లుంది రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. చంద్రబాబుతో కలిసి పోరాటం చేయడమంటే పెళ్లికెళుతూ పిల్లిని చంకన పెట్టుకోవడమే. నాలుగేళ్లుగా రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో కేంద్రం పాత్ర ఎంత ఉందో.. రాష్ట్ర ప్రభుత్వం పాత్ర కూడా అంతే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దోషే. రాష్ట్రం నష్టపోవడానికి కారణం టీడీపీ, బీజేపీలే. అఖిల సంఘాల డ్రామాతో చంద్రబాబు తాను చేసిన పాపాన్ని అందరికీ రుద్దాలని చూస్తున్నారు.
– పి. మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
నాలుగేళ్లుగా హోదా గుర్తుకురాలేదా..?
ప్రత్యేక హోదాపై పోరాడాలని నాలుగేళ్ల నుంచి చంద్రబాబుకు ఎందుకు గుర్తుకు రాలేదు. అసెంబ్లీలో చెప్పిన విషయాలనే ఈ సమావేశంలోనూ చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన మాపై కేసులు పెట్టారు. పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇన్నాళ్లూ బీజేపీతో కలిసి పనిచేసి.. ఇప్పుడు ఉన్నట్టుండి మాతో కలిసి రావాలంటే ఎలా? వారి దారి వారిదే. మా దారి మాదే. మేము సమావేశంలో ఉండగా ఏ తీర్మానం చేయలేదు. మాకు ఆ తీర్మానానికి సంబంధం లేదు.
– రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
టీడీపీ రెండో ముద్దాయి..
రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో బీజేపీ మొదటి ముద్దాయి అయితే టీడీపీ రెండో ముద్దాయి. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పాం. అయినా రాష్ట్రం కోసం అందరూ కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశానికి వచ్చాం.
– చలసాని శ్రీనివాస్, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్
ప్రభుత్వం విఫలమైంది..
విభజన హామీల సాధనలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం హోదా కోసం పోరాడితే మద్దతిస్తాం. ఇప్పుడు చేయాలంటున్న పోరాటాన్ని సీఎం మూడేళ్ల కిందటే మొదలుపెట్టి ఉంటే బాగుండేది.
– గిడుడు రుద్రరాజు, జంగా గౌతమ్, కాంగ్రెస్ నేత
ప్రజా ఉద్యమంగా మారితే కలిసి పనిచేస్తాం
మమ్మల్ని ఉద్యమానికి రమ్మని ఎవరూ పిలవలేదు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. దీన్ని అధిగమించేందుకు ముందుకొస్తాం. ప్రజా ఉద్యమంగా మారితే కలిసి పనిచేస్తాం.
– అశోక్‌బాబు, ఎన్జీవోస్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు
నిరసన తెలుపుతాం..
మా పరిధిలో మేము ఆందోళన చేస్తాం. మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలుపుతాం. ప్రభుత్వ సూచనల మేరకు నల్ల బ్యాడ్జీలు ధరిస్తాం.
– బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అధ్యక్షుడు
హోదా పోరుకు మా మద్దతుంటుంది..
హోదా కోసం పోరాటం చేసే వారికి మా మద్దతు ఉంటుంది. జర్నలిస్టులు ప్రత్యేక హోదా ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషిస్తారు.
– ఐవీ సుబ్బారావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి
హోదాయే పరిష్కార మార్గం..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల దాదాపు రూ.లక్షన్నర కోట్ల నష్టం వాటిల్లింది. ఈ దశలో ప్రత్యేక హోదా ఒక్కటే పరిష్కారమార్గం. భవిష్యత్ పోరాటానికి మా వంతు సహకారముంటుంది.
– ఆంజనేయులు, ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment