
సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణలతో కలిసి జనసేనాని పవన్ కల్యాణ్ పాదయాత్ర
సాక్షి, అమరావతి: వ్యక్తిగత లాభాల కోసం ‘ప్రత్యేక హోదా’ను తాకట్టు పెట్టి, అప్పట్లో అదేమీ సంజీవిని కాదన్న వారే ఇప్పుడు హోదా కావాలంటున్నారని.. వీరిపై నమ్మకం కలగడంలేదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరోక్షంగా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. హోదా అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నమ్మకద్రోహాన్ని నిరసిస్తూ పవన్‌కల్యాణ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు శుక్రవారం విజయవాడలో జాతీయ రహదారిపై పాదయాత్ర చేశారు. ఉ.10.20 గంటలకు బెంజిసర్కిల్ వద్ద ప్రారంభమైన పాదయాత్ర 11.30 గంటలకు రామవరప్పాడు జంక్షన్ వద్ద ముగిసింది.
అనంతరం ముగ్గురు నేతలు అక్కడ.. ఆ తర్వాత ఓ ప్రైవేట్ హోటల్‌లోనూ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడి సుదీర్ఘ అనుభవం రాష్ట్రానికి ఏమాత్రం పనికిరాలేదని పవన్ స్పష్టంచేశారు. ఆయన శనివారం నిర్వహించే అఖిలపక్ష సమావేశం.. కాఫీ, టీలు తాగిరావడానికి తప్ప దేనికి ఉపయోగపడుతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం శనివారం నిర్వహించే ఆఖిలపక్ష భేటీకి తాము హాజరుకాబోమని మధు చెప్పారు.
ఆలస్యంగా మేల్కొన్నారు: ‘‘రాష్ట్రాన్ని విభజించినప్పుడు అస్తులు తెలంగాణాకు, అప్పులు ఆంధ్రాకు కట్టబెట్టారు. హక్కుగా దక్కిన హోదాను సాధించడంలో పార్టీలు విఫలం చెందాయి. ప్యాకేజీ పేరుతో ఇచ్చిన పాచిపోయిన లడ్డూలను చాలా విలువైనవని చంద్రబాబు అన్నారు. ఆయన 40 ఏళ్ల అనుభవం రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగపడలేదు. వ్యక్తిగత లాభాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. టీడీపీకి చిత్తశుద్ధి లేదుకాబట్టే అఖిల సంఘాల సమావేశానికి మేం వెళ్లలేదు’’ అని పవన్ అన్నారు. హోదా ఉద్యమంలో భాగంగా 15న అనంతపురంలో, 24న ఒంగోలులో, మే 6న విజయనగరంలో పాదయాత్రలు నిర్వహించనున్నట్లు వివరించారు.