కుప్పంలో గెలుపు కోసం చంద్రబాబు ఆపసోపాలు
తొలిసారి ఓటమి భయంతో ఆందోళన
పిఠాపురంలో పరాజయం బాటలో పవన్‌కళ్యాణ్
హిందూపురంలో బాలకృష్ణకూ షాక్!
ఆశలు వదిలేసుకున్న సుజనా, సీఎం రమేష్, పురందేశ్వరి
ఉత్తరాంధ్రలో గంటా, అయ్యన్న, కళా పరిస్థితి కూడా ఇబ్బందికరమే
ఎంత ఆరాటపడినా తెనాలిలో నాదెండ్ల గెలవడమూ అసాధ్యమే
ఓటమి అంచుల్లో పలువురు కూటమి ముఖ్య నేతలు
పైకి మేకపోతు గాంభీర్యమే.. లోలోన ఓటమి భయంతో కలవరం
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తాలేక గుంపుగా వస్తున్న టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలోని ప్రముఖ నేతలు తమ సొంత స్థానాల్లో ఎదురీదుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం సంగతి ఎలా ఉన్నా సొంత నియోజకవర్గాల్లోనే వీళ్లంతా ఓటమి బాటలో పయనిస్తుండడం ఆసక్తికరంగా మారింది. పైకి వీరంతా గంభీరంగా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నా గెలిచే పరిస్థితిలేదని పలు సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఎప్పుడూలేని విధంగా కుప్పం ప్రజలు వణికిస్తున్నారు.
ఈసారి ఆయన గెలవడం కష్టమనే పరిస్థితి నెలకొనడంతో టీడీపీ అక్కడ ప్రత్యేకంగా దృష్టిసారించినా పెద్దగా మార్పురాలేదని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో కుప్పం మున్సిపాల్టీని చేజార్చుకోవడంతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లోనూ చంద్రబాబు తొలిసారి భంగపడడంతోనే ఆయన ఓటమికి బీజంపడింది. దీంతో కుప్పంలో గెలవడమే తప్ప ఎప్పుడూ నియోజకవర్గాన్ని పట్టించుకోని చంద్రబాబు నియోజకవర్గం చుట్టూ తిరగక తప్పలేదు. ఇప్పుడు ఆయన సతీమణి భువనేశ్వరి కూడా అక్కడే మకాం వేసి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు.
గతంలో జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ ఆమె ఇలా ప్రచారం చేసిన దాఖలాల్లేవు. శాంతిపురం మండలంలో ఈసారి చంద్రబాబుకు గట్టి షాక్ తగిలే పరిస్థితి ఉంది. బెంగుళూరు నుంచి 200 మంది ఐటీ ప్రొఫెషనల్స్‌ని రెండునెలలుగా కుప్పంలో ఉంచి పనిచేయిస్తున్నా గెలుస్తామనే నమ్మకం చంద్రబాబులో కనిపించడంలేదు. సీఎంగా చేసినప్పుడు కూడా కుప్పం గురించి ఆయన పట్టించుకోలేదనేది స్థానికుల నిశ్చితాభిప్రాయం.
ఆయన్ను కుప్పం ప్రజలు ఎనిమిదిసార్లు గెలిపించినా చంద్రబాబు కుప్పంను రెవెన్యూ డివిజన్‌గా చేయలేకపోయారు. వైఎస్ జగన్ వచ్చాక కుప్పం రెవెన్యూ డివిజన్, పోలీసు సబ్‌డివిజన్ ఏర్పాటుచేశారు. ఇన్నాళ్లూ కనీసం కుప్పంలో సొంత ఇల్లు కూడా చంద్రబాబు కట్టుకోలేదు. కేవలం తనకు ఓట్లేసే మిషన్లుగా అక్కడి జనాన్ని ఆయన చూశారు. దీన్నిబట్టే ఆయనకు కుప్పంపై ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని అక్కడి ప్రజలు గమనించారు.
మరోవైపు.. అభివృద్ధితోపాటు ప్రజలకు ఎలాంటి భేదాలు లేకుండా సంక్షేమ పథకాలు అందడంతో వైఎస్ జగన్‌పట్ల ఆదరణ కనిపిస్తోంది. దీంతో కుప్పంలో చంద్రబాబును ఓటమి భయం వెంటాడుతోంది. ఇవే తన చివరి ఎన్నికలు కాబట్టి తనను గెలిపించాలంటూ ఆయన అభ్యర్థిస్తుండడాన్ని బట్టి ఆయన్ను ఓటమి భయం వెంటాడుతోందని స్పష్టమవుతోంది.
పిఠాపురంలో పవన్‌కు నాన్‌లోకల్ గండం
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో గెలుపునకు చాలా దూరంలో ఉన్నారు. ఒక్కసారి తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఆయన దీనంగా ప్రాథేయపడుతున్నా జనం మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. సినిమా స్టార్ కాబట్టి చూడ్డానికి రావడం తప్ప ఓటు వేస్తారా లేదా అనే దానిపై జనసేన నాయకులకే నమ్మకం కలగడంలేదు.
నాన్ లోకల్ కావడం, కేవలం కులం ఓట్ల ప్రాతిపదికనే పవన్ అక్కడ పోటీచేస్తుండడం ఆయనకు పెద్ద మైనస్ పాయింట్లుగా మారాయి. పవన్ తమ ఎమ్మెల్యే అయితే ఆయన్ను కలవడం కుదరదని, తమకు ఏమైనా సమస్య వస్తే వెళ్లి చెప్పుకునే అవకాశం ఉండదనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఆయన పూర్తిస్థాయి రాజకీయ నేత కాకపోవడంతో ఎంతవరకూ నమ్మవచ్చనే అనుమానాలూ జనంలో ఉన్నాయి.
అయితే, జబర్దస్త్ షో ఆర్టిస్టులు, సినిమా వాళ్లు, పలువురు మెగా ఫ్యామిలీ హీరోలు పిఠాపురంలో ఆయనకు అనుకూలంగా ప్రచారం చేస్తూ హడావుడి చేయడం అక్కడి జనానికి వినోదం పంచుతోంది. టీడీపీ ఇన్‌ఛార్జి వర్మ పైకి పవన్ కోసం పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నా, లోపాయకారీగా టీడీపీ కేడర్‌ను సైలెంట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎంత హంగామా చేసినా జనంలో మాత్రం పవన్ గెలుపునకు దోహదపడే అంశాలు కనిపించడంలేదు.
ఈసారి బాలయ్యకూ నిరాశే..
హిందూపురంలో నందమూరి బాలకృష్ణ కూడా ఈసారి గట్టెక్కడం కష్టంగా మారింది. మైనారిటీలు ఎక్కువగా ఉండడంతో వారు ఈసారి బాలయ్యకు ఝలక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు.. కూటమి రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి టీడీపీ ఓట్లను భారీ సంఖ్యలో చీల్చే అవకాశం ఉంది. అలాగే, టీడీపీ కేడర్, ద్వితీయశ్రేణి నేతల్లోనూ బాలకృష్ణ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాలకృష్ణ వల్ల ఉపయోగం లేకుండాపోయిందని బాధపడుతున్నారు.
ఆయన ఇక్కడ ఎవరికీ అందుబాటులో ఉండకపోవడం, ఎప్పుడూ నందమూరి కుటుంబాన్ని గెలిపించడమే తప్ప వారిక్కడ లేకుండా తమపై పెత్తనం చేయడంపై వారిలో అసహనం కనిపిస్తోంది. దీనికితోడు వైఎస్సార్‌సీపీ బీసీ అభ్యర్థిని నిలబెట్టడంతో ఆ ఓట్లలోనూ భారీ చీలిక తప్పదంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాలకృష్ణ కంచుకోట బద్దలవుతుందని గట్టిగా వినిపిస్తోంది.
ఓటమి అంచున ఉత్తరాంధ్ర ముఖ్యనేతలు..
ఉత్తరాంధ్రలో టీడీపీ ముఖ్య నేతలైన గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితిలు సైతం ఈ ఎన్నికల్లో గెలవడం కష్టంగా మారింది.
» తరచూ నియోజకవర్గాలు మార్చే నేతగా ముద్రపడిన గంటా శ్రీనివాసరావును భీమిలి జనం నమ్మడంలేదు. 2014 ఎన్నికల్లో గెలిపిస్తే భూ కుంభకోణాలతో జనాన్ని భయభ్రాంతులకు గురిచేయడాన్ని వారింకా మరచిపోలేదు. గంటా గెలిస్తే తమ భూములు ప్రమాదంలో పడతాయనే ఆందోళన ఉంది. అలాగే, గెలిచినా నియోజకవర్గాన్ని పట్టించుకోరనే వాదనా ఉంది. వీటికితోడు విశాఖను పరిపాలనా రాజధానిగా చేసే విషయంలో ఆయన వైఖరిపైనా వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో గంటా గెలవడం సాధ్యంకాదని చెబుతున్నారు.
» నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఎదురీదుతున్నారు. వివాదాలు, నోటి దురుసుతనంతో ఆయన ప్రజల ఆదరణ కోల్పోయారు.
» ఎవరూ పోటీచేయడానికి ముందు రాకపోవడంతో చీపురుపల్లి బరిలో నిలుచున్న కళా
వెంకట్రావుకు గెలుపు ఆశలేలేవని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణను ఎదురొడ్డి కళా నిలబడడం అసా«ద్యమని ఆదిలోనే తేలిపోయింది. ఆయన మొక్కుబడిగానే ప్రచారం చేస్తున్నారు.
» ఇక విజయనగరంలో అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి సెంటిమెంటునే నమ్ముకుని తనను గెలిపించాలని కోరుతున్నా స్థానికంగా అంత స్పందన రావడంలేదు. ఆమె గెలిచినా కోటకే పరిమితమవుతారని అందుబాటులో ఉండరనే అభిప్రాయం నెలకొంది. టీడీపీ రెబల్‌గా మీసాల గీత ఉండడం, ఆమె చీల్చే ఓట్లు గణనీయంగా ఉండే అవకాశం ఉండడంతో అదితికి ఓటమి తప్పదంటున్నారు.
» అనకాపల్లిలో జనసేన తరఫున కొణతాల రామకృష్ణ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఆయన ప్రజలకు దూరమై చాలాకాలం కావడంతో ఇప్పుడు గెలిచి ఏం చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
» రాజమండ్రి రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, డోన్‌లో కోట్ల సూర్యప్రకాశరెడ్డి గెలుపు అవకాశాలకు దూరంగానే ఉన్నారు.
» మంగళగిరిలో చంద్రబాబు తనయుడు లోకేశ్ ఎంత ప్రయత్నిస్తున్నా గెలుపు ఊపు రావడంలేదు. తాయిలాలపైనే నమ్మకం పెట్టుకున్నా అది కూడా నెరవేరే సూచనలు కనిపించడంలేదు. రెండోసారి మంగళగిరి ప్రజలు ఆయన్ను తిరస్కరిస్తారనే వాతావరణం కనిపిస్తోంది.
సీఎం రమేష్, సుజనా, కిరణ్, పురందేశ్వరి, నాదెండ్ల..
పొత్తులో సీట్లు దక్కించుకుని బీజేపీ తరఫున అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట ఎంపీ స్థానాల నుంచి పోటీచేస్తున్న సీఎం రమేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలకు గెలుపుపై ఆశలు వదిలేసుకున్నారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నుంచి బీజేపీ తరఫున సుజనా చౌదరి, తెనాలి నుంచి జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ధనబలం, కులబలంతో గెలవొచ్చని వారు బరిలోకి దిగినా అందుకు అవకాశాలు లేకపోవడంతో వారికి కళ్లెదుటే ఓటమి సాక్షాత్కరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment