⇒ ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయిలపై కేంద్రానికి సర్కారు లేఖ
⇒ ఎన్‌ఈఎఫ్‌ఎంఎస్ అమల్లోకి వచ్చినా నిధులు విడుదల చేయని కేంద్రం
⇒ రాష్ట్రంలో 7 లక్షల మంది కూలీల ఖాతాలకు చేరని రూ. 80 కోట్ల బకాయిలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. గత 50 రోజులుగా కేంద్ర ప్రభుత్వం వేతన కాంపోనెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూలీలకు వేతన బకాయిలు పేరుకు పోతున్నాయి. క్షేత్రస్థాయిలో ఉపాధి పనులు చేసిన కూలీల నుంచి ఆందోళన వ్యక్తమవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వమే వేతన బకాయిలను చెల్లించేందుకు సన్నద్ధమైంది.
వారికి ఇవ్వాల్సిన వేతన బకాయిలు రూ. 80 కోట్లను తామే చెల్లిస్తామని, ఆపై తాము చెల్లించిన మేరకు నిధులను తిరిగి రీయింబర్స్‌మెంట్ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. రీయింబర్స్ చేసేందుకు కేంద్రం నుంచి ఆమోదం లభించిన పక్షంలో దాదాపు 7 లక్షల మంది కూలీల బ్యాంకు ఖాతాలకు వారి వేతన బకాయిలను వెంటనే జమ చేసేలా ఏర్పాట్లు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మెటీరియల్ కాంపోనెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన నిధుల్లో రూ. 99 కోట్లను ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖ ఖాతాకు జమ చేసింది.
అప్పుడు రాష్ట్రం.. ఇప్పుడు కేంద్రం..
గతేడాది కేంద్రప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించినందున ఉపాధి పనులు చేసిన కూలీలకు సకాలంలో వేతనాలు అందలేదని ఫిర్యాదులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇకపై తామే నేరుగా ఉపాధి పనులు చేసిన కూలీలకు వేతనాలను చెల్లిస్తామని గత జనవరిలో ప్రకటించింది. అయితే.. కేంద్ర ప్రభుత్వం కూడా గత 50 రోజులుగా ఉపాధి పనులు చేసిన కూలీలకు వేతనాల నిమిత్తం నిధులు విడుదల చేయలేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు వేతనాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసే నిమిత్తం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ (ఎన్‌ఈఎఫ్‌ఎంఎస్)ను కేంద్ర ప్రభుత్వం గత జనవరిలో ఏర్పాటు చేసింది. అయితే.. పనులు చేసిన కూలీలకు ఎప్పటికప్పుడు వారి వేతనాలు బ్యాంకు ఖాతాలకు జమ కావాల్సి ఉండగా, గత 50 రోజులుగా కూలీల ఖాతాల్లో నయాపైసా కూడా పడలేదు. కేంద్రం ఇస్తుందిలే అని రాష్ట్ర ప్రభుత్వం కూడా మిన్నకుండటంతో రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీల పరిస్థితి దయనీయంగా మారింది.
ఎందుకీ నిధుల కొరత..
కేంద్ర ప్రభుత్వం వేతన కాంపోనెంట్‌ను విడుదల చేయకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం వద్ద మెటీరియల్ కాంపోనెంట్‌కు మాత్రమే నిధులు ఉండటంతో వేతనాలిచ్చేందుకు నిధుల కొరత ఏర్పడింది. జనవరి 1 నుంచి 10 రోజుల పాటు ఎన్‌ఈఎఫ్ ఎంఎస్ ద్వారా ఉపాధి పనులు చేసిన కూలీలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి నేరుగా వేతనాలు అందగా, జనవరి 11 నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి.
మేమే చెల్లిస్తాం.. తిరిగి ఇస్తారా?
Published Wed, Mar 1 2017 12:58 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement